తెలంగాణ

రానున్నది బీజేపీ ప్రభుత్వమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, కార్యకర్తలు , నేతలు అవిశ్రాంతంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కోర్ కమిటీ నేతలు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో పార్టీని మరిన్ని విజయాలవైపు నడిపేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఉనికిని చాటుకున్నా అనుకున్నంత ఫలితాలను సాధించలేకపోయామని ఆ పరిస్థితి మున్ముందు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఫలితాల పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా ఉండటం ఊరట కలిగించే అంశమని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం స్పైస్ బోర్డును కేటాయించడం హర్షణీయమని అన్నారు. రానున్న రోజుల్లో సీఏఏ అంశంపై ఇంటింటి ప్రచారానికి వినూత్న కార్యక్రమాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. అలాగే ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు కేకేపై చట్టపరమైన చర్యలకు ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ అంశంపై ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేశామని, కేకే తెలంగాణ రాష్ట్ర జాబితాలో లేరని, ఆంధ్రా జాబితాలోనే ఉన్నారని అధికారికంగా రాజ్యసభ నుండి లేఖ వచ్చిందని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై లక్ష్మణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలూ దేశానికి నష్టమని, రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు, అవినీతి, దుందుడుకు ధోరణిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు విడమరచి చెప్పాలని అన్నారు.
ఇటీవలి కాలంలో సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌సీఆర్ కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను పారద్రోలాలని, అదే విధంగా సీఏఏ విషయంలో టీఆర్‌ఎస్ ఎత్తుగడలను కూడా ఎండగట్టాలని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసినపుడే గ్రామస్థాయిలోనూ, మండల స్థాయిలోనూ పార్టీ స్థిరపడుతుందని, అదే విధంగా జిల్లా స్థాయిలోనూ ప్రజాసమస్యలపై పెద్ద ఎత్తున పోరు సలపాలని నేతలకు సూచించారు. కేంద్రం సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటికి నిధులను సమకూరుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల పేర్లను సవరించుకుని, నిధులు వాడుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్