తెలంగాణ

గాంధీ భవన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఖైరతాబాద్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. ఉదయం 10 గంటలకే పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా, సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, సీఎల్‌పీనేత భట్టి విక్రమార్క తదితరులు అక్కడ ఉన్నారు. ర్యాలీకి అనుమతి లేదని, కార్యకర్తలు, నేతలు వెనక్కువెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ నుంచి బయటకు వచ్చారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వ్యాన్లలో కార్యకర్తలు, నేతలను బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది. చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేత కే. వెంకటేష్ పోలీసుల తోపులాటలో కిందిపడిపోగా గాయాలయ్యాయి. వెంటనే వెంకటేషన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స నిమిత్తం చేర్పించారు. పోలీసులు అడ్డుకుంటుండగా, కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ‘మోదీ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. కాగా, తాము రాజ్‌భవన్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించేందుకు అనుమతి ఉందని పోలీసులకు సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. అనంతరం ఆర్‌సీ కుంతియా, జానారెడ్డి తదితరులు మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి మాట్లాడుతూ పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. పోలీసుల నిర్బంధం పెరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.