తెలంగాణ

ఇద్దరు రైతుల ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 11: భూ సమస్యలు కొలిక్కి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పలువురు రైతులు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇదే తరహా సమస్యలతో సోమవారం నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు తరలివచ్చి వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. బోధన్ మండలం అమ్దాపూర్‌కు చెందిన నీరడి అబ్బవ్వ అనే మహిళ అయితే ఏకంగా ప్లాస్టిక్ కవర్‌లో పెట్రోల్ వెంట తెచ్చుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా, అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే తేరుకుని ఆమెను అడ్డుకున్నారు. తగ్గెల్లి శివారులో నీరడి అబ్బవ్వకు చెందిన ఒక ఎకరం మూడు గుంటల భూమికి సంబంధించిన డిజిటల్ పట్టా పాస్‌బుక్‌లు ఆమెకు అందించకుండా, సదరు భూమి నడిపి సాయిగొండ అనే వ్యక్తికి చెందినదని పహాణి నకలులో పేర్కొనడంతో అబ్బవ్వ ఆత్మహత్యకు యత్నించింది. 40సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం తమకు ఈ స్థలం కేటాయించిందని, తన భర్త 2013లో చనిపోవడంతో 2015లో ఆ భూమి తన పేరిట మార్పిడి కూడా జరిగిందని అబ్బవ్వ తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ పట్టా పాస్‌బుక్కును అందించాలని తాను రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంటే, వారేమో లంచాలు తీసుకుని తన భూమిని సాయిగొండకు చెందినదిగా అతని పేరుతో పహాణి నకలు రూపొందించారని బాధితురాలు ఆరోపించింది. తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమి తనకు దక్కకపోతే చావే శరణ్యమని వాపోయింది.
ఇదిలాఉండగా, దాదాపు ఏడాది కాలం నుండి తన సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్కం గంగాధర్ అనే రైతు సోమవారం ప్రజావాణిలో అర్జీని అందించేందుకు వచ్చిన సందర్భంగా కలెక్టరేట్ వద్ద చెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన స్థానిక యువకుడొకరు ఎంతో లాఘవంగా చెట్టుపైకి ఎక్కి గంగాధర్ చేతిలో ఉన్న తాడును లాక్కున్నాడు. పోలీసులు, కలెక్టరేట్ అధికారులు నచ్చజెప్పడంతో సదరు రైతు కిందకు దిగి వచ్చాడు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన అక్కం గంగాధర్‌కు రేకులపల్లి శివారులో రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరుబావి ద్వారా సాగునీటి వసతి పొందుతూ పంటలు పండించేవాడు. అయితే ఏడాదిన్నర క్రితం అతని తమ్ముడు సంతోష్ 50మీటర్ల దూరంలోనే మరో బోరు తవ్వించడంతో గంగాధర్ బోరుబావిలోని నీటి ఊట మళ్లిపోయి అది వట్టిపోయింది. అప్పటి నుండి గంగాధర్ తనకు న్యాయం చేయాలంటూ స్థానిక తహశీల్దార్‌కు, నిజామాబాద్ ఆర్డీఓకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు గత ఆగస్టు 5వ తేదీన ప్రజావాణిలో కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ అధికారుల నుండి స్పందన కరువవడంతో మరోమారు ప్రజావాణిలో తన గోడును వెళ్లబోసుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చాడు. అయితే అతనిని లోనికి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం చెందిన గంగాధర్ కలెక్టరేట్‌లోని చెట్టు పైకి ఎక్కి తాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు.
అతనిని గమనించిన ఓ యువకుడు వెంటనే తాను కూడా చెట్టు పైకి ఎక్కి తాడును లాక్కున్నాడు. కలెక్టరేట్ వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఇతర అధికారులు చేరుకుని గంగాధర్‌కు నచ్చజెప్పి కిందకు దించారు. మొత్తం మీద ఒకే రోజు ఇటు కలెక్టరేట్, అటు బోధన్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.