తెలంగాణ

ఉద్ధృతమైన ఎమ్సెట్ ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోంది. శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలతో అనేక చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. నగరంలోని సచివాలయం, జెఎన్‌టియు క్యాంపస్, మంత్రుల నివాస సముదాయం, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ శనివారం తరగతులు బహిష్కరించాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి ఎల్.అయ్యప్ప పిలుపునిచ్చారు.
ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ నిన్నటి వరకు రాష్ట్ర రాజధానిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేయగా, ఇప్పుడు ఈ ఆందోళన జిల్లాలకు పాకింది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రద్దు వద్దంటూ మెరిట్ సాధించిన విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ధర్నాలు చేశాయి. రాష్ట్ర సచివాలయం వద్ద నిన్న, మొన్న ర్యాంకర్లు ఆందోళన చేయగా, కిమ్మనకుండా ఉన్న పోలీసులు, శుక్రవారం కఠినంగా వ్యవహరించారు. ఎంసెట్-2ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరంలోని పలుచోట్ల ర్యాంకర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో నగరం దద్దరిల్లింది. ప్రశ్నాపత్రం లీకేజీ కావడం ముమ్మాటికి సర్కారు అసమర్థతేనని, పరీక్షల నిర్వహణ సక్రమంగా చేపట్టడంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు లక్ష్మారెడ్డిలు విఫలమైనందుకు, వారిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తోపులాట, అరెస్టులు
ఇలాఉండగా బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించేందుకు ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రుల నివాస సముదాయం వద్దకు చేరుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దశలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. చివరకు పోలీసులు వారిని అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సచివాలయం వద్ద ఆందోళనలు
అలాగే ఎంసెట్-2 ర్యాంకర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నేతలు ర్యాలీగా వచ్చి సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత విద్యార్థులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే జెఎన్‌టియు క్యాంపస్ ముందు టిఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఎంసెట్-2 రద్దును, సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సర్కారు దిష్టిబొమ్మ దగ్ధం
ఎంసెట్-2 లీక్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు నిరసిస్తూ నిజాం కళాశాల, బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సచివాలయానికి రాని మంత్రులు
ఎంసెట్-2పై భారీ ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పటికీ, విద్యా మంత్రి అయిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వైద్య మంత్రి సి. లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయానికి రాలేదు. ఎంసెట్‌తో ఈ ఇద్దరికి సంబంధాలు ఉన్నప్పటికీ, వారు సచివాలయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ వారికి హామీ ఇచ్చేందుకు వచ్చి ఉంటే బాగుండేదని, ప్రభుత్వం తరఫున అభయం లభించలేదన్న అభిప్రాయం వ్యక్తమయింది. సిఎం ఏర్పాటు చేసిన సమావేశానికి శుక్రవారం సాయంత్రం ఇద్దరు మంత్రులు వెళ్లారు.

తెలంగాణ సచివాలయంలోకి చొచ్చుకువచ్చేందుకు యత్నిస్తున్న ఎమ్సెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులను గేటుకు తాళం వేసి అడ్డుకుంటున్న పోలీసులు