తెలంగాణ

తెరాస కారులో తెదేపా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు తెదేపాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కుత్బుల్లాపూర్ తెదేపా ఎమ్మెల్యే వివేకానందగౌడ్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. తెదేపా కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో మంగళవారం తెరాస తీర్థం తీసుకున్నారు. ఎమ్మెల్యేకు గులాబీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఇదేదారిలో మరికొందరు ఎమ్మెల్యేలు తెదేపాకు రాజీనామా చేసి తెరాసలో చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గతంలో క్యాంపు కార్యాలయానికి వెళ్లి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి తరువాత మనసు మార్చుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కుద్భుల్లాపూర్ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లోనూ తెరాస విజయకేతనం ఎగురవేయడం, ఒక్క డివిజన్‌లోనూ గెలవని తెదేపా సీట్లలోనూ తెరాసకన్నా బాగా వెనకబడి పోవడంతో ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఆలోచనలోపడ్డారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లంతా తెదేపా వైపే ఉన్నారనే ఆలోచనతో తెదేపాలో ఉండిపోయారు. గ్రేటర్ ఫలితాల తరువాత వెంటనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. గతంలోనే తెరాసలో చేరిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి వివేకానందగౌడ్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, పార్టీలో చేరారు. అనంతరం వివేకానందగౌడ్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెరాస పార్టీలో చేరినట్టు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు కెసిఆర్‌ను విశ్వసించారని, కెసిఆర్ నాయకత్వంలోనే నగరాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విశ్వసించారని తెలిపారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగానే తెరాసలో చేరినట్టు ప్రకటించారు. చంద్రబాబు విజయవాడ వెళ్లిన తరువాత తెలంగాణలో తెదేపాకు చాలా లోటు కనిపిస్తోందన్నారు. తాను సొంతింటికి వచ్చినట్టేనని, గతంలో తెరాసలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం సాగించానని వివేక్ తెలిపారు. సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో తెదేపా తరఫున 15మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఏడుగురు తెరాసలో చేరారు. ఆర్ కృష్ణయ్య పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన ఏడుగురిలో ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉంది. తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తన దారిలో తాను వెళ్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఎవరిదారి వారిదే.
మొదటి నుంచి పార్టీలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి ఇతర ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించడం లేదు. పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేసినవారు, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వారు సైతం ఒక్కోక్కరు తెదేపాను వీడి తెరాసలో చేరుతున్నారు.
రాష్ట్ర విభజనతో తెలంగాణలో తెదేపా పూర్తిగా బలహీనపడింది. చివరకు చంద్రబాబు సైతం విజయవాడకు మకాం మార్చడంతో పార్టీ కనీసం హైదరాబాద్‌లోనూ మిగలని పరిస్థితి ఏర్పడిందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నేతలు పోతున్నారు కానీ క్యాడర్ పార్టీలోనే మిగిలి ఉందంటూ రొటీన్‌గా చెబుతున్నా, మిగిలి ఉన్న పార్టీ నేతలకు పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ వీడినప్పుడల్లా స్వార్థం కోసం నాయకులు పార్టీ వీడినా క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదంటూ మిగిలిన నాయకులు చెబుతూ ఉండేవారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరువాత క్యాడర్ చెక్కు చెదరలేదని చెప్పడం మాకే ఇబ్బందిగా ఉందని నేతలు వాపోతున్నారు. తెలంగాణపై చంద్రబాబు సైతం చేతులు ఎత్తేసినట్టుగానే కనిపిస్తోందని, పరిస్థితిని బట్టి మిగిలివున్న కొద్దిమంది నేతలు సైతం తమ భవిష్యత్‌ను చూసుకుంటారని తెదేపా నుంచే వినిపిస్తోంది.