తెలంగాణ

60 కిడ్నీలు.. రూ.3 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 19: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా నల్లగొండ జిల్లా పోలీసులు మరో విజయం సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిడ్నీ రాకెట్ ఏజెంట్లను హాజరుపరిచి కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఇప్పటికే అరెస్టయిన నల్లగొండకు చెందిన కసుపరాజు సురేష్ వెల్లడించిన సమాచారం మేరకు పోలీసు బృందాలు గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన ప్రధాన ఏజెంట్ సురేష్‌బాయ్ ప్రజాపతి, అతని అనుచరుడు దిలీప్ ఉమేద్‌మాల్ చౌహాన్‌లతో పాటు హైద్రాబాద్ గచ్చిబౌలి ఈల్లా హోటల్‌లో పనిచేస్తున్న జెను నూకరాజులను అరెస్టు చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇద్దరు ఏజెంట్లతో పాటు ఎనిమిది మంది కిడ్నీ విక్రయదారులను అరెస్టు చేశామన్నారు. నూకరాజు తన కిడ్నీని అమ్ముకోవడంతో పాటు సురేష్ ప్రజాపతికి సహాయ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రధాన ఏజెంట్ సురేష్ ప్రజాపతి ఇంటర్‌నెట్‌లో కిడ్నీ ఇస్తామంటూ వెబ్‌సైట్స్ ఏర్పాటు చేసుకుని 2012నుండి కిడ్నీ విక్రయాల దందాను కొనసాగిస్తున్నాడు. ఇతను అహ్మదాబాద్‌లో స్థానిక ఆసుపత్రులతో, డయాగ్నాస్టిక్ సెంటర్లతో సంబంధాలు పెట్టుకుని కిడ్నీ మార్పిడి, విక్రయాల దందా నిర్వహిస్తు ఇప్పటిదాకా 60మంది కిడ్నీలను విక్రయించడం ద్వారా 3కోట్లకు పైగా సంపాదించాడు. కొలంబోలోని నవలోక్, హేమా, లంకన్, వెస్టర్న్ ఆసుపత్రుల్లో కిడ్నీల విక్రయం, మార్పిడి ఆపరేషన్లను జరిపించాడు. ఒక్కో కిడ్నీ గ్రహీత నుండి 28నుండి 30లక్షల మేరకు తీసుకునేవాడు. నిందితుల అక్రమ ఆస్తులను గుర్తిస్తామని, వాటిని జప్తు చేయిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే వారిని కోర్టుకు రిమాండ్ చేయడంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల అరెస్టుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కిడ్నీ విక్రయదారులు..గ్రహీతలపై..డాక్టర్లపై కేసులు
కిడ్నీ రాకెట్ కేసులో చట్ట వ్యతిరేకంగా తమ కిడ్నీలు విక్రయించిన వారితో పాటు కిడ్నీలు పొందిన వారిపైన, అక్రమ కిడ్నీ మార్పిడికి సహకరించిన అహ్మదాబాద్, కొలంబో ఆసుపత్రులపైనా, వైద్యులపైనా కూడా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ప్రకటించారు. కిడ్నీలు విక్రయించిన 60మందిలో 55మంది పేర్లు, కిడ్నీ గ్రహీతల్లో సైతం 55మంది పేర్లు ప్రజాపతి చెప్పాడన్నారు. కిడ్నీ గ్రహీతల్లో ఏపి, తెలంగాణల నుండి 22మంది, తమిళనాడు నుండి ఆరుగురు, మహారాష్ట్ర నుండి ఐదుగురు, ఢిల్లీ నుండి ముగ్గురు, కర్నాటక నుండి నలుగురు, కేరళ తదితర రాష్ట్రాల నుండి 12మంది ఉన్నారని దుగ్గల్ వెల్లడించారు.

