తెలంగాణ

శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 21: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో సోమవారం ఉదయం అధికారులు వరద గేట్లను పైకిలేపి, మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. గడిచిన మూడేళ్ల తరువాత ఎస్సారెస్పీ గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుంది. రిజర్వాయర్ ఎగువన గల మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు మిగులు జలాలతో పాటు, గోదావరి పరీవాహక ప్రాంతాలైన నాందేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి 83 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 16 ఫ్లడ్‌గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. ఉదయం 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 9గంటల ప్రాంతంలో మొదటగా 8 వరద గేట్లను రెండు అడుగుల మేర పైకి లేపి 25 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు వదిలారు. అనంతరం 11.30 గంటల సమయంలో 12 గేట్లను ఎత్తగా, మధ్యాహ్నం సమయానికి వరద నీటి ఉద్ధృతి 83 వేలకు పెరగడంతో 16 గేట్లను పైకి ఎత్తి మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. ఫ్లడ్‌గేట్ల ద్వారా 75 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం వల్ల ఎస్సారెస్పీ నీటి మట్టాన్ని గరిష్ఠ స్థాయిలోనే 1091.00 అడుగులు, 90.313 టీఎంసీల వద్ద నిలువ ఉంచుతూ, వచ్చి చేరుతున్న వరద జలాలను వచ్చినట్టుగానే దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులో ఈ సీజన్‌లో ఇప్పటివరకు 94 టీఎంసీల మేర నీటి నిల్వలు వచ్చి చేరాయని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వరద ప్రవాహం మరో 36 నుండి 48 గంటల వరకే ఇదే తరహాలో వచ్చి చేరే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఎస్సారెస్పీ వరద గేట్లు తెరిచినందున నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన మెండోరా, ఏర్గట్ల, గుమ్మిర్యాల, సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ తదితర మండలాల పరిధిలోని ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేశారు. పశువుల కాపర్లు, గోదావరి నదిలో మోటార్లు ఏర్పాటు చేసుకున్న రైతులు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు గోదావరిలో దిగకూడదని హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రవాహం మరింతగా పెరగనున్న నేపథ్యంలో ఫ్లడ్‌గేట్ల ద్వారా నీటి విడుదలను సైతం పెంచాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లోను అంచనా వేస్తూ, తదనుగుణంగా అంతేమొత్తం నీటిని విడుదల చేస్తున్నామని ఎస్సారెస్పీ ఈఈ రామారావు తెలిపారు. గత 2016 సెప్టెంబర్ మూడవ వారంలో ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో నిండగా, అనంతరం మళ్లీ మూడేళ్ల తరువాత గరిష్ఠ నీటిమట్టాన్ని సంతరించుకుంది. నిజానికి జూలై నెలాఖరు వరకు కూడా ఎస్సారెస్పీ డెడ్‌స్టోరేజీకే పరిమితమైంది. రాష్ట్రంలోని ఇతర భారీ ప్రాజెక్టులన్నీ నీటి నిల్వలను సంతరించుకోగా, ఎస్సారెస్పీ వెలవెలబోతూ కనిపించడం ఒకింత ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలు ఎస్సారెస్పీ ఆయకట్టు ఆశలను సజీవంగా నిలిపాయి. అదే సమయంలో ఎగువన మహారాష్టల్రోని విష్ణుపురి, అంధేరా తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి మిగులు జలాలను దిగువకు వదలడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుని, మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోవడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలలోని సుమారు 8లక్షల ఎకరాల ఆయకట్టు పంటలకు ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ సీజన్‌లోనూ సాగునీటి బెంగ దూరమైనట్టేనని ఆయకట్టు ప్రాంత రైతుల్లో ఎనలేని హర్షం వ్యక్తమవుతోంది.
*చిత్రం... పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా తొణికిసలాడుతున్న శ్రీరాంసాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి దిగువకు దూకుతున్న వరదనీరు