తెలంగాణ

హుజూర్‌నగర్ ఎన్నికపై రాజకీయాలు షురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21 హుజూర్‌నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణం నుంచే, రాజకీయాల సందడి పెరిగింది. గెలిచేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన సైదిరెడ్డి ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. కాగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద మెజారిటీతో గెలుస్తారని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బీజేపీ కూడా ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనుంది. ఈ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు. అనంతరం ఆయన నల్లగొండ ఎంపీగా కాంగ్రెస్ నుంచి ఎన్నికకావడంతో, ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో తమ పార్టీ అభ్యర్థికి ఊహించని మంచి మెజారిటీ వస్తుందన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం ఓటర్లు టీఆర్‌ఎస్‌ను గెలిపించాలనే నిర్ణయంతో ఉన్నారన్నారు. అభివృద్ధిలో ఈ ప్రాంతం వెనకబడి ఉందని, అధికార పార్టీని గెలిపించాలనే తాపత్రయంతో ఓటర్లు ఉన్నారన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌ననగర్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఉత్తమ్‌కు తమ పట్ల ఉన్న చులకన భావం, అభివృద్ధి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనించారన్నారు. 2014 తర్వాత హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క సమస్యను కూడా జిల్లా మంత్రిగా ఉన్న తన వద్దకు గాని, సీఎం కేసీఆర్ దృష్టికి కాని తీసుకురాలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు తోడు స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ బెదిరింపులకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించిన సందర్భాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక అన్నారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు, ప్రజాస్వామ్యానికి అవసరమన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్నారు. కొందరు అధికారులు ఏక పక్షంగా పనిచేస్తున్నారన్నారు. వారు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌లో ఓనర్‌లను కిరాయిదారులకు గొడవ నడుస్తోందన్నారు. ఉద్యమకారులను టీఆర్‌ఎస్ వాడుకుని వదిలేస్తుందన్నారు. కాగా తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసీసీని కోరారు. తాను మొదటి నుంచి పార్టీ విధేయుడుగా, పార్టీ విస్తరణకు పనిచేస్తున్నానన్నారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కిరణ్‌కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బలపరుస్తున్నారు. కాగా శ్రీమతి పద్మావతికి ఎఐసీసీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆమె టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భార్య. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పద్మావతి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ప్రచారం మొదలు పెట్టారు.
*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జగదీష్ రెడ్డి, పక్కన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి