కృష్ణ

తక్షణం నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, ఆగస్టు 24: తక్షణమే సాగునీరు, తాగునీరు అందించాలని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కలిదిండి సిబి కెనాల్‌కు వెంటనే 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన ఇరిగేషన్ అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని కోరుకొల్లు లాకుల వద్ద సిబి కెనాల్‌ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అడుగంటిన మంచినీటి చెరువులను నీటితో నింపుకోవాలన్నారు. గుర్వాయిపాలెం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, మార్కెట్ యార్డు ఛైర్మన్ తాడినాడ బాబు, కైకలూరు ఎఎంసి ఛైర్మన్ రాజేశ్వరి, డిసి ఛైర్మన్ గంగా ప్రసాద్, మాజీ ఎంపిపి మురళి, కోదండం, నీటి సంఘాల అధ్యక్షులు పేకేటి సత్యనారాయణ, రాంబాబు, అధికారులు, బిజెపి నాయకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

లంకల్లో అడుగంటిన భూగర్భ జలాలు

తోట్లవల్లూరు, ఆగస్టు 24: తోట్లవల్లూరు మండలంలోని లంక భూముల్లో వందలాది వ్యవసాయ బోర్లు వట్టిపోయాయి. పంటలకు నీరందించలేక పోతున్నాయి. భూగర్భ జలాలు అందక మోటార్లు నిష్ప్రయోజనంగా మారాయి. మరోవైపు ఈ నెలలో చినుకు జాడ లేకపోవటం, ఇటు బోర్లు వట్టిపోవటంతో పచ్చని పంటలు నిలువునా ఎండిపోతు రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. లంకల్లో వ్యవసాయమంతా బోర్లు, వర్షాలపైనే ఆధారపడి ఉంది. ఈ నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసేవి. కానీ ఈ ఏడాది చినుకు జాడ లేకపోవటంతో పంటలు ఎండిపోతున్నాయి. కేవలం సబ్‌మెర్సిబుల్ ఉన్న బోర్లే నీటిని అందిస్తుండటంతో చాలామంది రైతులు వేల రూపాయలు ఖర్చుపెట్టి మామూలు మోటార్ల స్థానంలో సబ్‌మెర్సిబుల్ మోటార్లు వేసేందుకు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. తోట్లవల్లూరు కృష్ణానది పాయ పక్కనే ఉన్న గౌడ సొసైటీలో చాలా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోయాయి. ఇలా లంకల్లో అనేకచోట్ల పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. లంక పొలంలో ఉన్న బోరుకి రెండు నెలల నుంచి నీరు అందటం లేదని రైతు వీరంకి శోభనాద్రి చెప్పారు. దీంతో 50 సెంట్లలో సాగుచేసిన చెరకుతోట నీరందక ఎండిపోతోందని, వర్షాలు కురవటం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తపర్చారు. ఆగస్టులో వర్షాలు పడకపోగా తీవ్రమైన ఎండలు కాయటంతో చెరకుతోటలు ఎండిపోతున్నాయని తెలిపారు. మరో రైతు రామకోటయ్య మాట్లాడుతూ సొసైటీ పొలంలో 50 సెంట్లలో బీరతోట సాగు చేశానని, రెండుసార్లు మాత్రమే కాయలు కోశానని, తర్వాత నెలరోజుల నుంచి బీర మొక్కలకు నీరు పెట్టలేకపోవటంతో పూర్తిగా చనిపోయాయని తెలిపారు. దీంతో సాగు ఖర్చులు రూ.10వేలు నష్టపోయినట్లు ఆయన వివరించారు.

ఎస్‌బిఐ ఎటిఎం చోరీకి విఫలయత్నం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఆగస్టు 24: స్థానిక చిలకలపూడి సెంటరులోని స్టేట్ బ్యాంక్ ఎటిఎం చోరీకి గుర్తుతెలియని దుండుగులు విఫలయత్నం చేశారు. ఎటిఎం సెక్యూరిటీ గార్డ్‌ను తీవ్రంగా కొట్టిన దుండగులు ఎటిఎంను పగలగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చిలకలపూడి సెంటర్‌లోని ఎస్‌బిఐ ఎటిఎంకు మంగళవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు వచ్చారు. వచ్చీరావటంతోనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు గాలంకి శ్రీహరి ముఖంపై ముసుగు వేసి సుత్తితో నెత్తిన గట్టిగా మోది తీవ్రంగా గాయపర్చారు. అనంతరం ఎటిఎంను పగలగొట్టే ప్రయత్నం చేయగా సాధ్యంకాకపోవటంతో ఉడాయించారు. సెక్యూరిటీ గార్డ్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని బందరు డిఎస్పీ శ్రావణ్‌కుమార్, చిలకలపూడి సిఐ జనార్ధనరావు పరిశీలించారు.

దుండగులను పట్టుకొని శిక్షించాలి
స్థానిక రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన దళిత యువకుడు జి శ్రీహరిబాబుపై దాడి చేసిన దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి దాసరి సాల్మన్‌రాజు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన గాలెంకి శ్రీహరిబాబు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, రోజూ మాదిరిగానే మంగళవారం చిలకలపూడి సెంటరులో ఉన్న ఎస్‌బిహెచ్ ఎటిఎం సెంటరులో విధులు నిర్వహిస్తున్న శ్రీహరిబాబుపై దాడి చేసి ముసుగువేసి సుత్తితో తల పగలగొట్టి దాడి చేయటం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటిఎం సెంటర్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోవటం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు బీమా సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, చీకటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం
తోట్లవల్లూరు, ఆగస్టు 24: గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార్భాటాలతో కాలం గడుపుతూ ప్రజాసమస్యలను మరిచారని మాజీ మంత్రి, జిల్లా వైసిపి అధ్యక్షుడు కె పార్థసారథి విమర్శించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎంపిపి ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు సంబరాలు చేసుకున్నారని, తర్వాత హుదూద్ తుఫాన్, గోదావరి పుష్కరాలు, సంక్రాంతి సంబరాలు, విదేశీ పర్యటనలు, ఇపుడు కృష్ణా పుష్కరాలతో కాలం గడిపారని విమర్శించారు. డెల్టా పరిధిలోని చాలా మండలాల్లో సాగునీరు అందక వరినాట్లు వేయలేదని, కొన్ని ప్రాంతాల్లో నారుమడులు ఎండిపోయాయని చెప్పారు. దీంతో మళ్లీ రెండోసారి నారుమడులు పోసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిందని, అలాంటి రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు అందించి ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లంకల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్ లోడుతో ఉన్నాయని, దీంతో మోటార్లు పనిచేయటం లేదన్నారు. వెంటనే లంకల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు వేయాలని కోరారు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు పడిపోయాయని పార్థసారథి అన్నారు. ఇసుక తవ్వకాలపై వైసిపి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదనుకుంటే సిబిసిఐడి విచారణ జరిపించాలని పార్థసారథి సూచించారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు, మండల వైసిపి అధ్యక్షుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, చింతలపూడి గవాస్కర్‌రాజు, సుగుణాకరరావు, మోర్ల రామచంద్రరావు పాల్గొన్నారు.

బైపాస్‌ల నిర్మాణానికి
అనుమతి హర్షణీయం
నందిగామ, ఆగస్టు 24: జాతీయ రహదారిపై నందిగామ, కంచికచర్ల వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపడంపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హర్షం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాల నివారణకు బైపాస్‌లు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి తీసుకురాగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె వివరించారు.

వెంకట సాయికిరణ్‌కు అభినందన
చందర్లపాడు, ఆగస్టు 24: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఈ నెల 23న వెల్లడైన ఐసిడబ్ల్యుఎ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆసరా ఫౌండేషన్ విద్యార్థి ఉడతా వెంకట సాయికిరణ్‌ను ఫౌండేషన్ అధ్యక్షులు వాసిరెడ్డి వంశీ అభినందించారు. వెంకట సాయికిరణ్ గతంలో జాతీయ స్థాయిలో సిపిటి 6వ ర్యాంకు, ఐపిసిసి 12వ ర్యాంకు, ఐసిడబ్ల్యుఎ ఇంటర్‌లో 5వ ర్యాంకు సాధించాడు. కిరణ్ తల్లిదండ్రులు మండలంలోని పున్నవల్లిలో చిరువ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. నేడు జాతీయ స్థాయికి ఎదిగిన కిరణ్‌కు సహకరించిన ఆసరా ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ కాలనీలో సమస్యలు పరిష్కరించండి
* ఎమ్మెల్యే రక్షణనిధి
విస్సన్నపేట, ఆగస్టు 24: విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. గడపగడపకు వైకాపా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ కాలనీలో ఆయన పర్యటించారు. గడపగడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను కాలనీవాసులకు వివరించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాలనీలో సరైన డ్రైనేజీలు, రోడ్డు సరిగాలేక పాదచారులు నడవాలంటే ఇబ్బందిగా ఉందని, అప్రకటిత విద్యుత్ కోతలతో రాత్రి సమయాల్లో వీధిలైట్లు వెలకగ చీకట్లో కాలనీవాసులు కాపురం చేయాల్సి వచ్చిందన్నారు. కాలనీ ఏర్పడి కొనే్నళ్లు అయినప్పటికీ కాలనీ సమస్యల విషయంలో ఎవ్వరూ స్పందించడం లేదని, ఈవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. పెన్షన్‌కు అర్హులైన వారు కాలనీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ జన్మభూమి కమిటీల వల్ల అర్హులకు కూడా పెన్షన్లు మంజూరయ్యే అవకాశం కొల్పోయారన్నారు. పక్కా గృహాలు కట్టుకుంటామన్నా కేటాయించడంలో అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నట్లు కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చారని, పక్కా ఇళ్ళను అర్హులకు కేటాయించడం మంచిదని అన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఓలేటి దుర్గారావు, మండల పార్టీ అధ్యక్షులు బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, పట్టణ కమిటి అధ్యక్షులు నెక్కలపు కుటుంబరావు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, వైకాపా నాయకులు అబ్బినేని శ్రీనివాసరావు, పాలంకి సీతారెడ్డి, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

కృష్ణమ్మ కలిపింది గ్రూపులనీ!
జి.కొండూరు, ఆగస్టు 24: కృష్ణా పుష్కరాలు జి.కొండూరు మండల తెలుగుదేశం పార్టీని ఒక్కటి చేశాయి. గ్రూపు తగాదాలు, విభేదాలు విస్మరించి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు ఐక్యంగా ముందుకు సాగారు. జి.కొండూరులో టమాటా మార్కెట్ సెంటరులో అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో 15వేల మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. మరో 5వేల మందికి అల్పాహారాన్ని అందించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు పుష్కర యాత్రికులకు సేవ చేయాలని ముందుగా జరిగిన టిడిపి మండల సమావేశంలో తీర్మానించారు. అక్కడ అందరూ ముందుకు వచ్చి వారి స్థోమత మేరకు చందాలు అందించారు. భక్తుల ఆదరణ సరిగా లేక మొదటిరోజు అన్నదాన శిబిరాన్ని నిరుత్సాహంగా ప్రారంభించారు. కానీ పుష్కర యాత్రికుల రద్దీతో టిడిపి నేతల్లో కూడా ఉత్సాహం వచ్చింది. మరోపక్క సిఎం చంద్రబాబు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, మంత్రి ఉమ స్ఫూర్తి మండల తెలుగుదేశం నేతల్లో పుష్కర యాత్రికుల సేవే మాధవసేవగా పరిగణించే విధంగా బీజం వేశాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం యాత్రికులకు పెట్టి అందరి మన్ననలు పొందారు. టిడిపి నాయకులు గ్రామాల వారీగా పోటీలుపడి మరీ అన్నదాన శిబిరంలో భక్తులకు సేవలందించారు. వంటలను స్వయంగా దగ్గరుండి వడ్డించారు. వర్గ రాజకీయాలను, మనస్పర్ధలను విడనాడి అందరూ ఒక్కతాటిపైకి వచ్చి మండల పార్టీలో ఉత్తేజాన్ని నింపారు. దీంతో కార్యకర్తలు, తెలుగుతమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.