తెలంగాణ

కమ్యూనిస్టు నేత ఉజ్జిని కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 13: భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత, మునుగోడు నియోజకవర్గం మాజీ హాట్రిక్ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు (90) బుధవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉ. 5.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారంలో సాయంత్రం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల రెడ్ శెల్యూట్ మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఉజ్జిని అంతిమయాత్రలో వామపక్ష శ్రేణులు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన నివాళులర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎంపిలు బూర నర్స.యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఆదిరెడ్డి, వివిధ పార్టీల నేతలు మాజీ ఎంపి మల్లు రవి, బద్ధం నారాయణరావు, జూలకంటి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, బిల్యానాయక్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పోరాటలే ఊపిరిగా ఉజ్జిని ప్రస్థానం
తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన ఉజ్జిని స్వతంత్ర సమరయోధుడిగా జిల్లా పరిధిలోని దేవరకొండ, మునుగోడు, సాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా అనేక ప్రజాపోరాటాలను సాగించి పేదలు, వృత్తిదారుల సంక్షేమానికి తన జీవిత పర్యంతం కృషి చేశారు. 30-5-1927న నారాయణరావు ధనిక కుటుంబంలో జన్మించినా పేదల పక్షపాతిగా, కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగారు. విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు పార్టీ ప్రభావితుడై ప్రజా ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించారు. 1951లో దేవరకొండ తాలుకా పార్టీ కార్యదర్శిగా ఎన్నికై 12 ఏళ్లు ఈ ప్రాంతంలో ప్రజాపక్ష పోరాటాలతో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశారు. ధర్మభిక్షం, ఎలమందలతో కలిసి ఎర్రజెండా నీడన భూపోరాటాలు సాగించి పేదలకు భూపంపిణీకి పాటుపడ్డారు. సకాయి బకాయి పన్ను ఉద్యమం దేవరకొండ తాలుకాలో ఆయనకు గుర్తింపు తెచ్చింది. మునుగోడు నియోజకవర్గం నుండి 1967ఎన్నికల్లో కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి 1985లో కాంగ్రెస్ నేత ఎం.నారాయణరావుపై తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994 ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై వరుస విజయాలు సాధించి హాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఉజ్జిని నారాయణరావు కుమారుడు ఉజ్జిని యాదగిరిరావు సైతం 2009 ఎన్నికల్లో పాల్వాయిపై గెలుపొందారు.