తెలంగాణ

మేడారం గద్దెనెక్కిన కనె్నపల్లి వెనె్నలమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి 9:59కు
గద్దెనెక్కిన సారలమ్మ

దారి పొడవునా వరంపట్టిన భక్తులు
పెద్దఎత్తున కొనసాగుతున్న మొక్కులు
మూడంచెలుగా పోలీసుల భారీ బందోబస్తు
అపురూప ఘట్టంగా నేడు గద్దె చేరనున్న సమ్మక్క

మేడారం: కోట్లాది భక్తులు ఎదురుచూసే అపురూప క్షణాలు బుధవారం సాక్షాత్కరించాయి. గిరిజన సంప్రదాయబద్ధంగా డోలు, కొమ్ముబూరలతో.. ప్రణమిల్లిన భక్తజనాన్ని దాటుకుంటూ సారలమ్మ తల్లి మేడారం పయనమైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎంపీ సీతారాంనాయక్, ఐటిడిఏ పిఓ అమయ్‌కుమార్, జెసి ప్రశాంత్ జీవన్‌పాటిల్, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్యలు సారలమ్మ తల్లికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారం గద్దెలపైకి తోడ్కొనివెళ్లారు. ప్రధాన పూజారి కాక సారయ్య తల్లి సారలమ్మను తీసుకొని రాగా, పూజారి సోలం వెంకటేశ్వర్లు అంజన్న జెండాను చేతబూని మేడారం బయలుదేరారు. కనె్నపల్లి నుంచి మేడారం వరకూ అడుగడుగునా భక్తజనాలు తల్లికి నీరాజనాలు పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకగా సారలమ్మ తల్లిని తీసుకొని ప్రత్యేక పూజారులు కనె్నపల్లి ఆలయం నుంచి సాయంత్రం 6:45 గంటలకు మేడారం బయల్దేరారు. సమ్మక్క తల్లీ దండాలో.. సారక్క తల్లే దండాలో... అంటూ లక్షలాది భక్తజనం చేసిన నామస్మరణతో బుధవారం కనె్నపల్లి నుండి మేడారం వరకు జాతర ప్రాంగణమంతా మార్మోగింది. కనె్నపల్లిలో కొలువున్న సారలమ్మ బుధవారం మేడారం గద్దెకు చేరడంతో నాలుగు రోజులపాటు జరగనున్న మహాఘట్టానికి తెరలేచింది. సారలమ్మ దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భక్తజనం సారలమ్మ గద్దెపైకి చేరగానే భక్త్భివంతో ఊగిపోయారు. కనె్నపల్లి ఆలయం నుండి బయలుదేరిన సారలమ్మ తల్లి జంపన్నవాగులో నుండి మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంది. కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు కూడా మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 9.59 గంటలకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి చేర్చారు. హనుమాన్ జెండా నీడన సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు ఇతర పూజారులు సారలమ్మను గద్దెపైకి చేర్చారు.
కనె్నపల్లిలో ప్రత్యేక పూజలు
సారలమ్మ గద్దెపైకి చేరనున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కనె్నపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నాం నుండి పూజలు మరింత జోరందుకున్నాయి. ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం కనె్నపల్లి నుండి బైలెల్లిన సారలమ్మ భారీ పోలీసు బందోబస్తు నడుమ మేడారం గద్దెపైకి చేరింది. కనె్నపల్లి ఆలయంలో సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో అనేకమంది భక్తులు సారలమ్మ గుడికి తరలివచ్చారు. తమ ఊరి ఆడపడుచును తల్లి ఒడికి చేర్చేందుకు కనె్నపల్లి గ్రామస్తులందరూ సారలమ్మ గుడికి చేరుకున్నారు.
తమ్ముడిని పలకరిస్తూ...
మేడారంలోని గద్దెపై కొలువుతీరడానికి కనె్నపల్లి నుండి బయలుదేరిన సారలమ్మకు దారి పొడవునా జాతరకు విచ్చేసిన భక్తులు దండాలు పెడుతూ భక్త్భివంతో ఉప్పొంగిపోయారు. కనె్నపల్లి నుండి మేడారం బైలెల్లిన సారలమ్మ దారిలో తన తమ్ముడు జంపన్న వద్ద కొంత సమయం ఆగింది. సంపెంగ (జంపన్న) వాగులో కొలువైన తమ్ముడు జంపన్న క్షేమ సమాచారాలు తెలుసుకుని అక్కడ నుండి మేడారం చేరుకొని తల్లి ఒడికి చేరింది. సారలమ్మ తన తమ్ముడు జంపన్నను పలకరిస్తుండగా జంపన్నవాగులో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. కనె్నపల్లి నుండి మేడారం గద్దెలపైకి చేరడానికి సారలమ్మ వెళ్తుండగా వేలాది భక్తులు రోడ్డుపైకి రావడంతో కనె్నపల్లి, మేడారం పరిసరాలు కిటకిటలాడాయి.
పోలీసుల భారీ బందోబస్తు
సాయంత్రం 6.45 గంటలకు కనె్నపల్లి నుండి బయల్దేరిన సారలమ్మకు అడుగడుగునా పోలీసులు దుర్భేద్యమైన రక్షణకవచంగా నిలిచారు. పూజలు జరుగుతున్న సమయంలోనే సారలమ్మ ఆలయంలో రోప్‌పార్టీ బృందాన్ని ఏర్పాటు చేశారు. అటునుండి అమ్మవారిని ఎన్నడూలేని విధంగా మూడంచెల బందోబస్తుతో రోప్ పార్టీ మేడారానికి అమ్మవారిని తీసుకవచ్చింది. పర్యవేక్షించిన వారిలో జెసి ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ఏఎస్పీ విశ్వజిత్‌కంపాటి తదితరులు పాల్గొన్నారు.
వరం పట్టిన మహిళలు
సంతానం లేని పలువురు మహిళలు కనె్నపల్లి గుడి వద్ద బుధవారం వరంపట్టారు. మొదట జంపన్న వాగులో స్నానాలు చేసి తడి బట్టలతో సారలమ్మ గుడికి చేరుకుని గుడి ముందు పొర్లు దండాలు పెట్టారు. అమ్మవారి ప్రతిరూపమైన పసుపు -కుంకుమలను మొంటె (వెదురుబుట్ట)లో పెట్టుకుని సారలమ్మను గద్దెపైకి చేర్చే క్రమంలో పూజారులు వీరిపైనుండి దాటి వెళ్లారు.
నేడు గద్దెపైకి సమ్మక్క రాక
అశేష భక్తజనావళి ఎదురుచూసే అపురూప క్షణాలు మరికొన్ని గంటల్లో సమీపించనున్నాయి. సారలమ్మ రాకను చూసి తరించిన భక్తజనం, సమ్మక్క తల్లి రాకకోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. నిండు పౌర్ణమి సాయంసంధ్య వేళలో ఆకాశం సైతం మేడారం వైపు చూస్తుండగా సమ్మక్క తల్లి గద్దెను ప్రతిష్ఠించే అపురూప ఘట్టానికి నేడు తెరపడనుంది.

చిత్రం... సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠిస్తున్న పూజారులు, లక్షలాది భక్తులు తరలి రావడంతో జన సంద్రమైన గద్దె ప్రాంతం