ఆంధ్రప్రదేశ్‌

పాత నోటు.. డ్వాక్రా రూటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: నల్లకుబేరులు ‘తెల్ల’ మార్గం పడుతున్నారు. అది కూడా దర్జాగా. మహిళా పొదుపు సంఘాల పేరుతో పెద్దనోట్లను చెలామణి చేసేందుకు తెరలేపారు.ప్రభుత్వం మహిళల జోలికి పోదన్నదే వారి ధీమాకు కారణం. తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను డ్వాక్రా బృందాలకు ఇచ్చి వారి లోన్లు తామే కట్టేస్తున్నారు. కొత్తగా డిపాజిట్లూ కట్టించి తర్వాత వాటిని విత్‌డ్రా చేసుకుని దర్జాగా వైట్ చేసుకుంటారు. ఇందుకు సారధులు, వారధులు స్థానికంగా ఉన్న చోటా మోటా రాజకీయ నేతలు. డిసెంబర్ 31లోగా ఉన్న గడువును వినియోగించుకుని అనుకున్న లక్ష్యం సాధించే సన్నాహాల్లో ఉన్నారు. దీనివల్ల నల్లకుబేరులకు పోయేదేమీ లేదు. డ్వాక్రా, రాజకీయ నేతలకు ఇచ్చే కమిషన్లు తప్ప! ముగ్గురూ లబ్ధిపొందే ఈ అధికార ఆర్ధిక లావాదేవీ నిఘా వర్గాల దృష్టికీ వచ్చింది.
పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు విలవిల్లాడతారని మోదీ ప్రకటన తొలిరోజు అందరూ భావించారు. దానికితోడు అప్పుడే కొంతమంది తమ వద్ద ఉన్న పాత నోట్లు తగులబెట్టడంతో ఇక బ్లాక్‌మనీ ఉన్న వారి పని అయిపోయిందనుకున్నారు. కానీ, అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు సర్కారు కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన నల్లకుబేరులు దొడ్డిదారి మార్గాల్లో తమ వద్ద ఉన్న పెద్దనోట్లను మహిళా పొదుపు సంఘాల ద్వారా చెలామణి చేయించి, తెల్లధనంగా మార్చుకునే ఎత్తుగడకు తెరలేపారు. నవ్యాంధ్రలో తాజాగా అమలవుతున్న ఈ ఎత్తుగడ వింటే ఎవరికైనా మతిపోవలసిందే.
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 8,87,543 డ్వాక్రా మహిళా పొదుపు సంఘాలుండగా, అందులో 89,60,207 మంది సభ్యులున్నారు. ఒక్కో సంఘంలో పదిమంది సభ్యులుంటారు. బ్యాంకులు ఒక్కొక్కరికి 30 వేల వరకూ రుణాలిస్తుంటాయి. చాలాకాలం నుంచి కొనసాగుతున్న పెద్ద సంఘాలకయితే 10 లక్షల వరకూ రుణాలిస్తుంటాయి. ఈ సంఘాలు ప్రతినెల ఒక్కో తేదీన రుణాలు చెల్లిస్తుంటాయి. మిగిలిన ఖాతాదారుల కంటే డ్వాక్రా సంఘాల మహిళా నేతలకు బ్యాంకు అధికారులతో సన్నిహిత పరిచయాలుంటాయి. సహజంగా తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాలన్నీ రాజకీయ పార్టీల అధీనంలో ఉంటాయి. స్థానిక నేతల కింద డజన్లు, వందల సంఖ్యలో డ్వాక్రా సంఘాలుంటాయి. వారంతా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తుంటారు. అందుకే ఏ ప్రభుత్వాలు వచ్చినా మహిళా పొదుపు సంఘాలు, వారి అకౌంట్ల జోలికి వెళ్లవు. ఇప్పుడు నల్లకుబేరులకు ఇదే వరప్రసాదంగా మారింది.
అధికార, ప్రతిపక్ష పార్టీల సభలకు జనం కావాలంటే వారికి ముందుగా గుర్తుకొచ్చేది డ్వాక్రా సంఘాలే. ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, అధికారులు సీఎం, మంత్రుల సభలకు ఎక్కువగా వీరిని తరలిస్తుంటారు. ఆ రకంగా రాజకీయ నేతల కనుసైగల్లో మెజారిటీ డ్వాక్రా సంఘాలు నడుస్తుంటాయన్నది బహిరంగ రహస్యం. వీరిలో డ్వాక్రా లీడర్ పాత్ర ప్రముఖం. స్థానికంగా ఆమె చెప్పినది శిలాశాసనం. స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుల స్థాయిలో ఆ లీడర్ల పలుకుబడి ఉంటుంది.
ఇప్పుడు ఇదే పెద్దనోట్లు ఉన్న నల్లకుబేరుల పాలిట కల్పతరువుగా మారాయి. స్థానిక నేతల సహకారంతో డ్వాక్రా నేతల ద్వారా 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకులలో చెల్లింపుల ద్వారా చెలామణి చేయించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. నిఘా వర్గాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ప్రతి ఒక్కరు నెలకు 1000 నుంచి 1500, 2000 రూపాయల వరకూ బ్యాంకులకు రుణం చెల్లిస్తుంటారు. ఆ రుణాలను పెద్దనోట్లు ఉన్న నల్లకుబేరులు తామే చెల్లించేలా స్థానిక నేతల ద్వారా ఒప్పందాలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతలతోపాటు, డ్వాక్రా లీడర్లకూ కమిషన్లు ఇచ్చే ప్రాతిపదికన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. వీరి ద్వారానే బ్యాంకులో డిపాజిట్లు కూడా చేయించి, తర్వాత వాటిని ఉపసంహరించుకునే ఎత్తుగడకు తెరలేపినట్లు తెలుస్తోంది. పెద్దనోట్లు మార్చుకునేందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉండటంతో మూకుమ్మడిగా డ్వాక్రా సంఘాలపై వలవేసినట్లు స్పష్టమవుతోంది. ముందు తాము డ్వాక్రా సంఘాలకు లోన్లు చెల్లించి, లీడర్ల కమిషన్లు పోగా మిగిలిన డబ్బులు తర్వాత తిరిగి తీసుకునేలా ఒప్పందం చేసుకునే సరికొత్త ఆర్ధిక లావాదేవీలకు తెరలేచినట్లు సమాచారం.
విజయవాడ, గుంటూరు, విశాఖ, కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, నెల్లూరు, ఒంగోలు, నూజివీడు, విజయనగరం, అద్దంకి, మార్టూరు, నర్సరావుపేట, చిలకలూరిపేట, తెనాలి, భీమవరం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం వంటి పట్టణాల్లో ఈ తరహా వ్యాపారం కోసం నల్లకుబేరుల ప్రతినిధి బృందాలు రాజకీయ పార్టీ నేతలు, డ్వాక్రా లీడర్లతో డీల్ కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

మార్తి సుబ్రహ్మణ్యం