తెలంగాణ

పంచాయతీ రాజ్ పరిధిలో 800 కి.మీ కొత్త రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన మూడో దశ కింద రాష్ట్రానికి 800 కి.మీటర్ల రోడ్లు మంజురు అయినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ పథకం కింద చేపట్టడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రమే ప్రతిపాదనలు అందాయని, ఇంతర జిల్లాలు కూడా వెంటనే పంపించాలని కోరారు. వార్షిక బడ్జెట్ 2020-21 ప్రతిపాదనలపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మెటిరియల్ కాంపౌండ్ కింద రూ.250 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే అనేక సార్లు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని కోరినా స్పందన లేదన్నారు. తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాయాల్సిందిగా పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద తాజాగా వైకుంటధామాలు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లకు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో సీసీ రోడ్ల కోసం రూ. 20 లక్షల వ్యయానికి ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అన్నారు. రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైనప్పటికీ పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసించాయని, అనేక బృందాలు ఈ పథకాన్ని పరిశీలించి మెచ్చుకున్నారని మంత్రి గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహయం అందలేదని మంత్రి వాపోయారు. కేంద్ర నిధుల కోసం మళ్లీ ప్రయత్నం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.
'చిత్రం...వార్షిక బడ్జెట్ 2020-21 ప్రతిపాదనలపై గురువారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు