తెలంగాణ

భారీ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఏ చిన్న సంఘటనకూ తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు అయ్యంది. దాదాపు 82 శాతం పోలింగ్ నమోదు కావడంతో, పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలమన్న లెక్కల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయ. పరిస్థితిని చూస్తే, అధికార తెరాస దూకుడు కనిపించిందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగానికి మహిళలు పెద్దఎత్తున తరలి రావడంతో, పల్లెల్లో పండుగను మించిన హడావుడి కనిపించింది.

ఓటు హక్కు వినియోగానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన మహిళలు

గతంకంటే పెరిగిన పోలింగ్ శాతం
ఓటు హక్కు వినియోగం కోసం అంతా ఆసక్తి
ఉదయమే ఓట్లు వేసిన ముగ్గురు ప్రధాన అభ్యర్థులు
తరలివచ్చిన వలస ఓటర్లు
గ్రామాల్లో కనిపించిన పండుగ వాతావరణం

సంగారెడ్డి: పంతాలు, పట్టింపులు, ముఠా తగాదాలతో కొనసాగే నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఎక్కడ ఏ ఒక్క చిన్న సంఘటనకు తావులేకుండా ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఖేడ్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన కిష్టారెడ్డి గత యేడాది ఆగస్టు నెల చివరి వారంలో మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. జనవరి 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా 27వ తేదీతో పూర్తయింది. 30వ తేదీతో ఉప సంహరణ ముగిసిన అనంతరం మూడు ప్రధాన పార్టీలకు చెందిన చిన్నాచితక మొదలుకుని రాష్ట్ర స్థాయి నాయకులంతా నారాయణఖేడ్‌కు వచ్చి విస్తృత ప్రచారం నిర్వహించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ మరింత దూకుడును ప్రదర్శించి బలహీనంగా ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ బలాన్ని పెంచడంలో నాయకులంతా గ్రామాల్లో తిష్ట వేసి గడచిన పాలనపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా అలజడి లేకుండా ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ, వెబ్‌కాస్టింగ్, సిసి కెమెరాలు, వీడియో చిత్రీకరణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగింపజేయడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఉదయం నుంచి పోలింగ్ సరళిని పరిశీలించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, బాలింతలు సైతం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. నడవలేని వారిని కుటుంబ సభ్యులు, పోలీసుల సహాయంతో పోలింగ్ కేంద్రాలకు తరలింపజేసారు. కలెక్టర్ రాస్ తార్కాన్‌పల్లి, మన్సూర్‌పూర్, చాంద్‌ఖాన్‌పల్లి, కొండాపూర్, తుర్కపల్లి, ర్యాకల్, సల్లగిద్ద తండా, సిర్గాపూర్, బాచెపల్లి, నిజాంపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. టిఆర్‌ఎస్, టిడిపి పార్టీలకు చెందిన అభ్యర్థులు భూపాల్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డిలు స్వగ్రామమైన కల్హేర్ మండలం ఖానాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.సంజీవరెడ్డి నారాయణఖేడ్‌లోని మంగల్‌పేట 175వ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కల్హేర్ మండలంలో తప్పుడు ఓటరు జాబితా ఇచ్చారని టిడిపి శ్రేణులు కలెక్టర్‌కు పిర్యాదు చేసారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు ఏర్పాటు చేసారు. మంచినీటి సౌకర్యం, మజ్జిగ, వైద్య సదుపాయం కల్పించి ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలూ చేపట్టారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఏ పార్టీ నాయకులనూ రానివ్వకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కల్హేర్ మండలం బిబిపేటలో ఓటరు జాబితా నుంచి తమ పేర్లను తొలగించారంటూ 20 మంది ఆందోళన చేపట్టారు. నారాయణఖేడ్ మండలం బండ్రేవునిపల్లిలో ఓటర్ల జాబితాలో పేర్లు లేవని 50 మంది ఆందోళన చేపట్టారు. ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 30 వేల మంది ఓటర్లు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వలసలు వెళ్లగా వారిని రప్పించడంలో మూడు పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేసాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ వలస ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వారిని రప్పించడానికి ట్రావెల్స్ బస్సులు, ట్రక్కులను ఉపయోగించుకోగా గ్రామాల్లో అవే వాహనాలు కనిపించాయి. స్వచ్ఛందంగా తరలివచ్చే వారి కోసం హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపించారు. బిహెచ్‌ఇఎల్ డిపోకు చెందిన సిటి సర్వీసు బస్సులు మారుమూల గ్రామాల్లో తిరగడం విశేషం. ఉదయం 9 గంటల వరకు నియోజకవర్గంలో 11.2 శాతం పోలింగ్ నమోదైంది. ఎండ తీవ్రత, వ్యవసాయ పనుల నిమిత్తం ఓటర్లంతా ఉదయమే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం 11 గంటలకు 26 శాతం పోలింగ్ నమోదుకాగా 11.40 గంటలకు 39.78 శాతం పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు 73.47 శాతం నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. వలసలు, పండరీపూర్ జాతర ప్రభావంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు అనుమానించినా ఓటర్లు మాత్రం చైతన్యాన్ని ప్రదర్శించి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పుట్టిన ఊరిని వదిలి బతుకుదెరువు నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఉప ఎన్నిక పుణ్యమా అని స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామా ల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఆయా పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా అన్న అనుమానాలను ఖేడ్ ఓటర్లు పటాపంచలు చేసి శాంతియుతంగా ముగింపజేసారు.

