తెలంగాణ

తెరాస అసంతృప్త ఎమ్మెల్యే షకీల్ బీజేపీలో చేరుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, బోధన్, సెప్టెంబర్ 12: తెరాసలో మంత్రివర్గ విస్తరణ అనంతరం అసంతృప్తి సెగలు ఒక్కోటిగా తెరపైకి వస్తున్న క్రమంలోనే, ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ఆమిర్ సైతం అధిష్టానానికి ఒకింత షాక్ ఇచ్చేలా వ్యవహరించారు. తెరాసకు బద్ధ విరోధిలా వ్యవహరిస్తున్న బీజేపీకి చెందిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్‌తో ఎమ్మెల్యే షకీల్ భేటీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత గత పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా తెరాస తరఫున పోటీ చేయగా, అర్వింద్ ఆమెను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విదితమే. దీంతో అర్వింద్ ఎంపీగా గెలిచినప్పటికీ, తెరాస ప్రజాప్రతినిధులంతా ఆయనను కలువకుండా దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎంపీ అర్వింద్‌ను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకుని సుదీర్ఘ మంతనాలు జరపడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయాన్ని ఎంపీ అర్వింద్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తూ, తమ మధ్యన తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొనడం విశేషం. ఈ పోస్టింగ్ వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే షకీల్ పార్టీ మారే అవకాశం ఉందని విస్తృత ప్రచారం నెలకొంది. ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తుండగా, మరోవైపు మంత్రివర్గ విస్తరణలో షకీల్‌కు బెర్తు దక్కకపోవడంతో ఆయన పార్టీ ఫిరాయించనున్నారనే ప్రచారానికి ఊతమందినట్టు అవుతోంది. మైనార్టీ వర్గం నుండి రెండు పర్యాయాలు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని షకీల్‌తో పాటు ఆయన అనుచరులు గట్టి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. కానీ షకీల్‌కు అవకాశం కల్పించకపోవడంతో ఆయన ఒకింత నిరుత్సాహానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలనే యోచనతో బీజేపీ ఎంపీ అర్వింద్‌ను కలిసి మంతనాలు జరిపి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని షకీల్ ప్రధాన అనుచరులు కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఎమ్మెల్యే తెరాసను వీడే ప్రసక్తే ఉండదని, అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించేందుకై ఎంపీ అర్వింద్‌ను మర్యాదపూర్వకంగానే కలిసి ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఒకవేళ అనుచరులు చెప్పేదే వాస్తవమైతే అర్వింద్ ఎంపీగా ఎన్నికైన ఇన్నాళ్లపాటు ఆయనను షకీల్ ఎందుకు కలువలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే షకీల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేకుండాపోయారు. కాగా, హఠాత్తుగా బీజేపీ ఎంపీ అర్వింద్‌ను షకీల్ కలువడం వెనుక, ఆయనపై ఇదివరకు నమోదై ఉన్న పెండింగ్ కేసులు కూడా కారణమై ఉండవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మనుషుల అక్రమ రవాణాతో పాటు క్రికెట్ బెట్టింగ్ కేసులతో ఎమ్మెల్యే షకీల్‌కు ప్రమేయం ఉన్నట్టు ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులను కేంద్రం మళ్లీ తిరగదోడేందుకు ప్రయత్నిస్తోందనే సంకేతాలు అందడంతో ఆయన బీజేపీ ఎంపీ అర్వింద్‌ను కలిసి ఉంటారనే ప్రచారం సైతం జరుగుతోంది. మొత్తం మీద షకీల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా బీజేపీ ఎంపీ అర్వింద్‌తో భేటీ కావడం రాజకీయ వేడిని రగిల్చినట్లయ్యింది.
*చిత్రం...బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలిసి పూలబొకేను అందజేస్తున్న బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌ఆమిర్