తెలంగాణ

కరోనా.. తస్మాత్ జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మార్చి 1 తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వివరాలు తెలియజేయాలని, లేని పక్షంలో ప్రభుత్వమే వివిధ మార్గాల ద్వారా గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. వీరిని గుర్తించడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్యాధికారితో కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి, ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో గురువారం మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర, ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు
వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని, అంతగా భయపడాల్సిన అవసరం కానీ, భయోత్పాతం చెందాల్సిన అవసరం కానీ లేదని అన్నారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. గతంలో ప్రకటించిన విధంగా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, క్లబ్‌లు, పబ్‌లు, బారుల మూసివేత కొనసాగుతుందన్నారు. అయితే పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయన్నారు. అయితే, 2500 పరీక్షా కేంద్రాలను ప్రతి రోజు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జన సమర్థం ఉన్న చోటకి వెళ్లకుండా తీసుకునే చర్యల్లో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి భక్తులను అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం లేకుండా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను కూడా రద్దు చేసినట్టు తెలిపారు. అయితే, ఉగాది పంచాంగ శ్రవణాన్ని ప్రగతిభవన్ నుంచి లైవ్ ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తిగా సహకరిస్తామని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో కలిసిన ముస్లిం మత పెద్దలు హామీ ఇచ్చినట్టు కూడా సీఎం కేసీఆర్ వెల్లడించారు. షాపులు, మాల్స్ యథాతథంగా కొనసాగుతాయన్నారు. నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న వారికి ఎవరికీ కరోనా సోకలేదని, సోకినవారంతా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇందులో ఐదుగురు నేరుగా హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన వారు కాగా మిగిలిన వారంతా వివిధ మార్గాల ద్వారా వచ్చిన వారేనన్నారు. రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో ఎవరు చనిపోలేదని, కనీసం వారిలో ఏ ఒక్కరికీ వెంటిలేటర్ కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని నిరోధించడానికి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో (ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, కర్నాటక) 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన మత ప్రచారానికి వచ్చిన ముస్లింలని విచారణలో తేలిందన్నారు. వారందరికీ కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ తరలించి క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వ్యాధి లక్షణాలు ఉండటంతో ఇంకేంత మంది విదేశాల నుంచి వచ్చారో తెలుసుకొని పరీక్షలు నిర్వహించాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. మార్చి 1 తర్వాత రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలుసుకోవడానికి ప్రతి గ్రామానికి ఒక పోలీసు అధికారిని ఇప్పటికే నియమించామన్నారు. వచ్చిన వారు తమంతకు తాముగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోతే ప్రభుత్వమే ఇంటెలిజెన్స్, పోలీసు, గ్రామ/మున్సిపల్ అధికారుల నుంచి తెలుసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్థులు కూడా తమకు తెలిసిన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ కర్వెంటైన్‌లో ఉంటామని కోరితే పరీక్షలు నిర్వహించాక అనుమతిస్తామని కూడా సీఎం తెలిపారు.
*చిత్రం... ప్రగతి భవన్‌లో కరోనాపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ , పాల్గొన్న మంత్రులు, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు