తెలంగాణ

ఇక డిజిటల్ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి గత నాలుగు నెలలుగా సిద్ధం చేసిన డిజిటల్ క్లాసు రూమ్‌ల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. మొదటి దశలో 1500 పాఠశాలల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అనూహ్యంగా 3352 పాఠశాలల్లో టిఎస్ క్లాసు పేరిట డిజిటల్ క్లాసురూమ్‌లను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు లాంఛనంగా ప్రారంభించారు. డిజిటల్ క్లాసులను ఇంటింటికీ చేరువచేసే ‘మన టివి’ స్టుడియోలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో 5400 ఉన్నత పాఠశాలలు ఉండగా, 3352 స్కూళ్లలో ఒకేరోజు డిజిటల్ క్లాసులు ప్రారంభించడం విశేషమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. మానవ వనరులు అభివృద్ధి చెందినపుడే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కెజి టు పీజీ ఉచిత విద్య అందించడమే కాకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలన్న సిఎం ఆకాంక్షమేరకు టిఎస్ క్లాసులు పనిచేస్తాయన్నారు. ప్రపంచంలో ఎవరికీ తీసిపోని విధంగా తెలంగాణ విద్యావిధానం, విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. డిజిటల్ క్లాసులు టీచర్లను తొలగించేందుకు కాదని, వారి బోధనను మరింత మెరుగుపర్చేందుకే అన్నారు. 2017 నాటికి అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసులు మొదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సామాన్యులు, పేదలకు ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలమని సిఎం కెసిఆర్ పదేపదే చెబుతుంటారని ఐటి మంత్రి కె తారక రామారావు అన్నారు. సిఎం ఆలోచన మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేది డిజిటల్ క్లాసురూమ్‌లేనని అన్నారు. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ నల్లాతోపాటు ఇంటర్నెట్ ఇస్తున్నామన్నారు. వచ్చే 18నుండి 24 నెలల్లో కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు డిజిటల్ లిటరసీని ప్రజలకు అందిస్తామన్నారు. ఇంటికొక డిజిటల్ లిటరేట్ తయారు కావడంవల్ల తెలంగాణలో కోటిమంది డిజిటల్ లిటరేట్లు తయారవుతున్నారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ క్లాసు రూమ్‌లను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్న విద్యాశాఖ ఇతర శాఖలకు ఆదర్శమన్నారు.
డిజిటల్ టెక్నాలజీతో బోధన ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైందని, దీని ద్వారా విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బోధన చేసే వెబ్‌సైట్లు కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. గ్రూప్-2 ద్వారా ఇప్పటికే ఐదున్నర లక్షల మందికి 250 గంటలపాటు మన టీవీలో పాఠాలు ప్రసారం చేశారని తెలిపారు. కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేసేందుకు సహకరిస్తున్న ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు.
పాఠాలు చెప్పిన కడియం
మన టీవీలో డిజిటల్ క్లాసు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. అక్కడి విద్యార్ధులతో పాఠాలు చెబుతున్న విధానం గురించి, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం తాను టీచర్‌గా మారి విద్యార్ధులకు పాఠాలు చెప్పారు. డిజిటల్ క్లాసు ద్వారా తొలి రోజు బోధించిన జీర్ణకోశం, దంత వ్యవస్థ పాఠాలు ఎంత వరకూ అర్ధమయ్యాయో విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్ధనరెడ్డి, ఐటి కార్యదర్శి జయేష్ రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జి. కిషన్, సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, మన టీవీ సిఇవో శైలేష్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

చిత్రం... బంజారాహిల్స్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాల గురించి పిల్లల్ని అడిగి తెలుసుకుంటున్న
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి