తెలంగాణ

పేద విద్యార్థుల కోసమే ‘అక్షయపాత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 7: పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన కంది శివారులో నిర్మించనున్న అక్షయపాత్ర భోజన శాల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి హై-టెక్ భోజనశాలగా నిలిచిపోతుందన్నారు. ఐదెకరాల స్థలంలో నిర్మించనున్న భోజనశాలకు బుధవారం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ భోజనశాల నిర్మాణం పూర్తయితే ప్రతి రోజు లక్ష మంది విద్యార్థులకు ఇక్కడి నుండే వేడి వేడి భోజనం సరఫరా జరుగుతుందన్నారు. ఈ భోజనశాల నిర్మాణానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి రూ. 18 కోట్లు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్న సుధామూర్తిని ధనికులందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా 16లక్షల మంది విద్యార్థులకు అన్నం పెడుతున్న అమ్మ సుధామూర్తి అని, విద్యార్థులు తినే ప్రతి నోటి ముద్దపై ఆమె పేరు ఉంటుందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అక్షయపాత్ర ద్వారా పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కంది మండల పరిధిలోనే ఐఐటి, అగ్రికల్చర్ కళాశాలతో పాటు ఇప్పుడు భారీ స్థాయిలో అక్షయ పాత్ర భోజన శాల నిర్మాణం కావడం ఆనందంగా ఉందన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సత్య గౌర చంద్ర దాస మాట్లాడుతూ 1500 మంది విద్యార్థులతో ప్రారంభమైన అక్షయపాత్ర నేడు 16లక్షల మంది విద్యార్థులకు భోజనాన్ని అందిస్తుందన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి మాట్లాడుతూ తరగతి గదిలో విద్యార్థులకు ఆకలి అన్నదే లేకుండా చేయడం, ప్రపంచ స్థాయి బోధన అందుబాటులోకి తీసుకరావాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ దాస నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఐఎఎస్ జగదీశ్వర్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ ప్రేమ్‌లాల్, డిఈఓ చంద్రకళ, జెడ్పీటిసి మనోహర్‌గౌడ్, సర్పంచ్ ఉమారాణి పాల్గొన్నారు.

కంది శివారులో నిర్మించనున్న అక్షయపాత్ర భోజనశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న
మంత్రి హరీశ్‌రావు.. చిత్రంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తి తదితరులు