తెలంగాణ

హడావిడి... నాణ్యత కొరవడి.. పుష్కర పాట్లు-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 27: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23వరకు కృష్ణా పుష్కరాల నిర్వాహణకు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు ఆలస్యంగా మొదలై హడావుడిగా నాసిరకంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లు, రోడ్ల నిర్మాణ పనులు చూస్తే అవన్ని 19రోజుల వ్యవధిలో పూర్తవ్వడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ నెల 28వరకే పనులు పూర్తికావాలన్న అధికారుల ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది కానీ నాణ్యతకు మాత్రం తిలోదకాలిస్తున్నారు. కనీసం కోటిన్నర మంది భక్తులు కృష్ణా పుష్కరాలకు వస్తారని అంచనా వేసిన యంత్రాంగం అందుకు తగ్గట్లుగా సకాలంలో వసతుల కల్పనలో విఫలమవుతుంది. జిల్లాలో 590.22 కోట్లతో 28ఘాట్‌ల నిర్మాణాలతో పాటు సదరు ఘాట్‌లకు వచ్చి వెళ్లే మార్గాల్లో రోడ్ల విస్తరణకు ప్రతిపాదించారు. ఇందుకు ప్రభుత్వం 486కోట్లను ఇప్పటికే వివిధ శాఖలకు మంజూరు చేసింది. అత్యధికంగా ఆర్‌అండ్‌బి శాఖ పనులకు 299కోట్లు, ఇరిగేషన్‌కు 73.99కోట్లు, పంచాయతీరాజ్‌కు 70.3కోట్లు, ఆర్‌డబ్ల్యుఎస్‌కు తాగునీటి వసతికి 18.3కోట్లు, మరుగుదొడ్లకు 2.5కోట్లు, దేవాదాయశాఖకు 3.56, విద్యుత్‌శాఖకు 7కోట్లు, పోలీస్‌శాఖకు 5కోట్ల, పారిశుద్ధ్యంకు పంచాయతీశాఖకు 4కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆలస్యంగా మొదలై..
ముందస్తుగా చేపట్టాల్సిన పుష్కర ఘాట్‌లు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులు చాలా ఆలస్యంగా ప్రారంభించగా వాటిని ఈనెల 28వ తేది నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. నిజానికి 28 పుష్కర ఘాట్‌లలో నేటికి ఒక్క ఘాట్ నిర్మాణ పనులు కూడా పూర్తికాలేదు. ఇక రోడ్ల విస్తరణ పనులన్ని పాత రోడ్లను త్రవ్వడం, కంకర పరచడం వంటి దశలోనే ఉన్నాయి.
మెజార్టీ ఘాట్‌లు అసంపూర్తిగానే..!
కృష్ణా పుష్కరాలలో నదీ ప్రాంతంలో ఘాట్‌ల నిర్మాణం ప్రధానం. ఇరిగేషన్ శాఖ, ఎన్‌ఎస్పీలు 26ఘాట్‌ల నిర్మాణాలు చేపట్టగా వాటిలో నేటికి ఒక్క ఘాట్ పనులు పూర్తి కాలేదు. 74వేల క్యూబిక్ మీటర్లుకు 65వేల సిసి వర్క్ పనులు పూర్తయినట్లుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్న లెక్కలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన కనిపించడం లేదు. దామరచర్ల మండలంలో 11 ఘాట్‌లు నిర్మిస్తుండగా భక్తులు అధికంగా 40లక్షల మేరకు వస్తారనుకుంటున్న వాడపల్లి వద్ద నాలుగు పుష్కర ఘాట్‌లు నిర్మిస్తుండగా వాటి పనులు ఇంకా 55 శాతం వరకు మాత్రమే పనులు జరిగాయి. ఇసుక, సిమెంట్, కంకర వినియోగంలో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతూ స్థానికంగా నదిలో లభిస్తున్న మట్టి, ఇసుకను ఘాట్‌ల బెడ్‌లకు వినియోగించిన ఘటనలు కనిపిస్తున్నాయి. ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, కనగల్, పిఏపల్లి మండలం అజ్మాపురం ఘాట్‌లు, మఠంపల్లి మండలం బాలాజిఘాట్‌లు తుది దశకు చేరుకున్నాయి. చందంపేట మండలం కేశరాజుపల్లి, పెద్దవూర మండలం సాగర్ డ్యాం వద్ధ ఉట్లపల్లి, పొట్టిచెల్మ, చింతలపాలెం అంజనేయస్వామి, శివాలయం ఘాట్‌లు, మఠంపల్లి మండలం ప్రహ్లాదఘాట్‌లు, మేళ్లచెర్వు మండలం బుగ్గమాధారం ఘాట్ వజినేపల్లి, కిష్టాపూర్, నేరడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్, పానగల్ ఘాట్‌ల నిర్మాణ పనులు సగానికి పైగా చేరాయి.
రోడ్ల పనులు సగమే..!
జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 69 రోడ్లు, ఆర్‌అండ్‌బి శాఖ 38 రోడ్లు విస్తరణ పనులు చేపట్టింది. వీటిలో ఆర్‌ఆండ్‌బి శాఖ 56 పనులకు టెండర్లు పిలిచి 39 పనులకు 239.72కోట్లకు గుత్తేదారులతో ఒప్పందం చేసుకోగా వాటిలో కేవలం 36కోట్ల విలువైన 14పనులు మాత్రమే పూర్తి చేసింది. మరో 115కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ 69పనులకు 70.3కోట్లతో గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకుని వాటిలో నేటికి 5కోట్ల విలువైన 20పనులను మాత్రమే పూర్తి చేయగా 196 కిలోమీటర్ల రోడ్ల పనులకు కేవలం 51 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో ప్రధానంగా నాగార్జున సాగర్-హైద్రాబాద్ రోడ్డు ఐదు మీటర్ల చొప్పున 81 కిలోమీటర్లు విస్తరించే పనులు 119 కోట్లుతో చేపట్టగా 45 శాతం పనులు సాగాయి. పుష్కరాల్లో దేవరకొండ మండలం చిన్నఅడిశర్లపల్లి నుండి పిఏపల్లి మండలం అజ్మాపురం ఘాట్ వరకు 20కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు 45శాతమే సాగాయి. దామరచర్ల మండలంలో 7.61కిలోమీటర్లతో 65 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ చేపట్టగా వాటిలో 60శాతం పనులు జరిగాయి. మేళ్లచెర్వు-మఠంపల్లి, డిండి-చెర్కుపల్లి, అడవిదేవులపల్లి- ముదిమాణిక్యం ఆరుకిలోమీటర్ల రోడ్డు, డిండి-దేవరకొండ 34 కిలోమీటర్ల రోడ్డు, మట్టపల్లి-మఠంపల్లి లక్ష్మినరసింహస్వామి ఆలయ రోడ్డు, నేరడుచర్ల-మహంకాళిగూడెం ఘాట్, దొండపాడు-వజినేపల్లి రోడ్ల పనులన్ని కూడా సగటున 45శాతం వరకే జరిగాయి.