తెలంగాణ

దేశానికి ఆదర్శంగా అటవీ కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (ఎఫ్‌సీఆర్‌ఐ) కొత్త భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభించనున్నారని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్. శోభ తెలిపారు. మంగళవారం ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడు తూ, సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని ములుగులో దాదాపు రూ.75 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ప్రధాన భవనం, హాస్టల్ భవనాల నిర్మాణం పూర్తయ్యా యి. ఇప్పటివరకు
రూ.32.85 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, 2019-20 బడ్జెట్‌లో మరో 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దేశంలో ప్రతిష్టాత్మక కాలేజీగా ఇది రూపుదిద్దుకుంటుందన్నారు. ఫారెస్ట్రీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, మేనేజ్‌మెంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యాసంస్థను రూపుదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శోభ వివరించారు. 2016 లోనే కాలేజీ ప్రారంభమైంది. ఇప్పటివరకు కాలేజీ తరగతులను తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ప్రాంగణలో నడుపుతున్నారన్నారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ కాలేజీని త్వరలోనే యూనివర్సిటీ స్థాయికి తీసుకువెళతామన్నారు. బీఎస్‌సీ (హానర్స్) ఫారెస్ట్రీ తరగతులను 2016లో ప్రారంభించామని, 2020లో ఎంఎస్‌సీ ఫారెస్ట్రీ, 2022లో పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు. బీఎస్‌సీ (హానర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ఏటా 50 మందిని చేర్చుకుంటున్నామని, ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. త్వరలో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఎంఎస్‌సీలో ఏటా 36 మందిని, పీహెచ్‌డీలో 18 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. అన్ని కోర్సులు ప్రారంభమైతే మొత్తం 326 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఎఫ్‌సీఆర్‌ఐలో సిల్వికల్చర్ అండ్ ఆగ్రో ఫారెస్ట్రీ, నేచురల్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సర్వేషన్, వైల్డ్‌లైఫ్ అండ్ హాబిటేట్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ యుటిలైజేషన్, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, ఫారెస్ట్ ఎకాలజీ అండ్ క్లైమేట్ సైన్స్, బేసిక్ అండ్ సోషల్ సైనె్సస్ డిపార్ట్‌మెంట్లు ఉంటాయి. కాలేజీలో మ్యూజియం, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ, జైలారియం, హర్బేరేయంతో సహా 14 లాబోరేటరీలు ఉంటాయి.
గవర్నింగ్ బోర్డ్
ఎఫ్‌సీఆర్‌ఐ కోసం గవర్నింగ్ బోర్డ్, అకడమిక్ కౌన్సిల్‌లను ఏర్పాటు చేశారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శి చైర్మన్‌గా మరో 13 మందిని సభ్యులుగా నియమిస్తూ గవర్నింగ్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. పీసీసీఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ చైర్మన్‌గా మరో 13 మందిని సభ్యులుగా అకడమిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
సివిల్స్‌కు శిక్షణ
సివిల్ సర్వెంట్స్ (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్) పరీక్షలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ఈ కాలేజీ విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇస్తామని శోభ తెలిపారు. అలాగే బీఎస్‌సీ పూర్తి చేసిన విద్యార్థులు దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు కూడా శిక్షణ ఇస్తామని వివరించారు. కాగా, కొత్త భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రారంభిస్తుండటంతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఈ భవన ప్రాంగణాన్ని పరిశీలించారు.

*చిత్రం...ఫారెస్ట్ కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు