తెలంగాణ

గల్ఫ్‌లో తెలు‘గోడు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 31: ఓ వైపు కరవు..మరోవైపు ఉపాధి లేమి.. వెరసి నిరుద్యోగులు గల్ఫ్ దేశాలే ప్రత్యామ్నాయ ఉపాధి కేంద్రాలుగా భావిస్తూ ఆ వైపునకు అడుగులేస్తుండగా, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురవుతోంది. లక్షల కొద్దీ అప్పులు చేస్తూ గల్ఫ్ అనే ‘ఆశ’ల దారిలో అంతులేని ప్రయాణం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో అడుగు పెట్టగానే తెలుగోళ్లకు కష్టాలు మొదలవుతుండగా, ఉత్తర తెలంగాణ నుంచి ప్రతియేటా వేల సంఖ్యలోనే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. దుబాయ్, ఒమన్, రియాద్, సౌదీ అరేబియా, మస్కట్, బెహరాన్, కువైట్, ఖతర్, ఇరాక్, అప్ఘనిస్తాన్ తదితర గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. అయితే, ఉపాధి వేటలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ వాసుల ఆశలు ఆవిరైపోతూ, కష్టాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా, కువైట్‌లో నష్టాలను చవిచూస్తున్న చమురు, ఇతర కంపెనీలు ఏడు మాసాల నుండి తమ ఉద్యోగులను తొలగిస్తుండడం, జీతాలు కూడా ఇవ్వకుండా కంపెనీలను మూసేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలోని తెలంగాణవాసులు ఎక్కువగా పనిచేసే పలు కంపెనీలు మూసేయడంతో సుమారు 10 వేల మంది భారతీయులు రోడ్డున పడినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 3 వేల మంది ఉండగా, ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఉన్నట్లు, వీరంతా ఆకలితో అలమటిస్తున్నట్లు సమాచారం. ఏడు మాసాల క్రితం నుంచి కంపెనీలు బంద్ చేస్తుండగా, అప్పటినుంచి జీతాలు లేక తెలుగువాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. కంపెనీలు మూసివేయడంతో తెలుగువాళ్లు ఖర్జూర, మంచినీరు తాగుతూ బతుకుతున్నారని సౌదీలోని దమామ్‌లో నివసిస్తున్న పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉద్యోగి ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. పాస్ట్‌పోస్టులు కంపెనీల వద్దనే ఉండడంతో ఎక్కడికి కదల్లేకపోతున్నామని, తమను ఆదుకోవాలంటూ మరో వ్యక్తి ‘ఆంధ్రభూమి’తో వాపోయాడు. సౌదీ అరేబియా, కువైట్‌లో తమ వారు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం తెలిసిన ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టి తెలుగువారు ఇంటికి తిరిగివచ్చేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

సౌదీ అరేబియాలోని ఒక ప్రదేశంలో తెలుగు ప్రజల అవస్థలు