తెలంగాణ

విద్యతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నా ఇది ఎంతో అవసరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆత్మీయ సత్కారాన్ని అందుకున్న జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ, మనిషి ఔన్నత్యానికి అతని విద్యే ప్రమాణికమని వ్యాఖ్యానించారు. ఈ ఆత్మీయ పురస్కారానికి తాను ఒక కమిటీ చైర్మన్‌గా కాకుండా, ఓ ఇంటి సభ్యుడిగా వచ్చానని, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా గడుపుతున్నట్టు ఉందన్నారు. రాయి లేకపోతే శిల్పం ఉండదని, శిల్పం తయారు కావాలంటే రాయి తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఎవరినీ తక్కువ అంచనా వేయడం తగదని హితవు పలికారు. కాగా, వివేకానంద ప్రతిభా పురస్కార గ్రహీతల్లో స్ట్రే యానిమల్ వెల్ఫేర్ సొసైటీ (ఎస్‌ఏడబ్ల్యూఎస్) అధ్యక్షురాలు అవుతు సువర్ణ లక్ష్మి, వైటీడీఏ ఉప స్థపతి మోతీలాల్, ప్రముఖ విద్యావేత్త దేవిక కనకాల, భరత నాట్య గురువు రంజని, కూచిపూడి నాట్య గురువు కే. రాధిక, శాస్ర్తియ సంగీత కళాకారిణి స్వర్ణ మంగళంపల్లి తదితరులు ఉన్నారు. మూగ జీవాల పేరుతో, చందాల గాలాలు పట్టుకొని తిరుగుతున్న జనాల మధ్య, నిస్వార్థంగా, ఎవరి నుంచి ఆర్థిక సాయం తీసుకోకుండా ప్రతి రోజూ సుమారు యాభై వీధి కుక్కలకు తిండి పెడుతున్నందుకు సువర్ణ లక్ష్మికి ఈ అవార్డు లభించింది. సుమారు ఒకటిన్నర దశాబ్దాలుగా వీధి కుక్కలకు ఆమె చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించింది. ప్రముఖ విద్యావేత్త దేవిక కనకాల తమ రంగంలో నిష్ణాతులు. ఎంతో మందికి మార్గదర్శకం చేసిన మేధావి. భరత నాట్య గురువుగా రంజని, కూచిపూడి నాట్య గురువుగా రాధిక ఎంతో మందిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. శాస్ర్తియ సంగీతంలో తన కంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న స్వర్ణ మంగళంపల్లి తాను స్వయంగా రాణిస్తూ, పలువురికి శిక్షణనిస్తూ కళా జగతికి సేవలు అందిస్తున్నారు.
జస్టిస్ చంద్ర కుమార్, జస్టిస్ వెంటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరైన ఈ కార్యక్రమాన్ని శిఖరం ఆర్ట్స్ థియేటర్స్, ఏబూషి పోశం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు జీ. కృష్ణ, ఏబూషి యాదగిరి మాట్లాడుతూ ప్రతిభావంతులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారి మార్గదర్శకం నేటి యువతకు అవసరమని చెప్పారు. సన్మాన కార్యక్రమానికి ముందు చిన్నారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
'చిత్రం... ఆత్మీయ పురస్కారం స్వీకరిస్తున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య