తెలంగాణ

నేడు గద్దెపైకి సమ్మక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం: అశేష భక్తజనావళి ఎదురుచూసే అపురూప క్షణాలు మరికొన్ని గంటల్లో సమీపించనున్నాయి. కోటిమంది భక్తులు విడిది చేసి తమ ఇష్టదైవాలైన సమ్మక్క- సారలమ్మ తల్లుల రాకకోసం ఎదురుచూస్తుండగా సారలమ్మ గద్దెనెక్కిన వేళ.. సమ్మక్క తల్లి రాకకోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూసే ఉద్విగ్న క్షణాలు గురువారం ఫలించనున్నాయి. నిండు పౌర్ణమి సాయం సంధ్యవేళలో ఆకాశం సైతం మేడారం వైపు చూస్తుండగా సమ్మక్క తల్లి గద్దెను ప్రతిష్ఠించే అపురూప ఘట్టానికి నేడు తెరపడనుంది. సమ్మక్క ఆలయంలో అడెరాలు (పూజాసామాగ్రి) సిద్ధం చేసిన పూజారులు వనదేవతలను చిలకలగుట్ట నుంచి మేడారంలోని సమ్మక్క ఆలయానికి తీసుకొనివస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక పూజల అనంతరం ఎదురుకోళ్లు ఇచ్చి అమ్మవారికి జంపన్నవాగు నీటిని ఆరబోసి ముత్యదువులతో (అభిషేకం) చేసి పాముపుట్టకు వెళ్లి పూజా కార్యక్రమాలు ముగించుకొని అమ్మవారి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తులతో పాటు వి.విఐపిలను సైతం అనుమతించకపోవడం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంది. ఈ అరుదైన ఘట్టానికి దేవాదాయ శాఖ సిబ్బంది మాత్రమే పూజారులకు అందుబాటులో ఉండి ఈ ఘట్టానికి ముందుంటారు. నాలుగు రోజులపాటు జరిగే మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క గద్దెపైకి చేరడం. రెండేళ్ళకొకసారి జరిగే మేడారం మహా జాతరకు విచ్చేసే లక్షలాది భక్తజనం ఎదురుచూసే మహత్తర కార్యక్రమం సమ్మక్క గద్దెపై కొలువుతీరడం. చిలకలగుట్టపై నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకువచ్చే కార్యక్రమం సాయంత్రం సుమారు 5గంటల నుంచి గిరిజన సాంప్రదాయం ప్రకారం సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య చిలకలగుట్టపై ఉన్న సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువస్తారు. చిలకలగుట్టపై నుండి మేడారం గద్దె వరకు సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పర్యవేక్షిస్తారు. చిలకలగుట్ట వద్ద జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క ప్రతిమతో వడ్డెలు (పూజారులు) బయలుదేరుతారు. సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుండి మేడారం వచ్చే సమయంలో భక్తులు సమ్మక్కకు ఎదురెల్లి కోళ్ళను, మేకపోతులను బలిస్తారు. వనదేవతలైన సమ్మక్క, సారక్క,గోవిందరాజు,పగిడిద్దరాజులు గద్దెలపై ఉండడంతో గురువారం రాత్రి నుండే అనేక మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
నేడు భక్తుల రద్దీ పెరిగే అవకాశం
సమ్మక్క, సారలమ్మలిద్దరూ గద్దెలపై ఉండడంతో తల్లులను దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం రాష్ట్రం నలుమూలల నుండే కాక ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. ఆర్‌టిసి బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా లక్షలాది మంది భక్తులు, సందర్శకులు ఇప్పటికే మేడారం చేరుకోగా గురువారం మేడారంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం కాస్తా జనారణ్యంగా మారిపోతుంది.

జాతరను విజయవంతం చేద్దాం

తల్లి ఆశీస్సులతోనే తెలంగాణ సాధ్యమైంది
మొక్కు తీర్చుకున్న ప్రొఫెసర్ కోదండరాం

మేడారం బృందం, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి సమ్మక్క- సారలమ్మ జాతరను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
బుధవారం మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకున్న కోదండరాం తులాభారంలో మొక్కు లు చెల్లించుకున్నారు. 83కేజీల బంగారం (బెల్లం)ను కోదండరాం తల్లులకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా పాలకుల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమ్మక్క- సారలమ్మ జాతరపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, మరిన్ని నిధులు కేటాయించి మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రా పాలనలో మేడారం జాతరలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క- సారలమ్మ తల్లుల ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం సాధ్యమైందని, సమ్మక్క గద్దెనెక్కిన వేళే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన విషయం ఆయన గుర్తు చేశారు. అయితే మేడారంలో అభివృద్ధి పనులు మరింతగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద మరిన్ని శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చవచ్చని అన్నారు. ప్రకృతి ఒడిలో జరుగుతున్న సమ్మక్క- సారలమ్మ జాతరను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయడంతో పాటు అడవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి ఆధారణే సమ్మక్క- సారలమ్మ నిజమైన నివాళులు అని, భక్తులు ఈ దిశగా అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తల్లులకు కోదండరాం మొక్కులు

సారలమ్మ రాక వేళ..

20 లక్షల మంది భక్తుల దర్శనం కిక్కిరిసిపోయిన ప్రాంగణం
నిండిపోయిన క్యూలైన్లు అప్రమత్తమైన పోలీసులు

ఆంధ్రభూమి బ్యూరో
మేడారం, ఫిబ్రవరి 17: కనె్నపెల్లి నుండి సారలమ్మ తల్లి మేడారం గద్దెను చేరుకున్న వేళ మేడారం భక్తులతో పోటెత్తింది. గత నెలరోజులుగా భక్తులు వరద ప్రవాహంలా మేడారంనకు తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్న క్రమంలో ఈ జాతరలో భక్తుల రాకపై కొందరిలో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సమ్మక్క-సారలమ్మ తల్లులపై తమకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని చాటిచెప్పేందుకు భక్తజనం మేడారం బాటపట్టారు. ఎన్ని ముందస్తు మొక్కులు చెల్లించినా జాతర రోజు మొక్కులు చెల్లించడమే జాతర విశేషం కావడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మంగళవారం అర్ధరాత్రి నుండి భక్తుల రాక వరద ప్రవాహాన్ని తలపించింది. బుధవారం ఉదయం వరకూ మేడారం దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. కీకారణ్యమంతా జనారణ్యంగా మారిపోయింది. ఎటుచూసినా జన గుడారాలే కనిపిస్తున్నాయి. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర భక్తజనం నిండిపోయారు. మేడారంతో పాటు కనె్నపల్లి, కాల్వపల్లి, ఊరట్టం, ఎలిబాక, నార్లాపూర్, కొత్తూరు, పడిగాపూర్ గ్రామాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. తల్లులను దర్శించుకునేందుకు బంగారం (బెల్లం)తో క్యూలైన్లో గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. పిల్లా, పాపలతో కుటుంబసమేతంగా తరలివచ్చిన భక్తజనం తమ ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరారు. భక్తుల రాక బుధవారం అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బుధవారం ఒక్కరోజే తల్లులను దర్శించుకున్న భక్తుల సంఖ్య 20 లక్షలకు చేరినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం నాటికి ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో వారు మరింత అప్రమత్తమయ్యారు. కాగా, నేడు సమ్మక్క తల్లి ఆగమనం కానుండటంతో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరగనుంది. 19న ముఖ్యమంత్రి కెసిఆర్ మేడారంనకు చేరుకుని ఇద్దరు తల్లులకు మొక్కులు చెల్లించుకోనున్నారు. తల్లుల దయతోనే తెలంగాణ రాష్ట్రం సాధించామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేడారం తొలిజాతర కావడంతో ప్రభుత్వం కూడా జాతర ఎర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తల్లులు గద్దెలకు చేరుకోగానే భక్తులు మొక్కుబడులు చెల్లించుకుని తిరుగుబాట పడతారు. ఈనెల 20న ఇద్దరు తల్లుల వనప్రవేశం ముగియగానే జాతర ఘట్టం ముగుస్తుంది.

కాకతీయ ఉత్సవంగా మేడారం!

దేశ వ్యాప్తంగా జాతరకు గుర్తింపు
తెచ్చేందుకు ప్రభుత్వ ఆలోచన
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, ఫిబ్రవరి 17: మళ్లీ వచ్చే మేడారం జాతరను కాకతీయ ఉత్సవం పేరిట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాకతీయ ఉత్సవం పేరిట మేడారం జాతర నిర్వహించినట్లయితే దేశ వ్యాప్తంగా జాతరకు మరింత గుర్తింపు వచ్చి జాతర ప్రతిష్ట పెంచే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ జాతరను కాకతీయ ఉత్సవం పేరిట నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకొని సమ్మక్క - సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇద్దరిని దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న సమ్మక్క - సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుందన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్న అనుభవంతో ప్రస్తుతం జాతరలో కూడా కట్టుదిట్టమైన చర్యలతో భక్తులకు సురక్షిత దర్శనమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 182కోట్ల రూపాయలను వెచ్చించి జాతర ఏర్పాట్లు చేశామన్నారు. జాతరలో 10వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తులాబారం తూకగా 93 కిలోల బరువు ఉన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటన సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్ వెంట ఉండగా జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మంత్రికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.