అంబారిపై ఊరేగనున్న రుచిత

తల్లిదండ్రులతో ఢిల్లీకి చేరిన మాసాయపేట సాహసి
గణతంత్ర దినోత్సవంలో సాహస బాలల అవార్డు ప్రదానం

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 19: దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలను లెక్కచేయకుండా ఇద్దరు తోటి విద్యార్థులను కాపాడిన వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుచిత జాతీయ సాహస బాలల అవార్డుకు ఎంపికైంది. 2014 జూలై 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు తూప్రాన్ పట్టణంలోని కాకతీయ టెక్నో స్కూల్ బస్సు వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామం వద్ద కాపలాలేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో సికింద్రాబాద్-మన్మాడ్ ప్యాసింజర్ రైలు అతివేగంగా వచ్చి ఢీకొట్టిన సంఘటనలో 16 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్‌లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు మృతి చెంది మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. బస్సుల్లో ఇరుక్కున్న సాత్విక, మహిపాల్‌రెడ్డిలను గమనించిన రుచిత బస్సు కిటికీల్లోంచి బయటకు నెట్టివేయడంతో ఆ ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను కాపాడిన తాను తన తమ్ముడిని కాపాడుకోలేకపోయానని ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో రాష్టప్రతి చేతుల మీదుగా సాహస బాలల అవార్డును అందుకోనుంది.
ప్రతిష్టాత్మకమైన గీత చోప్రా అవార్డును ఈ నెల 24వ తేదీన ప్రధాని చేతుల మీదుగా రుచిత అందుకోనుంది. తన తల్లిదండ్రులైన మల్లేశం, లలితతో కలిసి ఈ నెల 17వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా సాహస బాలలను అంబారి (ఏనుగు)పై ఊరేగింపు నిర్వహించనుండగా రుచిత కూడా ఏనుగుపై ఊరేగే అవకాశం దక్కింది. 2014-15 సంవత్సరానికి సంబంధించిన సాహస బాలుర అవార్డుల స్వీకరణలో తెలుగు రాష్ట్రాల నుంచి రుచిత ఏకైక బాలిక కావడం గమనార్హం.

రోహిత్‌ది ఏ కులం?
ఎస్సీనా? బీసీనా?
దళితుడు కాదంటున్న విద్యార్ధి సంఘాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ ఘటనపై తీవ్రంగా కలత చెందిన విద్యార్ధి సంఘాలు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణం వైస్ చాన్సలర్‌ను తొలగించాలని, అలాగే కేంద్ర మంత్రివర్గం నుండి బండారు దత్తాత్రేయను బర్త్ఫ్ చేయాలని వారు కోరుతున్నారు. అయితే పనిలో పనిగా కొన్ని విద్యార్ధి సంఘాలు రోహిత్ కుటుంబం దళిత వర్గానికి చెందినది కాదని వాదిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా వారు రోహిత్ తండ్రి వేముల మణికుమార్, మణికుమార్ తండ్రి వెంకటేశ్వర్లు, రోహిత్ సోదరుడు వేముల రాజచైతన్య కుమార్ తదితరుల పుట్టిన ధ్రువపత్రాలు పత్రికలకు అందజేశారు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన రోహిత్ తాత తండ్రులకు అక్కడి రెవిన్యూ అధికారులు ఈ ధ్రువపత్రాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్ నానమ్మ మాటల వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
అందులో రోహిత్ నాన్నమ్మ రాఘవమ్మ మాట్లాడుతూ తాము వడ్డెర కులానికి చెందిన వారమని పేర్కొంది. తన కోడలు, కొడుకు సైతం వడ్డెర కులానికి చెందిన వారేనని ఆమె స్పష్టం చేసింది. దీనికి తోడు వేముల రాజ చైతన్య కుమార్‌కు సంబంధించిన పుట్టిన తేదీ దరఖాస్తు పత్రాలను కూడా ఒక విద్యార్ధి సంఘం విడుదల చేసింది. అందులో వారు తమ కులాన్ని వడ్డెరగా పేర్కొన్నారు. విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న దశలో కుల ప్రస్తావన అవసరం లేదని మరికొన్ని సంఘాల నాయకులు వాదిస్తున్నారు. ఏ కులానికి చెందిన విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నా అది ఘోరమైన పరిస్థితి అని, రోహిత్ ఆత్మహత్యను కులవివాదంలోకి లాగడం సబబుకాదనేది వారి వాదన. యూనివర్శిటీలో రోహిత్ సమర్పించిన ధ్రువపత్రాలను ఇపుడే తాము బహిర్గతం చేయలేమని వర్శిటీ పాలకులు చెబుతున్నారు. రోహిత్ సమర్పించిన సర్ట్ఫికెట్లలో వాస్తవాలు తేల్చాల్సింది తాము కాదని, సంబంధిత రెవిన్యూ అధికారులే ఆ వ్యవహారం చూడాలని వర్శిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

