తెలంగాణ

పసుపు దిగుబడులు పడిపోతాయా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 19: పసుపు దిగుబడులు ఈసారి భారీగానే పడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఉద్యానవన శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పసుపు పంటను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మాసాంతం వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో దాని ప్రభావం పసుపు పంటపై పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంటను సాగుచేసే ఆర్మూర్ డివిజన్‌లో ఈసారి వర్షపాతం 20శాతం అధికంగానే నమోదైంది. వాస్తవానికి ఈ సంవత్సరం పసుపు సాగు విస్తీర్ణం కొంతమేర తగ్గిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురియకపోవడంతో చాలా మంది రైతులు బోరుబావుల కిందనే ఈ పంటను సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం కంటే 15శాతం మేర పసుపు సాగు విస్తీర్ణం తగ్గింది. రమారమి 25వేల ఎకరాలలో పసుపుపంట సాగైనట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురియడంతో పసుపు పంట చేలలో రోజుల తరబడి నీళ్లు నిలిచిపోయాయి. వాస్తవానికి పసుపు పంటకు సరిపడా తడులను రైతులు సమయానుసారంగా అందిస్తారు. ఈసారి క్రమంగా వర్షాలు కురియడంతో పసుపు క్షేత్రాలన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో మర్రి ఆకు తెగుళ్లు, దుంపకుళ్లు తదితర తెగుళ్లు పసుపు పంటను ఎక్కువగా ఆశించాయి. వాస్తవానికి జనవరి మొదటి వారం నుండి పసుపు తవ్వకాలు ప్రారంభమవుతాయి. ముందస్తుగా ఈ పంటను సాగు చేసిన రైతులు డిసెంబర్ మూడవ వారంలోనే తవ్వకాలు ప్రారంభిస్తారు. పసుపు పంటకు తెగుళ్లు సోకడంతో పది రోజులుగా ఉద్యానవన శాఖ అధికారులు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ పసుపు పంటను పరిశీలిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మర్రాకు తెగుళ్లు ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు, ఆ మేరకు నివారణ చర్యలను రైతులకు సూచిస్తున్నారు. దీనికి తోడుగా చాలా ప్రాంతాల్లో దుంపకుళ్లు తెగుళ్లు కూడా సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. పసుపు పంట చాలా ప్రాంతాల్లో ఎండిపోయినట్లుగా తయారైంది. దానికి మర్రాకు తెగుళ్లే కారణమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గిపోవచ్చునని రైతులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ప్రస్తుతం దుంప ఊరే సమయమని, ఇలాంటి పరిస్థితుల్లో తెగుళ్లు సోకడంతో ఆ ప్రభావం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందేమోనని భయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పసుపు దిగుబడులు గణనీయంగా తగ్గిపోవచ్చునని నిపుణుల అంచనా. కనీసం 25నుండి 30శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నట్లుగా అధికారులతో పాటు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎకరాన 18 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తే ఫరవాలేదని, ప్రస్తుత పరిస్థితిని బట్టి 15క్వింటాళ్లకు మించకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా పసుపు అధికంగా పండించే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోనూ ఈసారి పసుపు దిగుబడులు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని, భారీ వర్షాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పసుపు సాగు విస్తీర్ణం తగ్గిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నివారణ చర్యలు సరిగ్గా చేపట్టి దిగుబడులను పెంచగలిగితే మంచి లాభాలను సంపాదించుకోవచ్చునని, మార్కెట్లో పసుపునకు డిమాండ్ ఉంటుందని, పంట పండించిన రైతుకు పూర్తి న్యాయం జరుగుతుందని వారంటున్నారు. మర్రాకు తెగుళ్లు, దుంపకుళ్లు సోకటంతో చాలా మంది రైతులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఉద్యానవన శాఖ అధికారులు సూచించినట్లుగా బెడ్డు సాగు విధానంలో పంటను పండించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడి ఉండకపోయేదని వారి ఆలోచన. ఏదేమైనప్పటికీ భారీ అంచనాలతో పసుపు పంట పండించిన రైతులు, దిగుబడులు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటంతో కనీసం మార్కెట్లో గిట్టుబాటు ధరైనా సరిగ్గా లభిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

*చిత్రం...మర్రి ఆకు తెగులు సోకిన పసుపు పంట