తెలంగాణ

అవినీతి, అక్రమాల పాలనకు చరమాంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీవీ ప్రసాద్
హైదరాబాద్, జనవరి 19: టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు మాటలెక్కువ, పనితక్కువ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ అధికార పార్టీ పాలన తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ ప్రతి సభలోనూ అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారిమళ్లిస్తున్నారని, అనేక పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఒకే తానులోని ముక్కలని, ఈ మూడు పార్టీలకు ఓట్లు వేసి వృథా చేసుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. ‘గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఏవీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. అలాంటపుడు టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలి’ అని డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం వచ్చినపుడు ఇచ్చిన హామీలు ఏం చేశారని ప్రజలు ప్రశ్నించాలని లక్ష్మణ్ అన్నారు. అధికార పార్టీ నేతలకు వారేం హామీలు ఇచ్చారో గుర్తుండకపోవచ్చని, అందుకే తమ పార్టీ టీఆర్‌ఎస్ పాలనపై చార్జిషీట్ విడుదల చేసిందని ఆయన చెప్పారు. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భృతి కల్పిస్తామని చెప్పారని, ఎన్నికలు ముగిశాక ఆ విషయం మరిచారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పురపాలికలకు కేంద్ర ప్రభుత్వం 1,030 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయలేదని, అన్ని జిల్లాలనూ సమీక్షిస్తానని చెప్పిన సీఎం ఆ మాట ఎంత వరకు నిలుపుకున్నారని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ సిటీ మాదిరి రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన మాట నీటిమూటే అయ్యిందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సంస్కరణల పేరుతో గందరగోళం సృష్టించారని, లేఅవుట్లు, భవన నిర్మాణాల్లో అవినీతి పెచ్చుమీరిందని, దాని పర్యవసానంగా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అనేక పంచాయతీలను మున్సిపాల్టీల్లో విలీనం చేసి అధిక మొత్తంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజారవాణాకు కేంద్రం ఇస్తున్న నిధులు దారిమళ్లుతున్నాయని ఆయన ఆరోపించారు. మిగులు రాష్టమ్రని చెప్పి తెలంగాణ ప్రజలపై అప్పుల భారం పెంచి, అమలులో ఉన్న పథకాలకు నిధులు లేక పరిపాలన పూర్తిగా నిర్వీర్యమైందని, పర్యవేక్షణ లోపించిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని, జబ్బుల తెలంగాణగా మార్చారని, దోమల నివారణ అటకెక్కిందని, ఫలితంగా వ్యాధులు ప్రబలి సామాన్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని అన్నారు. డెంగ్యూ లాంటి విషజ్వరాల నివారణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. అంచనాలను భారీగా పెంచి నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు వల్ల రైతుల పొలాల్లో పారుతున్న నీటికన్నా పాలకుల జేబుల్లో చేరుతున్న అవినీతి సొమ్మే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ఆరేళ్ల పాలనలో యువతకు కొలువులు దక్కలేదని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు మాత్రం కొలువులు దక్కాయని ఎద్దేవా చేశారు. అధికారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను డల్లాస్ చేస్తామని, లండన్ చేస్తామని, ఇస్తాంబుల్ చేస్తామని మెరుగైన పారిశుద్ధ్యం, అందంగా అద్దంలా రోడ్ల నిర్వహణ, డ్రైనేజీ నిర్మాణాలు అంటూ మాటలు చెప్పారని, డంపింగ్ యార్డులు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, శ్మశానాలు నిర్మిస్తామని అనేక హామీలు ఇచ్చారని, వాటి ఊసే నేడు లేదని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం అవినీతి, బంధుప్రీతి, కుటుంబ పాలనకు పెద్దపీట వేస్తున్నారని, టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయని ఆయన విమర్శించారు. అన్ని రంగాలూ దెబ్బతిన్నాయని, రైతులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులూ, యువకులు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదలు, మధ్య తరగతి ప్రజలు కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం మున్సిపల్ ఎన్నికల రూపంలో ప్రజలకు
వచ్చిందని, కనుక తగిన నిర్ణయం తీసుకుని అవినీతి టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపాల్టీల్లో ఐదు లక్షల రూపాయిల ఖర్చుతో పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్లను జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించి ఇస్తామని సీఎం ఇచ్చిన హామీ ఆయనకు గుర్తు లేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద స్వీకరించిన 2.42 లక్షల దరఖాస్తులను ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలో అమలుచేయడం లేదని, స్వచ్ఛ్భారత్ పథకాన్ని పట్టించుకోలేదని, మరుగుదొడ్ల నిర్మాణం, ఎల్‌ఈడీ బల్బులతో వీధి దీపాలు, శివారు ప్రాంతాల విదుద్ధీకరణ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులుగా ప్రచారం చేసుకుంటోందని, వాస్తవాలు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. పురపాలికలకు కేంద్రం నుండి వస్తున్న 1,030 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. 2018లో రాష్ట్రంలోని 71 నగరాలు, పట్టణాల్లో 150 కోట్లతో మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో ఆధునిక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను 2019లో మొదలుపెట్టి, ఏడాదిలో పూర్తి చేస్తామని, అనుమతులు కూడా లభించాయని చెప్పి ఇప్పటికీ అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అన్నారు. పట్టణాల్లో 500 నుండి 12వందల మంది సామర్ధ్యం ఉన్న మల్టీపర్పజ్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టలేదని, డిజైన్‌లు, లేఅవుట్‌ల దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం కోసం హరితహారం పేరుతో గ్రీన్‌సెల్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అమలుకాలేదని ఆయన అన్నారు.
అవినీతిని నిర్మూలించేందుకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తామన్నది కాగితాలకే పరిమితమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వంద పడకల ఆస్పత్రులు, జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయని, కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా సీట్ల భర్తీకి వీలుగా వాటిని ఇంతవరకూ పెంచలేదని అన్నారు. ప్రతి పురపాలక సంఘంలో కౌనె్సలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఆ హామీ ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాలు నత్తనడకన సాగుతున్నాయని, పట్టణ పేదల ఇళ్ల కోసం గత ప్రభుత్వం 3,920 కోట్లు ఇచ్చి గృహ రుణమాఫీ చేసినా లబ్ధిదారులకు ఇంకా నో డ్యూస్ సర్ట్ఫికెట్లు ఇవ్వలేదని లక్ష్మణ్ అన్నారు. 2017 ఆగస్టులోగా అన్ని మున్సిపాల్టీలనూ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మారుస్తామని ఆనాడు టీఆర్‌ఎస్ గొప్పలకు పోయిందని అది నెరవేరలేదని అన్నారు. మున్సిపాల్టీల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎక్కడా అమలుకావడం లేదని, వ్యర్థాల నివారణకు మొబైల్ యాప్ తెస్తామని చెప్పినా అదీ జరగలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక టూరిజం మరింత దిగజారిందని, ప్రాచీన కట్టడాల ఆలయాల పునరుద్ధరణ చేపట్టలేకపోయారని ఆయన విమర్శించారు. ఈ వాస్తవాలన్నీ ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని, కేసీఆర్, కేటీఆర్ మాటలకే పరిమతమని స్పష్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

'చిత్రం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్