తెలంగాణ

హమ్మయ్య... ఎన్నికల పర్వం ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో ముందస్తుగానే తెరపైకి వచ్చిన శాసనసభ ఎన్నికలు మొదలుకుని ప్రస్తుత సహకార సంఘాల ఎన్నికల వరకు కూడా దాదాపు ఏడాదిన్నర కాలం నుండి ఏకబిగిన ఒకదాని వెంట ఒకటిగా ఎలక్షన్ సీజన్ కొనసాగడంతో నిర్విరామ విధుల నిర్వహణతో ఒకింత అవస్థలు ఎదుర్కొన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ప్రస్తుతం ఎన్నికల పర్వం ముగియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రత్యేకించి వరుస ఎన్నికల సందర్భంగా బందోబస్తు విధుల్లో అహరహం శ్రమించిన పోలీసులకు ఎంతో ఉపశమనం లభించినట్టయ్యింది. తెలంగాణలో నిర్ణీత గడువు కంటే ముందే అధికార తెరాస పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవడంతో 2018 డిసెంబర్ 7న శాసనసభకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రక్రియకు సుమారు రెండు నెలల ముందు నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లోనూ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అన్ని శాఖల అధికారులు ఎన్నికల నిర్వహణ విధుల్లో తలమునకలు కావాల్సి వచ్చింది. ఇలా అసెంబ్లీ పోరుతో శ్రీకారం చుట్టిన ఎన్నికల పర్వం రాష్ట్రంలో నిర్విరామంగా కొనసాగిందనే చెప్పాలి. అసెంబ్లీ ఫలితాల వెల్లడి అనంతరం కొన్ని వారాలకే లోక్‌సభ ఎన్నికలు, ఆ పైన స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు తాజాగా సొసైటీలకు కూడా విరామం లేకుండా వెంటవెంట ఎన్నికలు జరిపించారు. స్థానిక పోలీసులతో పాటు పక్క రాష్ట్రాల నుండి సైతం అదనపు బలగాలను రప్పించుకుని భారీ బందోబస్తు మధ్య నిర్విరామ ఎన్నికల ప్రక్రియలను కొనసాగించారు. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రాజేశాయి. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే మరెక్కడా లేనివిధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో 185 మంది అభ్యర్థులు మూకుమ్మడిగా పోటీ చేయడంతో అధికారులు, ఎన్నికల సిబ్బందికి పోలింగ్, కౌంటింగ్‌లను నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించడం తలకుమించిన భారమే అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఈ ఒక్క స్థానం నుండే 185 మంది బరిలో నిలువడంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మెగా ఈవీఎం(ఎం-3)లను దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో వినియోగించాల్సి వచ్చింది. వీటికి సంబంధించి ఎన్నికల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు 7 గంటలకే ప్రారంభమైనప్పటికీ, నిజామాబాద్‌లో 8గంటలకు ప్రారంభించి రాత్రి 9గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడా లేనివిధంగా ఎన్నికల సిబ్బందికి మూడు పర్యాయాలు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలు అంటేనే ఉద్యోగస్తులకు శిక్షణతో ప్రారంభం అవుతుంది. ప్రతి ఎన్నిక విషయంలోనూ ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండు విడతలుగా శిక్షణ, అదనపు పోలింగ్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ అందిస్తారు. పోలింగ్‌కు ఒకరోజు ముందుగానే విధుల్లో చేరడం, ఓటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులను రిసీవింగ్ సెంటర్‌లకు అప్పగించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సవాలుతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. ఒక్కో సెంటర్‌లో ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగిందంటే వారు ఎంతటి శ్రమను ఎదుర్కొన్నారో అర్ధం చేసుకోవచ్చు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే తరహా ప్రక్రియను నిర్వర్తించాల్సి వచ్చింది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కొన్ని గ్రామాల్లో రెండు రోజుల పాటు ఎన్నికలు జరుగగా, ఉద్యోగులు ఎంతో సహనంతో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఓటింగ్, కౌంటింగ్ రెండు ప్రక్రియలు వేర్వేరుగా చేపట్టాల్సి రావడం సైతం ఇబ్బందికి గురి చేసినట్లయ్యింది. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉద్యోగ వర్గాలకు విధుల నిర్వహణ కత్తిమీద సాములా నిలిచింది. చిట్టచివరిగా జరిగిన సహకార ఎన్నికల్లో చాలావరకు సొసైటీలు ఏకగ్రీవం అయినప్పటికీ, ఒకటిరెండూ డైరెక్టర్ స్థానాలకు పోటీ నెలకొని ఉన్నచోట ఓటింగ్ జరపాల్సి రావడంతో ఉద్యోగులకు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించక తప్పలేదు. దాదాపు 14 మాసాల పాటు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలు కొనసాగడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఇది ఎంతో ప్రభావం చూపిందనే చెప్పాలి. ప్రస్తుతం చట్టసభలతో పాటు స్థానిక సంస్థలకు సైతం ఎన్నికలన్నీ ముగియడంతో మరో నాలుగు సంవత్సరాల వరకు ఎలక్షన్ బిజీ ఉండదని ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.