తెలంగాణ

విద్యార్థులు జల సమాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 17: వారాంతపు సరదా కోసం షికారుకెళ్లిన విద్యార్థులు జలసమాధి అయ్యారు. కళకళలాడుతున్న మంచినీటి కాసారం దగ్గర హ్యాపీగా గడపడానికి వెళ్లిన విద్యార్థులను ఆ నీరే కబళించివేసింది. నిండా ఇరవై ఏళ్లయినా నిండని యువత చూస్తుండగానే మృత్యు ముఖంలోకి వెళ్లిపోయింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ దగ్గరికి శనివారం సరదాగా వెళ్లిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో అయిదుగురు రిజర్వాయర్‌లో మునిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఒక విద్యార్థిని రమ్య(20)మాత్రం నీళ్లంటే భయం అని దూరంగా ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. మృతి చెందిన వారిలో ఇద్దరు అక్కాతమ్ముళ్లు ఉండటం మరింత విషాదంగా మారింది. ఈ ఆరుగురు కూడా వరంగల్‌లోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నారు. మృతి చెందిన వారిని పొలినేని వినూత్న(20), పొలినేని శివసాయిరెడ్డి(19), పత్తి శ్రేయారెడ్డి(20), ఉత్పల శ్రీనిధి(20), కర్ని శివసాయి(20)గా గుర్తించారు. వీరిలో వినూత్న, శివసాయిరెడ్డి అక్కాతమ్ముళ్లు. స్థానికుల కథనం ప్రకారం వీకెండ్ కావటంతో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి మోటార్‌బైక్‌లపై సరదాగా గడిపేందుకు కాజీపేటకు పది కిలోమీటర్ల దూరంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు వెళ్లారు. రిజర్వాయర్ కట్ట చివరన ఒక చిన్న గుట్ట ఉంది. దాని పక్కనే పెద్ద బండరాయి ఒకటి ఉంది. కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో ఈ బండరాయి నీటి రాపిడికి బాగా తడిసి పోయి, నాచు పట్టింది. ఈ విద్యార్థులంతా ఈ బండరాయి దగ్గరకు చేరుకున్నారు. బండరాయి జారుడుగా ఉన్నప్పటికీ దానిపై ఎక్కి కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య అనే అమ్మాయి మాత్రం నీళ్లంటే భయం అని చెప్పి దూరంగా ఉంది. బండరాయి దగ్గర నీటి లోతు తక్కువగా ఉందని విద్యార్థులు భావించి ఉంటారు. కానీ అక్కడ తాటి చెట్టు ఎత్తు కంటే ఎక్కువ లోతు ఉందని అధికారులు తెలిపారు. సరదాగా ముచ్చట్లాడుకుంటున్న సమయంలోనే ఒక విద్యార్థిని అమాంతంగా జారి రిజార్వాయర్‌లోకి పడిపోయింది. ఆమెను రక్షించటానికి ఒకరినొకరు పట్టుకోగా అంతా కలిసి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. కిందనున్న రమ్య ఒక్కసారిగా కేకలు వేయటంతో స్థానికులు వచ్చారు. ఆ తరువాత గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ముందుగా నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. శ్రీనిధి అనే విద్యార్థి మృతదేహం కోసం చాలా గాలించాల్సి వచ్చింది. చివరకు ఒకచోట చిక్కుకుని ఉన్న అతని మృతదేహాన్ని బయటకు తీశారు. చనిపోయిన విద్యార్థుల్లో అక్కాతమ్ముళ్లయిన వినూత్న, శివసాయిలది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన వాళ్లు. మిగతా ముగ్గురు హన్మకొండ వాసులు. విద్యార్థుల మృతితో ఘటనాస్థలం దగ్గర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతా ఒకే వయసు వాళ్లు కావటం.. చేతికి ఎదిగొచ్చే సమయంలో చనిపోవటంతో తల్లిదండ్రుల బాధకు అంతులేకుండా పోయింది. కాజీపేట ఏసిపి జనార్ధన్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఘటనాస్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
నెల రోజుల్లో నాలుగో ఘటన
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో శనివారం జరిగిన దుర్ఘటన నెలరోజుల్లో నాలుగోది కావటం గమనార్హం. ఇంతకు ముందు జరిగిన మూడు ఘటనల్లో అయిదుగురు విద్యార్థులు చనిపోయారు. వీరంతా ఇంజనీరింగ్ విద్యార్థులే కావటం దురదృష్టం. అయినా పోలీసులు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎలాంటి రక్షణాత్మక చర్యలు తీసుకోలేదు. రిజర్వాయర్ దగ్గర స్థానిక పోలీసులతో పాటు ఎనిమిది మంది తమ సిబ్బంది గస్తీ తిరుగుతారని గతంలో కార్పొరేషన్ పలుమార్లు ప్రకటించింది. కట్ట చివరి వరకు ఎవరినీ వెళ్లనివ్వకుండా ఫెన్సింగ్ వేస్తామని కూడా ప్రకటించారు. కానీ ఈ చర్యలేవీ అధికారులు చేపట్టలేదు. విద్యార్థులను నీటి దగ్గరకు వెళ్లకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు లేవు. ఫలితం నాలుగు కుటుంబాల్లో కోలుకోలేని విషాదం.

చిత్రం... ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు