రాష్ట్రీయం

జాతి నిర్మాణంలో యువత కీలకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట, మార్చి 8: జాతి నిర్మాణంలో యువత కీలకం కావాలని, నేటి యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని దేశ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేందుకు సన్నద్ధులు కావాలని హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మహిళలంతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామంలో నవ యువత యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పి దేశ విశిష్ఠతను చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. చికాగోలో స్వామి వివేకానందుడు చేసిన ప్రసంగం యావత్ ప్రపంచానే్న అబ్బుర పరచిందని, అలాంటి యువత ఉన్న భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలంటే కేవలం చదువుతోనే సాధ్యం కాదని, చదువుతో పాటు వ్యాయామం, యోగా అవసరమని, అప్పుడే క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యువత చెడు వ్యామోహాల బారిన పడకుండా ఉండేందుకు వ్యాయామం, యోగా ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. దేశంలో రాబోయే పది సంవత్సరాల్లో 65 శాతం యువత పెరుగుతుందని, విద్యావంతులు, నిష్ణాతులైన యువత ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే ఉంటారన్నది నగ్నసత్యమని, అప్పుడు దేశంలోని రెండుకోట్ల మంది భారతీయ యువత ప్రపంచాన్ని శాసించడం ఖాయమన్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భంలో ఉన్న చిన్నారులు బాలికలుగా పుట్టనున్నారని తేలితే వారిని చిదిమేయడం తగదని, బాలికలను పెంచి పోషించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఇందుకు కేంద్రం అందిస్తున్న అన్ని సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ భారతం అభివృద్ధి చెందితే దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందినట్టే అన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతికి బానిసలు కాకుండా దేశ ఔన్నత్యం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో మద్య నిషేధం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ దత్తాత్రేయ కోరారు.

*చిత్రం... కోటకొండలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