తెలంగాణ

ఆర్థిక మాంద్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 8: ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఏర్పడటానికి కేంద్రంలోని బీజేపి, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలే కారణమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. శుక్రవారం వరంగల్ నగరంలోని ఏకశిల పార్కు వద్ద నిర్వహించిన కాంగ్రెస్ ధర్నా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాష్టమ్రుఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కూడా మాయమాటలతో రెండుసార్లు అధికారం చేపట్టినప్పటికీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ముందు నల్లధనాన్ని విదేశాల నుండి తెప్పించి ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. ఆర్థిక అంశాలపై ఏ మాత్రం అవగాహన లేని ప్రధాన మంత్రి మోదీ తీసుకున్న అతిపెద్ద అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థికవ్యవస్ధ కుదేలయిందని అన్నారు. 2004 నుండి 2014 వరకు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆచితూచి తీసుకున్న ఆర్థిక విధానాల వల్ల భారతదేశం పటిష్టమైన ప్రపంచ దేశాలతో పోటీపడి జీడీపీ రేటు ఏటేటా పెరుగుతూ సుమారు 8 వరకు చేరిందన్నారు. ఈ అనాలోచిత నిర్ణయాలతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు పోయి, కొత్త ఉద్యోగాలు లేక, అనేక పరిశ్రమలు మూతబడి తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్కూల్ ఇండియా, స్టార్టప్ ఇండియాలాంటి నినాదాలతో హోరెత్తించిన మోదీ ప్రభుత్వం అవేమీ సాధించకుండా భారత దేశాన్ని తాకట్టుపెట్టే విధంగా ప్రాంతీయ విస్తృత ఆర్థిక భాగస్వామ్యం పేరు మీద ఒక తప్పుడు ఒప్పందానికి దక్షణ తూర్పు ఆసియా దేశాలతో శ్రీకారం చుడుతోందని అన్నారు. ఈ ఒప్పందం గనుక పూర్త్తయితే చైనా వస్తువులతో భారతదేశం చైనా డంపింగ్ యార్డ్‌లా మారుతుందని అన్నారు. ఒప్పందం వలన భారతదేశ ఆర్థిక అస్తిత్వాతానికి నష్టం కలిగించేలా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం పరిశ్రమలు, ఉత్పత్తి రంగంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చతికిలపడే ప్రమాదం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే వస్తు ఎగుమతులు ఎక్కువగా ఉండాలి కాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగుమతులు తగ్గి దిగుమతులు ఎక్కువయ్యాయని అన్నారు. దీని వల్ల లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మరిచి మోదీ ప్రభుత్వం రైతుల పాలిట మహమ్మారిగా ఈ ఒప్పందం చేసుకుందని అన్నారు.
దాదాపు నెల రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశిస్తే ఈ ప్రభుత్వం అధికారులతో అబద్ధాలు ఆడిస్తోందని పొన్నాల ఆరోపించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక అంశాలపై హైకోర్టు అక్షింతలు వేసినా చీమ కుట్టినట్టయనా లేని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి చరిత్రలో నియంతగా మిగిలిపోతాడని అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్, కాంగ్రెస్ నేత వరదరాజేశ్వర్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.