తెలంగాణ

నిజాం షుగర్స్ ముగిసిన కథ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: ‘మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ముగిసిన కథ కాదు..’ అని విపక్ష నేతలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హెచ్చరించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ముగిసిన కథ అని లోగడ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ నేతలు మండిపడ్డారు. మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించి ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ జెఎసి ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి టి.టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం. అమర్‌నాథ్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభాపక్షం నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తికి ఈ ఫ్యాక్టరీలో 51 శాతం వాటా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆ వ్యక్తి ఫ్యాక్టరీని 13 నెలల క్రితం మూసేస్తే ప్రభుత్వం తెరిపించే ప్రయత్నం చేయకుండా ముగిసిన కథ అని చెప్పడం దారుణమని ఆయన విమర్శించారు. రైతులే నడిపించుకోవాలని ముఖ్యమంత్రి దాట వేయడం భావ్యం కాదని అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుని నడిపిస్తుందని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నిస్తే, జీవన్‌రెడ్డిని చైర్మన్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నారని ఆయన తెలిపారు. జీవన్‌రెడ్డికి అనుభవం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని అప్పగించాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ, ప్రభుత్వ వసతి గృహాలకు అవసరమయ్యే చక్కెరను ప్రభుత్వం కొనుగోలు చేస్తే తప్పకుండా లాభాలు వస్తాయని ఆయన తెలిపారు. రైతులతో నడిపించేందుకు తమ వద్ద ప్రణాళిక ఉందని అన్నారు. ప్రభుత్వమే ఫ్యాక్టరీని నడిపించాలని, చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కిసాన్, ఖేత్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
తెగిస్తే తప్ప సాధ్యం కాదు..
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ తెగిస్తే తప్ప అనుకున్నది సాధించలేమని అన్నారు. ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన ఫ్యాక్టరీల కార్మికులకు పిలుపునిచ్చారు. నాలుగు నిజాం షుగర్ ఫ్యాక్టరీల నుంచి పాదయాత్రలు చేపట్టి హైదరాబాద్‌కు తరలి వచ్చి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని అన్నారు.
సామాజికవేత్త జస్టిస్ చంద్రకుమార్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి తలచుకుంటే మూతపడిన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానని ముఖ్యమంత్రి అన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు నమ్మకం సన్నగిల్లుతున్నదని అన్నారు. బిజెపికి అనుబంధ విభాగమైన కిసాన్ మోర్చా నాయకుడు సుధాకర్ రావు ప్రసంగిస్తూ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్న నాలుగు జిల్లాల ప్రజలు టిఆర్‌ఎస్ నాయకులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన అమర్‌నాథ్ బాబు ప్రసంగిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం చేసిన డిక్లరేషన్‌ను వివరించారు. అసెంబ్లీలో చెరకు రైతుల సంక్షేమం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అఖిలపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, చెరకు పంట వేస్తా, సర్కారే ఫ్యాక్టరీని నడపాలి అని సంక్రాంతి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని, పాదయాత్రలు చేపట్టాలని, మెట్‌పల్లిలో కార్మికులు చేపట్టే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో మహిళా సమాఖ్య నాయకురాలు పశ్య పద్మ, తెలంగాణ రైతు సంఘం నాయకుడు సాగర్, యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్‌సి, ఎస్‌టిల ప్రతినిధి జె.కుమార స్వామి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మికులు కె.రామాగౌడ్, బుచ్చిరెడ్డి, పి.వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, ఉపేందర్ తదితరులు ప్రసంగించారు.