తెలంగాణ

భావి అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భవిష్యత్తు జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా పట్టణాల్లో మాస్టర్ ప్రణాళికలను రూపొందించుకోవాలని పట్టణాభివృద్ధి సంస్థలను మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. దీని కోసం పట్టణాభివృద్ధి సంస్థలు కార్యాచరణ తయారు చేసుకొని స్వయం సమృద్ధిగా మారేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో గురువారం పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిలో పట్టణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తు చేశారు. పట్టణాల భవిష్యత్ కోసం కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 43 శాతం ఉన్న పట్టణ జనాభా సమీప భవిష్యత్‌లో ఇది 50 శాతానికి చేరుకోబోతుందని అన్నారు. పట్టణాల విస్తరణ, జనాభా అవసరాలకు కోసం ప్రణాళికబద్ధంగా
అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడం పట్టణాభివృద్ధి సంస్థల ప్రాథమిక విధిగా అభివర్ణించారు. ఈ దిశగా అన్ని పట్టణాభివృద్థి సంస్థలు తమ కార్యాచరణను ప్రారంభించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్లలో గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్, చెరువులు, సరస్సుల వంటి నీటి వనరుల రక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రచురణకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు మాస్టర్ ప్లాన్‌పై అవగాహన కోసం శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి చైర్మన్లు, సంబంధిత అధికారులు హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. పట్టణాభివృద్ధి సంస్థలు స్వయం సమృద్ధి సాధించేందుకు ల్యాండ్ పూలింగ్ చేసుకోవాలని, సొంత ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాల్టీలకు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌కు అవకాశం ఇవ్వడంతో అక్రమ లే అవుట్లకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, అటవీ భూములతో కూడిన ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ 7,600 చదరపు కిలో మీటర్ల పరిధిలో వినూత్నమైన విధానాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని, దీని అనుభవాలతో ఇతర పట్టణాభివృద్ధి సంస్థలు అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా మంచి ప్రగతి సాధించిన పట్టణాభివృద్ధి సంస్థలకు ఎంపిక చేసుకొని అధ్యయనం చేయాలని చైర్మన్లు, అధికారులకు మంత్రి సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థలు ఈ చట్టంలో తీసుకరావాల్సిన మార్పులపై నివేదిక తయారు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, కాకతీయ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, శాతవాహన అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ జివి రామకృష్ణారావు, సిద్దిపేట అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్