తెలంగాణ

లంచగొండి ఇంజనీర్‌కు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), జనవరి 31: ఉన్నత ఉద్యోగం చేస్తూ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ నిందితుడైన విద్యుత్ శాఖ ఇంజనీర్ కొండ రాంచంద్రం (39)కు కరీంనగర్ స్పెషల్ ఎసిబి కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు మంగళవారం ఏడాది జైలుశిక్ష విధించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గిరిధర్‌రావు కథనం ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని క్యాతనపల్లి గ్రామానికి చెందిన సిరికొండ పోచయ్య వ్యవసాయ భూమిలో బోరు వేశాడు. దీనికోసం విద్యుత్ మీటర్‌ను అమర్చాలని తగిన రుసుము చెల్లించి మందమర్రి విద్యుత్ అధికారులను కోరాడు. కరెంట్ మీటర్ అమర్చాలంటే రెండు విద్యుత్ స్థంభాలు అవసరం ఉండడంతో అధికారులు ఆయా స్థంభాలను మంజూరు చేశారు. అయతే, కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండా పోచయ్య బావి వద్దకు కేబుల్ ద్వారా కరెంట్ సరఫరా చేశారు. దీంతో కరెంట్ మోటార్ కాలిపోవడంతో పోచయ్య విద్యుత్ శాఖ అధికారి కొండ రాంచంద్రంను ఆశ్రయించగా నాలుగు వేల రూపాయలు లంచం ఇస్తేనే రెండు స్థంభాలను నిలిపి విద్యుత్ తీగలు లాగి కరెంట్ కనెక్షన్ ఇస్తామని డిమాండ్ చేశాడు. పోచయ్య పలుమార్లు అంత డబ్బు ఇవ్వలేనని తెలిపినప్పటికీ ఇంజనీర్ రాంచంద్రం ఒప్పుకోలేదు. దీంతో పోచయ్య ఆదిలాబాద్ ఎసిబి అధికారులను సంప్రదించాడు. పోచయ్య మంచిర్యాలలో రాంచంద్రం ఇంటికి వెళ్లి నాలుగు వేల రూపాయలు లంచం ఇచ్చి బయటికి రాగానే ఎసిబి అధికారులు పథకం ప్రకారం రాంచంద్రంను 2008 సంవత్సరం మే 23న పట్టుకొని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాంచంద్రంపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చిన అనంతరం చార్జిషీట్ దాఖలు చేసి సాక్షులను ప్రవేశపెట్టారు. తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితుడైన అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ కొండ రాంచంద్రంపై నేరం రుజువు కావడంతో ఏడాది జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఫిర్యాదుదారుడిపై కేసు నమోదుకు కోర్టు నోటీసులు
విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఇంజనీర్ కొండ రాంచంద్రంను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించిన తదుపరి కేసు నమోదు చేశారు. దీనిపై సిరికొండ పోచయ్యను అధికారులు స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదిలాబాద్‌లో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఎసిబి కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా ఫిర్యాదుదారుడైన సిరికొండ పోచయ్య ప్రాసిక్యూషన్‌కు సహకరించక నిందితుడైన విద్యుత్ శాఖ ఇంజనీర్‌కు అనుకూలంగా సాక్ష్యం ఇచ్చాడు. దీనిని తీవ్రంగా పరిశీలించిన న్యాయస్థానం సిరికొండ పోచయ్యపై కేసు నమోదు చేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో పోచయ్య మార్చి 2వ తేదీన కరీంనగర్ ఎసిబి కోర్టులో హాజరై వివరాలు ఇవ్వవలసి ఉంది.