తెలంగాణ

మా బలం చెక్కు చెదరలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవీ శైలేంద్ర
హైదరాబాద్, జనవరి 18: మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీలు, మొత్తం నగర పాలక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, టీఆర్‌ఎస్ చేసే కుతంత్రాలను, కుటిలయత్నాలను ప్రజలు తిప్పికొడతారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఆయన ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెక్కుచెదరలేదని, అన్నివర్గాల్లో ఓటు బ్యాంకు బలంగా ఉందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ మాయమాటలను నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. తాను పలు మున్సిపాలిటీల్లో ప్రచారం చేస్తూ ప్రజల్లో వచ్చిన మార్పును గమనించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 13 నగర పాలక సంస్థల్లో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విశేష స్పందన వస్తోందన్నారు. ‘గత ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో మున్సిపాలిటీలు నిర్వీర్యమయ్యాయి. అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, చెత్త. మున్సిపాలిటీలకు నిధులు లేవు. ఉత్తుత్తి కబుర్లతో కేసీఆర్ సర్కార్ కాలక్షేపం చేసింది. ప్రజలు ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు’ అని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
సంక్షేమ పథకాలపై గాలి కబుర్లు తప్ప ఆచరణ లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దాదాపు ఎత్తివేశారని, నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారని, రైతు రుణమాఫీ నిలిచిపోయిందని, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? ముస్లింలు, గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదనే భ్రమలకు టీఆర్‌ఎస్ లోనవుతోంది. ఈ భ్రమలే వారిని ముంచుతాయి. 2018 ఎన్నికల తర్వాత మేము పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకున్నాం’ అని ఆయన చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ దీవెనల వల్ల అవతరించింది. ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలమేంటో తెలుసు. టీఆర్‌ఎస్ నేతలు గారడీలను ఇక జనం నమ్మరు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, ఈ తరహా స్వేచ్ఛ, అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్న మరో పార్టీ లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని గెలిపించేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన సెక్యులర్ పార్టీ అని పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పొత్తుల విషయంలో పిల్లిమొగ్గలేస్తూ మతతత్వశక్తులతో అవకాశవాద రాజకీయాలను నడుపుతోందన్నారు. ‘టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు బహిరంగంగా ఉంది. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు లోపాయికారి ఒప్పందం ఉంది. ఈ విషయాలు జనానికి తెలుసు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎంతో పాటు టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రతి అంశంలో బీజేపీకి వత్తాసు పలికిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి దమ్ముంటే పౌరసత్వ సవరణ, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.
తెలంగాణలో గలీజు రాజకీయాలకు టీఆర్‌ఎస్ నాంది పలికిందని, ఈ పార్టీ, ప్రభుత్వమంతా పైసలమయమైందని
ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పై నుంచి దిగువ స్థాయి వరకు అవినీతి పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హిమశిఖర స్థాయి వ్యక్తిత్వం ఉన్న పార్టీ అని, ఆటుపోట్లు వస్తుంటాయని, పోతుంటాయని అన్నారు. తప్పనిసరిగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ప్రభుత్వమంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుగా మారిందన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల పేర్లు, వారి పోర్ట్ఫులియోలు, వారి ఆఫీసులు ఎక్కడ ఉంటాయనే విషయాన్ని జనం మర్చిపోయారన్నారు. సచివాలయం కూల్చివేస్తామని, మొత్తం కార్యాలయాలను బయటకు తరలించారని, ఇప్పుడు మంత్రులకు కూడా అడ్రసు లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ‘రాష్ట్ర మంత్రులు డమీలుగా తయారయ్యారు. దివాళాకోరు ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని సొంతం చేసుకునేందుకు పోలింగ్ రోజు, ఓటింగ్ రోజు మభ్యపెట్టే కుటిల రాజకీయాలకు పాల్పడడం టీఆర్‌ఎస్‌కు రివాజుగా మారింది’ అని ఆయన విమర్శించారు. మంత్రులకు అధికారాలు లేవు. వీరికి ప్రజా సమస్యలు అక్కర్లేదని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు, కాంగ్రేసేతర ముఖ్యమంత్రులు పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌర పట్టికను అమలు చేయబోమని తెగేసి చెబితే, ఈ విషయమై మాట్లాడేందుకు కేసీఆర్, కేటీఆర్ జంకుతున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేయబోతున్నారన్నారు. అందువల్లనే మైనారిటీల ఓట్లకు గాలం వేసేందుకు టీఆర్‌ఎస్ అనివార్యంగా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుందని, ఈ విషయాన్ని మైనారిటీలు గ్రహించారని ఆయన అన్నారు. మైనారిటీలు జాతీయ సెక్యులర్ పార్టీ వైపు ఉంటేనే వారి హక్కుల కోసం జాతీయ స్థాయిలో మడమ తిప్పకుండా పోరాడుతామన్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలో దళితుల్లో బాగా వెనుకబడిన జనాభాపరంగా ఎక్కువ జనాభా ఉన్న మాదిగ కులానికి మంత్రివర్గంలో స్థానం కల్పించారా? అని ఆయన అడిగారు. ఈ సామాజిక వర్గాన్ని అన్ని రకాలుగా అణగదొక్కుతున్నారన్నారు. మంద కృష్ణమాదిగను ఏ విధంగా తరచుగా నిర్బంధించడం, అవమానిస్తున్న విషయాన్ని దళితులకు తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్నారని ఆయన చెప్పారు.
అవినీతిరహితంగా మున్సిపాలిటీలను రూపొందిస్తాం
అవినీతి రహితంగా మున్సిపాలిటీలను అత్యుత్తమ ప్రజా సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఇంటర్నల్ రోడ్లు, రోడ్డు డివైడర్లను నిర్మిస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో పార్కులు, గ్రీన్ బెల్టులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో యువతీ, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా మైదానాలు, రీడింగ్ రూంలు, ఇంటర్నెట్ సదుపాయాలతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై కూడళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక ఆధునిక వేస్ట్ మేనేజిమెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పుతామన్నారు. రజకులకు అత్యాధునిక సౌకర్యాలతో ధోబీ ఘాట్లు, నారుూబ్రాహ్మణులకు, కుమ్మరి సంఘానికి వారి వృత్తులు కొనసాగించేందుకు భూమిని కేటాయిస్తామన్నారు. కనె్వన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఉపాధి కల్పన శిబిరాలను నిర్వహిస్తామని, ఆధునిక సదుపాయాలతో కూడిన వంద పడకల ఆసుపత్రి, 108, 104 సర్వీసులను విస్తరిస్తామని, ప్రతివార్డులో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందన్నారు.
'చిత్రం... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి