తెలంగాణ

భగ్గుమన్న హెచ్‌సియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ (హెచ్‌సియు)లో పిహెచ్.డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనల సెగ ఢిల్లీని తాకింది. రోహిత్ ఆత్మహత్యతో వర్శిటీ విద్యార్థులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సియులో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తరలించడానికి ప్రయత్నించిన పోలీసులను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రోహిత్ ఘటనపై ఎలాంటి కమిటీని వర్శిటీ పాలకులు నియమించకుండానే చర్యలు తీసుకోవడంవల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో రోడ్డెక్కడంతో, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
ఉస్మానియాకు మృతదేహం
ఆదివారం రాత్రి పోలీసులు పలుమార్లు చేసిన ప్రయత్నాలను విద్యార్థులు భగ్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రోహిత్ తల్లిదండ్రులు యూనివర్శిటీకి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం ఏడు గంటల సమయంలో విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీంతో వర్శిటీలో విద్యార్థులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో రోహిత్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన ప్రజాగాయకుడు గద్దర్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం ఉప్పల్‌లోని అతని నివాస గృహానికి మృతదేహాన్ని తరలించారు.
మంత్రి దత్తాత్రేయపై కేసు
మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం వల్లే యూనివర్శిటీ విసి ఐదుగురు విద్యార్థులను బహిష్కరించారని, దీంతో తీవ్ర వేదనకు గురైన రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య వ్యవహారంపై ఎఐఎస్‌ఎ నాయకుడు ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. కేసులో ఎ1గా వైస్ ఛాన్సలర్ అప్పారావు, ఎ2గా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎ3గా ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్, ఎ4గా బిజెవైఎం నాయకుడు విష్ణులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సిఐ జూపల్లి రమేష్ చెప్పారు.
సంబంధం లేదు: దత్తాత్రేయ
హెచ్‌సియు విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తన లేఖకూ, రోహిత్ ఆత్మహత్యకూ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. యూనివర్శిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎబివిపి కార్యకర్తలను కొంతమంది తీవ్రంగా కొట్టారని తనకు విజ్ఞాపన వస్తే దాన్ని యథాతథంగా మానవ వనరుల మంత్రికి పంపించానని చెప్పారు. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తనకు తెలియదని, బిజెపికిగానీ, తనకుగానీ ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు. విచారణ జరుగుతోందని, అసలు విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆందోళన
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో పిహెచ్‌డి విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ రాజధాని ఢిల్లీలో సైతం విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరాని కార్యాలయం ముందు విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని విద్యార్థులు ఆరోపించారు. బారికేడ్లు తొలగించి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో విద్యార్థులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు.
వారిద్దరే కారణం
రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు బిజెపి నేతలు కారణమని సెంట్రల్ వర్శిటీ అధ్యాపక సంఘం ఆరోపించింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావులు తమ పరిధిదాటారని అధ్యాపక సంఘం వ్యాఖ్యానించింది. యూనివర్శిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూనివర్శిటీ అధ్యాపక సంఘం తీవ్రంగా ఖండించింది. యూనివర్శిటీ పాలనా విభాగం మొదటి నుంచీ తప్పులు చేస్తోందని, కమిటీలు విచారిస్తున్న తీరుపైనా తమకు అభ్యంతరాలున్నాయని, విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు ఉపసంహరించుకోవాలని సంఘం నేతలు అన్నారు. న్యాయవిచారణ జరపాలి
రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ జరిపించాలని ప్రజాసంఘాల నేతలు డిమండ్ చేశారు. ఇంతవరకూ జరిగిన నలుగురు దళిత విద్యార్ధుల ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, గద్దర్ డిమాండ్ చేశారు. వర్శిటీలో సాంఘిక బహిష్కారంవంటి చర్యలు సరికావని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బి వెంకట్, ప్రధాన కార్యదర్శి నాగయ్య, టిఎస్‌ఎఫ్ అధ్యక్షుడు భూక్యా చందూనాయక్, ప్రధాన కార్యదర్శి మూడ్ శోభన్‌నాయక్, సిపిఐఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు డి మల్లేష్ తదితరులు విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర కమిటీ నియామకం
రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. కమిటీలో షకీలా శంఘూ, సురత్‌సింగ్‌లు ఉన్నారు. వీరు సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుని రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

చిత్రం.. 1. ఢిల్లీలో స్మృతి ఇరానీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులను
నీటి ఫిరంగులతో చెదరగొడుతున్న పోలీసులు

2. రోహిత్ ఆత్మహత్య ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు