తెలంగాణ

హుజూర్‌నగర్ పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు..పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రశాంతంగా సాగిన పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఆయా కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 84.15 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, సూర్యాపేట కలెక్టర్ అమయకుమార్ తెలిపారు. ఈనెల 24న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. నియోజకవర్గం పరిధిలోని హుజూర్‌నగర్ మున్సిపాల్టీ, నేరడుచర్ల మున్సిపాల్టీ, వాటి మండలాల పరిధుల్లోని గ్రామాలతోపాటు మఠంపల్లి, మేళ్లచెర్వు, పాలకీడు, చింతలపాలెం మండలాల్లోని గ్రామాల్లో మహిళలు, యువకులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా, వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు సైతం సహాయకుల ద్వారా
పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు 52.89 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 70 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 82.33 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటికే క్యూలైన్లలో మిగిలిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తంగా 84.15 శాతం పోలింగ్ నమోదైంది.
ఇదిలావుండగా, మఠంపల్లి మండలం గుడ్లపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, హుజూర్‌నగర్ ఎనె్నస్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి చావ కిరణ్మయి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డికి, బీజేపీ అభ్యర్థి కోట రామారావుకు స్థానికంగా ఓటు హక్కు లేకపోవడంతో వారు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. మఠంపల్లి మండల పరిధిలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో మొదటి ఈవీఎం స్థానంలో రెండో ఈవీఎం పెట్టడంతో ఓటర్లు కొంత అయోమయానికి లోనవుతున్నారంటూ టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే వాటిని సరిచేశారు. అలాగే నేరడుచర్ల మండలం చింతబండ, దిర్శించర్ల, గరిడేపల్లి మండల కేంద్రంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం గంట పాటు ఈవీఎంలు మొరాయించిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పోలింగ్ నిరాటంకంగా కొనసాగించారు. పోలింగ్ సాగిన తీరుతెన్నులను ఆయా కేంద్రాల సందర్శన ద్వారా కేంద్ర ఎన్నికల పరిశీలకులు సత్యేంద్ర ప్రతాప్ సింగ్, వ్యయ పరిశీలకుడు గోఖలే, కలెక్టర్ అమయకుమార్, ఎస్పీ భాస్కరన్ పరిశీలించి పోలింగ్ సజావుగా సాగేలా మార్గదర్శకం చేశారు. మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉండగా వారిలో 84.15 శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.
పోలింగ్ ప్రక్రియ ముగిసిపోగా అభ్యర్థుల భవితవ్యాన్ని, ఓటర్ల తీర్పును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. పోలింగ్ తీరుతెన్నులు..ఓటింగ్ సరళిపై పార్టీల అభ్యర్థులు తమ కేడర్ ద్వారా విశే్లషణలో మునిగిపోయారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎంతమేరకు ఓట్లు పడ్డాయన్న కూడికలు, తీసివేతల లెక్కలతో అభ్యర్థులు కసరత్తు సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు అభ్యర్థుల నుండి అందాల్సిన తాయిలాలు అందాకే ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగింది. మొత్తమీద ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి మధ్య కొనసాగినట్లు పలువురు విశే్లషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 86.38 శాతం పోలింగ్ నమోదు కాగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 7406 ఓట్లతో గెలుపొందారు. ఈ దఫా ఉప ఎన్నికలో 84.15 శాతం పోలింగ్ నమోదు కావడంతో గెలుపుపై కాంగ్రెస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. అయితే పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ రోజున అధికార పార్టీ అమలు చేసిన పోల్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు, ఓటర్లకు అందించిన తాయిలాల నేపథ్యంలో ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు తథ్యమన్న ధీమాను గులాబీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

*చిత్రం... హుజూర్‌నగర్‌లో బారులు తీరిన ఓటర్లు