తెలంగాణ

ఆర్థిక క్రమశిక్షణ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరికాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణను చక్కగా పాటిస్తున్న రాష్టమ్రని, జాతీయ స్థాయిలో కేంద్రానికి ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్న రాష్టమ్రని ఆమె చెప్పారు. 2020-21 వార్షిక బడ్జెట్‌పై వివిధ వాణిజ్య సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు దేశంలోని వివిధ నగరాల పర్యటనలో భాగంగా ఆదివారం ఆమె హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల్లో వాటా కేటాయించామన్నారు. దేశం లో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పెరగడం వల్ల ఆర్థిక సంఘమే ఒక శాతం కేటాయింపులు తగ్గించాలని సిఫార్సు చేసిందన్నారు. జీఎస్‌టీ పరిహారం చెల్లింపుల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందనే వాదన సరికాదన్నారు. జీఎస్‌టీ పరిహారం వసూళ్లు తగ్గ డం వల్లనే పరిహారం చెల్లింపుల్లో అన్ని రాష్ట్రాలకు జాప్యం జరిగిందని ఆమె స్పష్టం చేశారు. పరిహారం సెస్ తప్పితే కేటాయింపులకు కేంద్రం వద్ద అదనపు నిధులేవీ లేవన్నారు. త్వరలో రెండు విడతల్లో సెస్‌ను చెల్లిస్తామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గుతున్నాయనే వాదాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు. ఆ పథకానికి డిమాండ్ ఆధారంగా నిధులు కేటాయిస్తామని, డిమాండ్ అధికంగా
ఉంటే నిధులు కూడా పెరుగుతాయని ఆమె అన్నారు. డిమాండ్ లేకపోవడం లేదనే నిధుల కేటాయింపులు తగ్గినట్లు ఆమె చెప్పారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అది ఇంతవరకు తమ దృష్టికి రాలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు.
తెలంగాణకు 2010-15 మధ్య తెలంగాణ రాష్ట్రానికి రూ.46,747 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. 2015-20 మధ్య రూ.1.7 లక్షల కోట్ల నిధులు ఇస్తున్నామన్నారు. అంటే అంతకు ముందు ఐదేళ్లతో పోల్చితే 128 శాతం మేర నిధులు పెంచినట్లు ఆమె చెప్పారు. 14వ ఆర్థిక సంఘం పదవీకాలాన్ని మరో ఏడాది పెంచామని, ఈ ఏడాది అక్టోబర్‌తో ఈ గడువు ముగుస్తుందన్నారు. కొత్త ఆర్థిక సంఘం సిఫార్సులు ఈ ఏడాది నుంచి అమలులోకి వస్తాయన్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికీ నిధులు తగ్గించమంటూ ఉండదన్నారు. రాజ్యాంగబద్ధమైన కేంద్ర ఆర్థిక సంఘం మేర నిధులు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ ఆర్థికంగా మంచి సామర్థ్యం కనపరిచిన రాష్టమ్రని ఆమె చెప్పారు.
తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.756 కోట్ల ప్రత్యేక గ్రాంటు కూడా అందలేదనే ఆరోపణలో నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటువంటి ఏవైనా వస్తే ఆర్థిక సంఘం పరిశీలనకు పంపామన్నారు. ఆర్థిక సంఘం ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేసిందో తెలియజేస్తే దానికి అనుగుణంగా చర్య తీసుకుంటామన్నారు. స్థానిక కారణాల వల్ల రాష్ట్రాల్లోనే రైల్వే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. నిధుల కేటాయింపుజరగక జాప్యం జరిగిందని అనడం సరికాదన్నారు. ప్రాజెక్టుల వారీ వివరాలు అందిస్తే సమస్యలను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదనే వాదనలు సరికావని, ఏ ఒక్క రాష్ట్రం పట్ల చిన్నచూపు చూడాలనే కోణంతో కేంద్రం ఉండదన్నారు. తెలంగాణ నుంచి మంచి కంట్రిబ్యూషన్ కేంద్రానికి ఉందనేది వాస్తవమన్నారు.
వివిధ వాణిజ్య సంఘాలతో జరిపిన చర్చలు సంతృప్తి ఇచ్చాయని ఆర్థిక మంత్రి అన్నారు. ఆదాయం పన్ను శ్లాబులు, మినహాయింపులపై వాణిజ్యవేత్తలు ప్రస్తావించిన అనేక అంశాలకు బదులిచ్చామన్నారు. వీలైనంతవరకు మినహాయింపులను తగ్గించేవేసే విషయమై దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ పార్లమెంటు సభ్యులు కూడా బడ్జెట్‌పై కూలంకషంగా అధ్యయనం చేయాలని ఆమె సూచించారు. దీనివల్ల అనేక వాస్తవాలు తెలుస్తాయన్నారు. పన్నులో రాష్ట్రాలకు వాటా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గింపు నిర్ణయం పూర్తిగా తమది కాదని ఆమె చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నడుచుకుంటుందన్నారు. పన్నుల వసూళ్లలో బాగా పనిచేసిన రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసినట్లు వస్తున్న సమాచారం నిజం కాదన్నారు. అన్ని రాష్ట్రాలతో సామరస్యంతో పనిచేయడమే కేంద్రం లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఏ చక్రవర్తి, వ్యయ శాఖ కార్యదర్శి సోమనాథన్, సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీ, సీబీఐసీ చైర్మన్ అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఆదివారం హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్