తెలంగాణ

ప్రగతి రథానికి పరిష్కారమేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆదివారం నాటికి 51 రోజులకు చేరుకుంది. ఇవి కార్మికుల సమ్మెకు మాత్రమే నిండుకున్న రోజులు కావు. ఇవి ప్రజల ఇక్కట్లకు, స్తంభించిన రవాణా వ్యవస్థకు నిండుకున్న దినాలుగా పరిగణించాలి. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే సామాన్య ప్రజానీకం, రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సమ్మె ఎప్పుడు ముగుస్తుందోనని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ, రవాణా శాఖ చెబుతున్న కాకిలెక్కలను ప్రభుత్వం కూడా నిజమేని నమ్ముతున్నట్టు
ఉంది. అధికారులు చెప్పేవి వాస్తవ లెక్కలా? కాకిలెక్కలా? అనేది తెలుసుకోవాలంటే హైదరాబాద్ నగరంలో కానీ, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్టాప్‌ల వద్దకు కానీ ఎవరినైనా పంపిస్తే అసలు వాస్తవం ఏంటో తెలిసిపోతుంది. ఆర్టీసీ అధికారులు ఇంతకాలం ప్రభుత్వ అధినేతలను ఏ విధంగా మభ్యపెడుతున్నారో అర్ధమవుతుంది. హైకోర్టుకే తప్పుడు లెక్కలు సమర్పించి చీవాట్లు తిన్న రవాణా, ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వ అధినేతలను మభ్యపెడుతున్నారంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యం ఏ మేరకు ఉందో పరోక్షంగా తెలుసుకున్నా తెలిసిపోతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం మండల కేంద్రాలకు వచ్చే రోగులకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం లేకపోవడంతో ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమాచారం. ఆర్టీసీ సమ్మె తర్వాత విద్యాలయాలు, ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు వర్ణనాతీతం. ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన బస్సుల్లో రవాణా చార్జీలు అధికంగా ఉండటమే కాకుండా ఏడాదికి సంబంధించిన మొత్తం చార్జీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకునే పేద విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే కాలేజీలకు వెళ్తారు. ఆర్టీసీ సమ్మె తర్వాత సుదూర ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు అరకొర ఆర్టీసీ బస్సుల వల్ల కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్టీసీ సమ్మె తర్వాత విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు ఏ కాలేజీకి వెళ్లి విచారించిన చెబుతారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ కార్మికులు (అడ్డా కూలీలు) పొద్దుపొద్దుటే ఆర్టీసీ బస్టాప్‌లలో గుమికూడి ఉండేవారు. ఆర్టీసీ సమ్మె తర్వాత మొక్కుబడి రవాణా వ్యవస్థతో ఏ బస్సు ఎప్పుడు వస్తుందో, వచ్చినా కిక్కిరిసిన జనంతో ఉండే బస్సులో కాలు పెట్టడానికి కూడా సందు ఉండదని ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఆటోవాలాలు చార్జీలను విపరీతంగా పెంచి వసూలు చేస్తున్నారు. దీంతో చాలీచాలని కూలీ డబ్బుల్లో సగం ఆటో చార్జీలకే చెల్లించాల్సి వస్తోందని దినసరి కూలీలు లబోదిబోమంటున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించడం వల్ల మధ్య, ఎగవ మధ్య తరగతి ప్రజానీకం ఓలా, ఉబర్ వంటి టాక్సీ సర్వీసులపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల టాక్సీల్లో ప్రయాణించే వారి సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల గతంలో రూ.150 నుంచి 250 మధ్య అయ్యే చార్జీ ప్రస్తుతం 350 నుంచి 450 అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య పంతాలు, పట్టింపుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ అధినేతలు పూర్తిగా విస్మరించారన్న విమర్శలే ఏ వర్గాన్ని కదిలించినా వాపోతున్నారు. ఇంతకాలం తమ డిమాండ్ల కోసం బెట్టుచేసిన కార్మిక సంఘాలు అన్ని డిమాండ్లను వదులుకుని విధులు చేరుతామని ప్రకటించి నాలుగు ఐదు రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ప్రజలు తప్పుబడుతున్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించాలని, ఆర్టీసీ, రవాణా శాఖల కాకిలెక్కలతో అంతా బాగుందనే భ్రమల్లో నుంచి బయటపడాలని సగటు ప్రజానీకంలో వ్యక్తమవుతున్న అభిప్రాయం.