తెలంగాణ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) లపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హల్‌చల్ చేశారు. ఈ తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, ఈ అంశాలపై కేంద్ర చేసిన చట్టాలు ఏ మతానికి చెందిన వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. అందువల్ల ఏ మతం వారు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దేశాల్లో మైనారిటీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో 1947 లో మైనారిటీలుగా ఉన్న హిందూ తదితరుల సంఖ్య 23 శాతం వరకు ఉండగా, 2011 వరకు ఈ సంఖ్య 3.7 శాతానికి తగ్గిపోయిందన్నారు. బంగ్లాదేశ్‌ళో 1947 లో మైనారిటీలుగా ఉన్న హిందువులు తదితరుల సంఖ్య 22 శాతం ఉండగా, 2011 వరకు 7.8 శాతానికి తగ్గిపోయిందన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో 1992లో హిందువులు తదితరులు రెండు లక్షల మంది ఉండగా, ఇప్పుడు 500 కు పడిపోయిందన్నారు. వివిధ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరగడంతో వారు శరణార్దులుగా భారత్‌కు వచ్చారని, అలాంటి వారిని ఆధుకోవడం మన ధర్మమన్నారు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఏ మతానికి వ్యతిరేకం కాదని, అందువల్ల ఏ మతం వారు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి భారత్‌కు శరణార్ధులుగా వస్తున్న హిందువులు, శిక్కులు తదితరులకు భారత పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం ఉన్నట్టు కొంత మంది ప్రచారం చేస్తున్నారని, అది కేవలం రాజకీయ లబ్దికోసం మాత్రమేనని రాజాసింగ్ ఆరోపించారు. 2011 లో అంతకు ముందు జనాభాగణన జరిగిన సందర్భంలో ఎవరూ ఆందోళన వ్యక్తం చేయలేదని, ఇప్పుడు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. ఎన్‌పీఆర్ కోసం వచ్చే సిబ్బందికి వ్యక్తిగత సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులు ఏమిటన్నారు. భారతప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై శాసనసభలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడమేనని రాజాసింగ్ ఆరోపించారు. ఈ తరహా తీర్మానం చేయడం మంచిది కాదంటూ, తీర్మానం కాపీని చించి సభలో వెదజల్లారు. ఈ సమయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాజాసింగ్ మైక్ కట్ చేశారు. దాంతో రాజాసింగ్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో గట్టిగా మాట్లాడారు. ఈ తరుణంలోనే సభను స్పీకర్ భోజన విరామ సమయం కోసమంటూ వాయిదా వేశారు.
సుప్రీంలో 140 కేసులు
సిఏఏ పై సుప్రీంకోర్టులో 140 కేసులు నమోదయ్యాయయని కేసు తేలేవరకు సీఏఏ చేపట్టవదని, మతం పేరుతో విచక్షణ చూపవద్దని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ కోరారు. సీఎం ప్రతిపాదించిన తీర్మానంపై చర్చలో పాల్గొంటూ, దేశంలో అన్ని కులాలు, అన్ని మతాల వారు సమానమేనని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతు తెలియచేస్తున్నట్టు కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టివిక్రమార్క తెలిపారు. భారతదేశానికి కేసీఆర్ నాయకత్వం వహించాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ కోరారు. కేంద్రం తీసుకువచ్చిన సిఏఏ చట్టంపై పునఃసమీక్షించాలని ఆయన సూచించారు. దేశం ఎదుర్కొంటున్న జఠిల సమస్యల పరిష్కారానికి, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ప్రధాన మంత్రి శ్రద్ద చూపాలని కోరారు.

*చిత్రం... అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్