నిరసనలు... ధర్నాలు

బేగంపేటలో రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎబివిపి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇల్లు ముట్టడి
ఒకటవ తేదీలోగా నివేదిక ఇవ్వాలంటూ హెచ్‌ఆర్సీ ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో యూనివర్శిటీ అట్టుడుకుతోంది. బహిష్కృత విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ, విద్యార్థి రోహిత్‌కు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాల జెఎసి ఆందోళనకు దిగింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ విసి అప్పారావులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి జెఎసి డిమాండ్ చేసింది. విద్యార్థి రోహిత్ కుటుంబానికి 50లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని విద్యార్థి సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. యూనివర్శిటీలో ఆవరణలోనే విద్యార్థి రోహిత్ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి విద్యార్థి సంఘాలు నివాళులర్పించారు. పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సెంట్రల్ యూనివర్శిటీని సందర్శించేందుకు వస్తుండగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయన కాన్వాయ్‌ను ఎబివిపి కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీ భద్రత మధ్య యూనివర్సిటీకి చేరుకున్న రాహుల్ గాంధీ విద్యార్థి రోహిత్ తల్లి రాధికతో ఇరవై నిముషాలు మాట్లాడారు. అదేవిధంగా రోహిత్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థుల ఆందోళనకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇదిలావుండగా రాంనగర్‌లోని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రే ఇంటిని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించారు. విద్యార్థి రోహిత్ మృతికి కారకుడైన మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు జాగృతి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విసి అప్పారావుతోపాటు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలని హెచ్‌ఆర్‌సికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి హెచ్‌ఆర్సీ ఫిబ్రవరి ఒకటో తేదీలోగా విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వాలంటూ సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావులను ఆదేశించింది.

దత్తాత్రేయకు సంబంధం లేదు
రోహిత్ ఆత్మహత్య ఘటనపై
బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 19: సెంట్రల్ వర్సిటీ రోహిత్ ఆత్మహత్య వ్యవహారంతో తమ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఏమాత్రం సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య వ్యవహారాన్ని టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అందుకే ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పిలిపించారని ఆయన తెలిపారు. వరంగల్ మాజీ ఎంపి రాజయ్య కోడలు తన ఇద్దరు కుమారులతో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాహుల్ ఎందుకు వెళ్ళలేదని ఆయన ప్రశ్నించారు. రోహిత్ వ్యవహారంలో ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోవచ్చని అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖకు సంబంధం లేదని ఆయన తెలిపారు. విద్యార్థులను వర్సిటీ వైస్-్ఛన్సలర్ సస్పెండ్ చేయడం ఆ వర్సిటీ ఆంతరంగిక విషయమని కిషన్‌రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరి ప్రమేయం లేదని అన్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కాదని రోహిత్ స్వయంగా లేఖ రాసి పెట్టినా, మిగతా పార్టీలు తమను అపఖ్యాతి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. యాకుబ్ మెనన్ ఉరిశిక్షతో వర్సిటీలో కొంత మంది విద్యార్థులు ఆందోళనకు దిగారని, ఇదే సమయంలో ఎబివిపికి చెందిన విద్యార్థులపై వారు దాడి చేసి గాయపరిచారని ఆయన తెలిపారు.