తెలంగాణ

ఒక్క ఎకరం ఎండితే ఒట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 4: తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు. పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులను తప్పుదోవ పట్టించి ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి పోచారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద కమాండ్ ఏరియాలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం పంట సైతం ఎండిపోలేదని అన్నారు. బోధన్ మండలం లంగ్డాపూర్‌కు చెందిన నారాయణ అనే కౌలు రైతు తన వరి పంటకు నిప్పంటించుకునేలా అతనిని పురిగొల్పారని, నిజానికి సదరు రైతు కౌలు భూమి నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోనే లేదన్నారు. మెట్ట భూమిలో బోర్లను నమ్ముకుని పంట వేసుకోగా, బోర్లు ఎండిపోవడంతో పంటకు నిప్పంటించుకున్నాడని తహశీల్దార్ రాతపూర్వకంగా నిర్ధారించారని ఆ లేఖను చూపించారు. తాము హామీ ఇచ్చిన మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాంసాగర్ ఆయకట్టు కింద 2.10లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు చేతికందే వరకు సాగునీరు అందించి తీరుతామని, ఈ విషయంలో రైతులు ప్రతిపక్షాల మాటలు నమ్మి అనవసర ఆందోళనకు గురికావద్దని హితవు పలికారు. నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయించిన మేరకు గత డిసెంబర్ 14వ తేదీ నాటి నుండే సాగర్ కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు నీటిని సరఫరా చేస్తున్నామని, ఇప్పటికే మూడు విడతల్లో 8.697టిఎంసిల నీటిని అందించామని, ప్రస్తుతం 4వ తడిని అందిస్తున్నామని మంత్రి పోచారం పేర్కొన్నారు. చివరి ఆయకట్టు వరకు కూడా సాగునీరు చేరాలనే ఉద్దేశ్యంతో నీటి పరిమాణాన్ని 1800క్యూసెక్కుల నుండి 2400 క్యూ సెక్కులకు పెంచామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్ల కాలంలో ఎన్నడు కూడా 1400క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదన్నారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి రైతుకు న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతో స్వయంగా తానే మూడు రోజుల నుండి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల వెంట తిరుగుతూ నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నానని మంత్రి పోచారం పేర్కొన్నారు. డి-28, డి-40, డి-46, డి-37, డి-35 కెనాళ్ల పరిధిలో కొంత సమస్యలు ఉండడంతో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి చివరి ప్రాంతం వరకు కూడా నీరు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ ద్వారా అవసరమైన మేరకే నీటిని వినియోగిస్తూ దిగువకు నీరందేలా పర్యవేక్షణ జరిపేందుకు విఆర్‌ఓలు, విఎఓలను ఏర్పాటు చేశామని చెప్పారు. నిజాంసాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల నీటి వృధా గణనీయంగా తగ్గిపోయిందని, ఫలితంగా చివరి ఆయకట్టుకు కూడా ప్రస్తుతం సమృద్ధిగా నీరు చేరుతోందని అన్నారు. కమాండ్ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా చూసే బాధ్యత తమదేనని, బోరుబావులపై ఆధారపడి ఉన్న రైతులకు 9గంటల పాటు నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అయితే నాన్ కమాండ్ ఏరియాలో బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోతే తామేమీ చేయలేమని, దీనికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే ఏడాదిన్నర కాలంలోపు కాళేశ్వరం, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల ద్వారా హల్దివాగు నుండి నిజాంసాగర్‌లోకి సమృద్ధిగా నీటిని మళ్లించుకోవడం ఖాయమని, రెండు పంటలకూ సరిపడా నీరందుతుందని పోచారం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 9వేల కోట్ల రూపాయల విలువ చేసే పనులు పూర్తయ్యాయని, 32కిలోమీటర్ల నిడివితో సొరంగ మార్గం తవ్వకం, 12కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తవ్వకం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పథకం అందుబాటులోకి వచ్చే సమయం నాటికి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీలన్నీ పూర్తిస్థాయిలో మరమ్మతులు జరిపిస్తామని, ఇందుకోసం సుమారు 215కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించామని, ప్రస్తుతం 100కోట్ల రూపాయల పనులకు టెండర్లు కూడా ఖరారయ్యాయని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీటిని సమకూర్చాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సాధించి చూపెడతారని మంత్రి పోచారం ధీమా వ్యక్తం చేశారు. విలేఖరుల సమావేశంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్యేలు హన్మంత్‌సింధే, జీవన్‌రెడ్డి, షకీల్ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి