రాష్ట్రీయం

నీటి వాడకంపై శాటిలైట్ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: కృష్ణా జలాల పంపకంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న తగాదాల పరిష్కారానికి టెలిమెట్రీ వ్యవస్ధ ఏర్పాటు చేస్తామని కృష్ణా జలాల యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను అమలు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాలకూ బోర్డు లేఖ రాసింది. టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై తమకు అభ్యంతరం లేదని రెండు రాష్ట్రాలూ సూత్రప్రాయంగా అంగీకారం తెలపనున్నట్టు సమాచారం. కానీ తాము చెప్పినచోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కృష్ణా బోర్డును కోరనున్నాయి. నీటి ప్రవాహాన్ని అంచనా వేసేందుకు టెలిమెట్రీ వ్యవస్ధను ప్రపంచవ్యాప్తంగా నీటి తగాదాలున్న దేశాలు అమలు చేస్తున్నాయి. భారత్- పాక్ మధ్య సింధూ నది బేసిన్‌లో 23చోట్ల టెలిమెట్రీ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఎంత పరిమాణంలో ఎవరు నీటిని వాడుకున్నారనేది తెలుస్తుంది. శాటిలైట్ వ్యవస్ధ ద్వారా టెలిమెట్రీ విధానం పనిచేస్తుంది.
ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా జలాలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. కృష్ణా బోర్డు ఈ రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకుంటామని పేర్కొంటూ అభిప్రాయాలు తెలియచేయాలని గత నెలలోనే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ వ్యతిరేకించగా, ఆంధ్ర స్వాగతించింది. దీనిపై కేంద్రం త్రిసభ్య కమిటీని నియమించి సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణకు హామీ ఇచ్చింది. ఈ కమిటీ ఇంకా పర్యటించలేదు. ఈలోగానే కృష్ణా బోర్డు టెలిమెట్రీ విధానాన్ని తెరపైకి తెచ్చింది.
ప్రస్తుతం ఆల్మట్టి నుంచి నీటి ప్రవాహం విడుదల పెరిగింది. కాని దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వచ్చే ఉపయోగం అంతంతమాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల పరివాహక ప్రాంతంలోనూ ఏకకాలంలో భారీ వర్షాలు నమోదైతే తప్ప శ్రీశైలంలో 215 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 312 టిఎంసి నీరు రాదు. ప్రస్తుతం శ్రీశైలంలో 23 టిఎంసి, నాగార్జునసాగర్‌లో 122 టిఎంసి నీరు ఉంది.
ఈ నేపథ్యంలో ఆలస్యంగా ప్రారంభమయ్యే ఖరీఫ్‌కు నీటి విడుదల కోసం రెండు రాష్ట్రాల మధ్య గొడవ తప్పని పరిస్ధితులు కనిపిస్తున్నాయని రెండు రాష్ట్రాల సాగునీటి నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆంధ్ర 14 టిఎంసి నీటిని అదనంగా వాడుకుందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం మాన్యువల్‌గా నీటి విడుదలను పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల రెండు రాష్ట్రాలకు అపనమ్మకం పెరుగుతోందని కృష్ణా బోర్డు గుర్తించి టెలిమెట్రీ విధానాన్ని తెరపైకి తెచ్చింది.
ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆంధ్ర వైపున టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరనుంది. కాగా తెలంగాణలో జూరాల, కల్వకుర్తి, కోయిలసాగర్, నెట్టెంపాడు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, తెలంగాణవైపునున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని ఏపి ప్రతిపాదించనుంది. టెలిమెట్రీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తూనే, కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకురావాలని కృష్ణా బోర్డు చేసిన తాజా ప్రతిపాదనపై ఈ నెలలో సమావేశం నిర్వహించి ఆగస్టు మొదటి వారంలోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని బోర్డు కోరనుంది. ఈమేరకు బోర్డు కార్యదర్శి సమీర్ చటర్జీ కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం.