తెలంగాణ

ఏకగ్రీవమా..ఎన్నికలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 11: రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏకగ్రీవంతో ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార టిఆర్‌ఎస్.. కరీంనగర్‌లోని రెండు స్థానాలను సైతం ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తుండగా, జిల్లా మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా రంగంలోకి దిగారు. నలుగురు స్వతంత్రులు నామినేషన్లు వేయగా, అందులో ఇద్దరు స్వతంత్రులు ఉపసంహరణ చేసుకోగా, మిగిలిన మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తుండటంతో జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయా? లేక ఏకగ్రీవమేనా? అనేది హాట్‌టాఫిక్‌గా మారిం ది. జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకుగాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా, అందులో ఒక నామినేషన్ తిరస్కరణకు గురికాగా, ఆరు నామినేషన్లు ఓకే అయిన సంగతి తెలిసిందే. ఆరుగురిలో ఇద్దరు టిఆర్‌ఎస్ అభ్యర్థులు తానిపర్తి భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్‌రావులు కాగా, మిగిలిన నలుగురు స్వతంత్ర అభ్యర్థులు మినుపాల తిరుపతిరావు, ముద్దసాని రంగయ్య, ముత్యాల ప్రియారెడ్డి అలియాస్ శ్రీప్రియారెడ్డి, సరిళ్ల ప్రసాద్‌లు బరిలో ఉన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడంతో ఎలాగైనా ఏకగ్రీవం చేసుకోవాలనే గట్టి తలంపుతో అధికార టిఆర్‌ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పక్క జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో జిల్లా మంత్రికి సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఏకగ్రీవం చేసేందుకు మంత్రి స్వయంగా రంగంలోకి దిగి కథ నడిపిస్తుండగా, నలుగురు స్వతంత్రుల్లో ఇద్దరు మినుపాల తిరుపతిరావు, సరిళ్ల ప్రసాద్‌లు శుక్రవారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన మరో ఇద్దరు స్వతంత్రులను సైతం విత్‌డ్రా చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి దగ్గరి బంధువులు, సన్నిహితులతో జోరుగా మంతనాలు జరుపుతుండగా, వారు ఉపసంహరణకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. నేటి (శనివారం) మధ్యాహ్నం వరకు గడువు ఉండగా, ఈలోగా వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఏకగ్రీవం దిశగానే పయనిస్తున్నట్లు చెప్పొచ్చు. అయినా, జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయా? లేక ఏకగ్రీవమేనా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన పార్టీ సమావేశంలో శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కాగా, జిల్లాలో 57 మంది జడ్పీటిసిలు, 817 మంది ఎంపిటిసిలు, 326 మంది కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఇద్దరు ఎంపిలు, 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మొత్తం 1212 మంది ఓటర్లుండగా, వీరిలో ఆరుగురు వివిధ కారణాలతో అనర్హులుగా మారగా, మొత్తం 1206 మంది ఓటర్లుగా ఉన్నారు.
ఇందులో మెజారిటీ ప్రజాప్రతినిధులు అధికార టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. మొత్తం మీద ఓ వైపు ఏకగ్రీవం కోసం గులాబీ నేతలు శతవిధాల ప్రయత్నాలు చేస్తుండటం, మరోవైపు ఉపసంహరణకు కొన్ని గంటలే మిగిలి ఉండటంతో మండలి పోరుపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు శనివారం మధ్యాహ్నం కల్లా తెరపడనుంది.

ఇద్దరు మావోల అరెస్టు
భద్రాచలం, డిసెంబర్ 11: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా సుర్నా అటవీప్రాంతంలో పోలీసులు శుక్రవారం ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. పశ్చిమబస్తర్‌లోని సఫ్లాయి ప్లాటూన్ డెప్యూటీ కమాండర్ అప్కా రాజు, డుమామ్ ఎల్‌వోఎస్ దళ సభ్యుడు మడివి మంగడులను ఎస్టీఎఫ్, డీఆర్‌జీ బలగాలు పట్టుకున్నాయి. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వీరు తారసపడగా అనుమానంతో విచారించి వారిని అరెస్టు చేసినట్లు బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు.

ఇద్దరు రైతుల ఆత్మహత్య
డోర్నకల్, డిసెంబర్ 11: అప్పుల బాధలతో వరంగల్ జిల్లాలో ఇద్దరు రైతులు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నారు. డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామశివారు మోదుగుగడ్డ తండాకు చెందిన రైతు దరావత్ రమేష్ (27) ఖమ్మంలో కొన్న మిర్చి విత్తనాలకు కాతపూత లేకపోవడంతో సదరు డీలర్‌ను నిలదీశాడు. దీంతో డీలర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలే పంట నష్టంతో కుంగిపోయన రమేష్... పోలీసులు కేసు పెట్టడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. అలాగే, జనగామ మండలం పెద్దరామచర్ల గ్రామానికి చెందిన నక్క రాములు (48) వర్షాభావం నేపథ్యంలో పంట నష్టం రావడంతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.