తెలంగాణ

పాతబస్తీకీ ‘మెట్రో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: మెట్రో రైలు ప్రాజెక్టును హైదరాబాద్ పాతబస్తీతో అనుసంధానం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సంబంధిత అధికారులతో సమావేశమై త్వరలోనే పనులు ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి సీఎం వివరించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌తో ప్రతిపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో రైలుతో పాటు పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్లు, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతుకు రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు లాల్‌దర్వాజ మహంకాళి అలయ అభివృద్ధి, విస్తరణ, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సీఎంను స్వయంగా కలిసి కోరారు. ప్రతి ఏటా లాల్‌దర్వాజ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ భక్తులకు సరిపడా స్థలం లేకపోవడం వల్ల ప్రాంగణం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు కేసీఆర్‌కు వివరించారు. ‘లాల్‌దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి బోనం సమర్పిస్తారు. కానీ ఈ ఆలయం ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలంలో ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. అలాగే దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వండి. దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి. ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది’ అని అక్బరుద్దీన్ సీఎంకు వివరించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా
తీర్చిదిద్దడానికి దీవించాలని కోరుతూ మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తుచేశారు. అదేవిధంగా పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతు కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని కూడా అక్బరుద్దీన్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఇక్కడ ప్రార్థనలకు వస్తారని, అయితే మసీదు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిపక్ష నాయకుడి విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ వెంటనే స్పందిస్తూ మహంకాళి దేవాలయ అభివృద్థికి, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్టు హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదివారం కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