తెలంగాణ

తుపాకుల మోత.. బుల్లెట్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 8: ప్రశాంతంగా ఉండే మిలీనియం టౌన్‌షిప్ తుపాకుల మోతతో అదిరిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తుల మాదిరిగా కొందరు పోలీస్‌లు మఫ్టీలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో షికార్లు చేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్న టౌన్‌షిప్ వాసులు వీళ్లను పెద్దగా పట్టించుకోలేదు. ఉదయం 6.45గంటలకు ఓ డిసిఎం వచ్చి మిలీనియం టౌన్‌షిప్ ముఖద్వారం దగ్గర నిలిచింది. దాని వెంటే ఒక ఇన్నోవా, మరో స్కార్పియో కారు మిలీనియం టౌన్‌షిప్‌లోకి నేరుగా దూసుకెళ్లాయి. ముందుకు పోయిన కార్లు నరుూం ముఠా సభ్యుడు బాషా ఇంటి సమీపంలో నిలిచాయి. డిసిఎంలోంచి దిగిన పోలీస్ గ్రేహౌండ్స్ దళాలు, కేంద్ర బలగాలు టౌన్‌షిప్‌లోని ఇతరుల ఇళ్లల్లోకి వెళ్లి ఎవరూ బయటకు రావద్దని వారి దగ్గర ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే ఇళ్లకు సంబంధించిన కాంపౌండ్ వాల్ గేట్లకు తాళాలు వేసుకోవాలని ఆదేశించారు. కొందరు మహిళలు గ్రేహౌండ్స్ దళాలను ఏం జరుగుతోందని ప్రశ్నించే లోపే హడావిడి ప్రారంభమైంది. 40 నుండి 50 మంది వరకు గ్రేహౌండ్స్ దళ సభ్యులు నరుూంను పట్టుకోవడానికి టౌన్‌షిప్ ప్రధాన రోడ్డుపై మాటువేశారు. ఇంతలోపే ఎపి28డిఆర్5859 నంబరు గల ఇండీవర్ కారు రానే వచ్చింది. కారులో నరుూంను చూసిన బలగాలు అతణ్ణి వెంబడించాయి. కాసేపటికే కాల్పుల మోతతో టౌన్‌షిప్ దద్దరిల్లిపోయింది. జనం బయటికి రాకుండా పోలీసులు నిర్భంధించడంతో బెంబేలెత్తిపోయారు. నరుూం ముఠా సభ్యుడు బాషా ఇంట్లోకి కూడా గ్రేహౌండ్స్ దళాలు దూరాయి. అందులో కొందరిని అదుపులోకి తీసుకుని బంధించారు. కారులో నుంచి వచ్చిన నరుూం కూడా పోలీసుల పైకి కాల్పులు జరిపినట్లు అక్కడి ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. నరుూం డ్రైవరు పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. నరుూం కారులో నుంచి దిగి పోలీసులపైకి కాల్పులు జరిపిన నేపథ్యంలో పోలీస్ గ్రేహౌండ్స్ దళాలు నరుూంపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. పోలీసులు, నరుూంల మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు జరగటంతో మిలీనియం టౌన్‌షిప్ రోడ్డు వెంట ఎక్కడ పడితే అక్కడ బుల్లెట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. అతి దగ్గర నుండి నరుూంను హతమార్చినట్లు తెలుస్తోంది. ఉదయం ఆరున్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు షాద్‌నగర్ మిలీనియం టౌన్‌షిప్ గ్రేహౌండ్స్ దళాల అదుపులో ఉంది. దాదాపు 20కుటుంబాలు గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కాలం గడిపారు. ఆప్రాంతం నుండి నరుూం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ తరలించిన తరువాత కూడా ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం వైపు ఎవరినీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నరుూం పోలీసులపై కాల్పులు జరుపుతున్న సమయంలో తుపాకుల మోత శబ్దం మొదట పెద్దగా వినిపించలేదని, తరువాత పోలీసులు నరుూంపై కాల్పులు జరిపినప్పుడు మాత్రం భీకరమైన శబ్దం వచ్చిందని, ఇళ్లల్లో నుండి ప్రత్యక్షంగా చూసిన కొందరు బహిరంగంగానే మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు. కాగా ఎన్‌కౌంటర్ జరుగుతుందని సమాచారం తెలియడంతో ముందు మార్గం నుండి కాకుండా టౌన్‌షిప్ వెనుకమార్గం నుండి ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన విలేఖరులు నేరుగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే నరుూంను మట్టుబెట్టిన పోలీస్ గ్రేహౌండ్స్ దళాలు మరో ముగ్గురిని చేతులు వెనక్కి బంధించి నేలపై పడేశారు. అక్కడికి చేరుకున్న ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు వారిని చిత్రీకరించేందుకు ప్రయత్నించగా వెంటనే గ్రేహౌండ్స్ పోలీస్ బలగాలు విలేఖరులపైకి తుపాకుల గురి పెట్టారు. కెమెరాలు, సెల్‌ఫోన్లను లాక్కున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు పోలీస్ గ్రేహౌండ్స్ దళాలు విలేఖరులను కూడా అక్కడే నిర్బంధించి మధ్యాహ్నం 12గంటల సమయంలో వదిలిపెట్టారు. వారికి సంబంధించిన సెల్‌ఫోన్లు, కెమెరాలు పోలీస్ బలగాల దగ్గరే ఉండిపోయాయి. వారందించిన సమాచారం ప్రకారం ఐదారుగురు మహిళలతోపాటు మరో నలుగురు, ఐదుగురు పురుషులను టౌన్‌షిప్ వెనుకభాగం నుండి పోలీస్ వాహనాలలో హైదరాబాద్‌కు తీసుకువెళ్లినట్లు తెలిసింది. సాయంత్రం దాదాపు ఐదు గంటల వరకు టౌన్‌షిప్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని, మరో ముగ్గురు చనిపోయారని పుకార్లు షికార్లు వినిపించాయి. తుదకు నరుూం మాత్రమే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

చిత్రం.. గ్రేహౌండ్స్ దళాల అదుపులో నయాం అనుచరులు