ఎగ్జిట్ పోల్
నారాయణఖేడ్ ఉప ఎన్నికపై
‘ఆరా’ సంస్థ నిర్వహించిన
ఎగ్జిట్ పోల్ వివరాలు ఇలా ఉన్నాయి..
టిఆర్‌ఎస్: 68.86 శాతం
కాంగ్రెస్: 18.98 శాతం
టిడిపి: 8.36 శాతం
ఇతరులు: 2 శాతం

ఎన్నికల విథి నిర్వహణలో
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి

నారాయణఖేడ్, ఫిబ్రవరి 13: మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. పటన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హీరాసింగ్ (45) ఉప ఎన్నిక నిమిత్తం మూడు రోజుల క్రితం నారాయణఖేడ్‌కు వచ్చారు. ఆయనకు మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో విధులు నిర్వహించడానికి బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ సిబ్బందితోపాటు హీరాసింగ్ శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా బిపి పెరిగి కింద పడిపోయిన హీరాసింగ్‌ను అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారని పటన్‌చెరు సిఐ లింగేశ్వర్ వెల్లడించారు. మృతుడు హీరాసింగ్ స్వగ్రామం పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
హెడ్‌కానిస్టేబుల్ మృతి పట్ల పోలీసు అధికారులు, తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన హీరాసింగ్ మంచి పోలీసుగా పేరు సంపాదించుకున్నారు.

ఖేడ్‌లో భారీ
మెజారిటీ ఖాయం
అధికార పక్షం అంచనా భారీ పోలింగ్‌పై సంతోషం

హైదరాబాద్, ఫిబ్రవరి 13:నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తుందని టిఆర్‌ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల తరహాలోనే నారాయణఖేడ్‌లో కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని చెబుతున్నారు. శనివారం జరిగిన ఉప ఎన్నికలో 82 శాతం పోలింగ్ నమోదవడం మేలుచేస్తుందని వారు భావిస్తున్నారు. వరంగల్, నారాయణఖేడ్ ఎన్నికలపై సర్వే జరిపితే వరంగల్‌లో 62శాతం మంది, నారాయణఖేడ్‌లో 54 శాతం మంది టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారని, వరంగల్ ఎన్నికలకు ముందు తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కెసిఆర్ వెల్లడించారు. వరంగల్ ఎన్నికలకు దాదాపు మూడు వారాల ముందే ఈ విషయం తెలిపారు. అయితే వరంగల్‌లో ఊహించిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ లభించింది. అప్పటి అంచనా మేరకు నారాయణఖేడ్‌లో సాధారణ మెజారిటీతో విజయం సాధిస్తామని అంచనా వేసినా, మారిన పరిస్థితులతో వరంగల్ తరహాలోనే భారీ మెజారిటీ సాధించనున్నట్టు టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నెలరోజుల ముందుగానే కెటిఆర్ అధికారిక కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తే,ఖేడ్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విస్తృతంగా పర్యటించారు. నియోజక వర్గంలోని సమస్యలపై అవగాహన పెంచుకోవడంతో పాటు విజయానికి అవసరం అయిన వ్యూహాన్ని రూపొందించారు. ఆస్పత్రి మంజూరు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం ప్రారంభంవంటి చర్యలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
ఓటర్ల చైతన్యం అదుర్స్ : హరీశ్
నారాయణఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో 82శాతం ఓటింగ్ నమోదవడంపట్ల హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో పెద్దఎత్తున ఓటింగ్‌కు తరలి వచ్చారని అన్నారు. నారాయణఖేడ్‌లో ప్రజల తీర్పును టిఆర్‌ఎస్ శిరసావహిస్తుందని, మిగిలిన రాజకీయ పక్షాలు సైతం అదే స్ఫూర్తితో ఉండాలని కోరారు. నియోజక వర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. నారాయణఖేడ్‌లో గతంలో ఎప్పుడూ లేనంత చైతన్యంతో ప్రజలు ఓట్లు వేశారంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.