తెలంగాణ

జీహెచ్‌ఎంసీకి కొత్త చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ నగర పౌరులకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పురపాలన అందించేందుకు జీహెచ్‌ఎంసీ చట్టాన్ని మార్చనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో అమలులోకి తీసుకువచ్చిన నూతన పురపాలక చట్టంలోని అన్ని కీలకమైన అంశాలను జీహెచ్‌ఎంసీ కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపల్ చట్టం స్ఫూర్తిని, చట్టంలోని నిబంధనలను యథాతథంగా జీహెచ్‌ఎంసీ చట్టంలో తీసుకురావాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మార్చి నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో జీహెచ్‌ఎంసీ కొత్త చట్టాన్ని ఆమోదం కోసం పంపిస్తామన్నారు. ఈ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కమిషనర్ లోకేష్ కుమార్‌కు పలు ఆదేశాలు జారీ చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టం ద్వారా భవన నిర్మాణ అనుమతులు, పౌరసేవల వేగవంతం, ప్రజాప్రతినిధులపై బాధ్యత పెంచడం, అధికారులు తమ విధులకు మరింత బాధ్యత వహించే విధంగా చూడడం వంటి కీలకమైన అంశాలను చట్టంలో పొందుపర్చాలన్నారు. నూతన పురపాలక చట్టం ద్వారా ప్రజలకు అందుబాటులో అనేక సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో వారికి వేగంగా, పారదర్శకంగా సేవలు అందుతాయన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సమూలంగా మార్చేందుకు నూతన పురపాలక చట్టంతో
సమానంగా మార్పులు చేసేందుకు అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. త్వరలో తీసుకురానున్న కొత్త తెలంగాణ బిల్డింగ్ అనుమతుల ప్రక్రియ నేపథ్యంలో అవసరమైన మార్పులు సైతం కొత్త చట్టంలో ఉండాలన్నారు. దీంతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం అయ్యే విధంగా చేస్తామన్నారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శనివారం ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జోనల్ స్థాయిలో ప్రతి కమిషనర్ మరింత చొరవగా వినూత్న కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఎస్‌ఆర్‌సీపీ, రోడ్ల నిర్వహణ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం వంటి వౌలిక వసతుల కల్పన కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ వంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జోన్ల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు పోవాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్ల నిర్మాణం , పార్కుల నిర్వహణ, జంక్షన్ల అభివృద్ధి, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి ప్రాథమిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇలాంటి వాటి కోసం ప్రత్యేక ఐటీ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, దీని ద్వారా ఆయా కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తామన్నారు.

*చిత్రం... మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్