తెలంగాణ

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 3: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన ప్రధాన కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీని సందర్శించి ప్రధాన కాల్వల ద్వారా లాంఛనంగా నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా 2200 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా మరో 2200 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతం నుండి రిజర్వాయర్‌లోకి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో కాల్వల ద్వారా క్రమేణా నీటి విడుదల పరిమాణాన్ని పెంచుతామని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం నాటికి కాకతీయ కెనాల్ ద్వారా 4 వేలు, వరద కాల్వ ద్వారా 5 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తామని తెలిపారు. దీంతో ఈ రెండు కాల్వల ద్వారా ఎస్సారెస్పీ జలాలు కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంలోకి చేరుకోనుండడంతో ఎల్‌ఎండి జలకళను సంతరించుకోనుంది. 24 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎల్‌ఎండిలో ప్రస్తుతం రెండున్నర టిఎంసిల వరకే నీటి నిల్వలు ఉండగా, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా విడుదల చేస్తున్న నీటితో కరీంనగర్, వరంగల్ జిల్లాల సాగు, తాగునీటి ఇక్కట్లు దూరం కానున్నాయి. ఎల్‌ఎండిలో 3 టిఎంసిల వరకు తాగునీటి అవసరాలకు అట్టిపెట్టుకుని మిగతా జలాలను ఖరీఫ్ పంటల సాగు కోసం ఆయకట్టు రైతాంగానికి అందించనున్నారు. సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు పంటలకు శ్రీరాంసాగర్ జలాలు ప్రయోజనం చేకూర్చనున్నాయి. గత రెండు సంవత్సరాల నుండి తీవ్ర వర్షాభావం వల్ల ఎస్సారెస్పీ నీటి నిల్వలను సంతరించుకోలేకపోయింది. గతేడాది అయితే ప్రాజెక్టు చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 2.70 టిఎంసిల వరకే వరద జలాలు వచ్చి చేరాయి. ఫలితంగా నెల రోజుల క్రితం వరకు కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అడుగంటిన నీటి నిల్వలతో కళావిహీనంగా కనిపించింది. అదృష్టవశాత్తు ఈ ఏడాది సీజన్ ఆరంభం నాటి నుండే ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండడం, ఎస్సారెస్పీకి ప్రధాన క్యాచ్‌మెంట్ ఏరియాగా ఉన్న మహారాష్టల్రోనూ ఏకధాటిగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి గణనీయంగా వరద నీరు వచ్చి చేరింది. డెడ్‌స్టోరేజీకి దిగువన కేవలం 4 టిఎంసిల వరకకే ఎస్సారెస్పీ జలాలు పరిమితం అవగా, పెద్దఎత్తున వచ్చి చేరిన ఇన్‌ఫ్లోల ఫలితంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. 1091 అడుగులు, 90 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్‌లో బుధవారం సాయంత్రం నాటికి 1077.60 అడుగులు, 46.20 టిఎంసిల వరకు నీటి నిల్వలు చేరుకున్నాయి. 16 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అన్ని కాల్వల ద్వారా మూడున్నర క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నారు. మునుముందు ఎగువ ప్రాంతాల నుండి మరింత పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో ముందస్తుగానే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితమే లక్ష్మి కెనాల్ నుండి 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా, బుధవారం మరో రెండు ప్రధాన కాల్వలైన కాకతీయ, సరస్వతి కాల్వలతో పాటు వరద కాల్వ ద్వారా కూడా నీటిని వదిలారు. నిజానికి వరద కాల్వ ద్వారా ఇప్పటికిప్పుడు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేనప్పటికీ, మునుముందు భారీగా వరద జలాలు వచ్చి చేరే అవకాశాలున్నట్టు సిడబ్ల్యుసి నుండి సంకేతాలు వెలువడడంతో ముందస్తుగానే లోయర్ మానేరు డ్యాంను నింపాలనే ఉద్దేశ్యంతో ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీకి చెందిన అన్ని కాల్వల ద్వారా నీటిని అందిస్తుండడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎంతో మేలు చేకూరనుండడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్సారెస్పీ కాకతీయ కాలువకు నీటిని విడుదల
చేస్తున్న మంత్రులు ఈటెల, పోచారం