అమృత వర్షిణి

మన్యంలో జలయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘క్రియాసిద్ధి సత్వేభవతి మహతాం నోపకరణే’’
- సంకల్పశుద్ధి, క్రియాశీలత, త్యాగం, సేవాభావం ఆభరణాలుగా కలిగిన వ్యక్తులకు కార్యసిద్ధి అందనంత దూరమేమీ కాదు. నిస్వార్థమైన కోరిక యొక్క అలౌకిక బలమే వారికి ఎనలేని శక్తినిస్తుంది. అలాంటి వారికి ఉపకరణాలతో పనిలేదు. - ఇదీ పై శ్లోకం యొక్క భావం.
కొంతమంది విషయంలో ఇది అక్షరసత్యం. అలాంటివారే మానవ సేవే మాధవ సేవ అని త్రికరణశుద్ధిగా నమ్ముతారు, ఆచరణలో చూపుతారు. ఒక పని చేయాలంటే కావాల్సింది నిష్కళంకమైన సంకల్పం, నూటికి నూరుపాళ్లు అందులో నిమగ్నం కావడం. అవి నిండుగా కలవారు ఎంతటి క్లిష్టమైన పనినైనా చేతల్లో చేసి చూపిస్తారు.
జనవరి నెల. చలి ఎక్కువగా ఉండే సమయం. అందులోనూ అటవీ ప్రాంతం. అక్కడి గూడేల్లో నివసించే గిరిజనులకు తమవంతు సాయంగా కనీసం కంబళ్ళు సరఫరా చేయాలని ఓ వ్యక్తి సంకల్పించాడు. దీని కోసం మిత్రుల సహకారం కోరాడు. డాక్టర్ జి. రఘుకిశోర్ స్థాపించిన ‘నేను సైతం’ సంస్థ తరపున వాట్సప్ గ్రూప్ ఓ చిన్న విన్నపాన్ని పోస్ట్ చేశారు. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే లక్షా 20వేల రూపాయలు సమకూరాయి. ఆ సొమ్ముతో కంబళ్ళు కొని పాడేరు, అరకు అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అందించాలనేది సంకల్పం.
అతను మూడు పదులు దాటిన యువకుడు. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. బాల్యంనుంచీ సత్యసాయిబాబా భక్తుడు. చిన్నప్పటినుంచీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అతని పేరే వి.వి.ఎన్.మూర్తి. అతని సంకల్పబలం గురించి ఎంత చెప్పినా తక్కువే. విశాఖ మన్యంలో నివసించే గిరిజనులకు తాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నమే చేశాడు. ఆ ప్రయత్నం ఫలించి రోగాల బారిన పడుతున్న గిరిజనులకు విముక్తి కలిగించి అపర భగీరథుడుగా నిలిచాడు.
పదేళ్ల నాటి మాట. విశాఖ మన్యంలోని పెదబయలు మండల ప్రాంతంలో అపరిశుభ్ర నీరు తాగడం వల్ల డయేరియా వ్యాధి సోకి 64మంది మృతి చెందారన్న వార్త మూర్తిని కలచివేసింది. మూర్తి అప్పుడు ఢిల్లీలో విద్యనభ్యసిస్తున్నాడు. అప్పటికప్పుడు బయలుదేరి ఆ గ్రామానికి వెళ్లాడు. అక్కడి గిరిజనులంతా బురదనీటిపైనే ఆధారపడ్డారని, ఒక బిందెడు తాగునీరు కావాలంటే కనీసం రెండు కిలోమీటర్లు లోయలోకి దిగడమో, ఎక్కడమో అనివార్యమని ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. వారి దుర్భరమైన జీవనం మూర్తిని కలచివేసింది. పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వగలిగితే అనారోగ్యం దూరమవుతుందని భావించాడు. ఇందుకోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. అతనికి సోదరుడు గణేష్, సహచరులు మధు, ప్రతాప్, శేషు తోడుగా నిలిచారు.
మిత్రులంతా మేధోమథనం మొదలుపెట్టారు. ఇంతటి బృహత్ కార్యం తామొక్కరి వల్లే సాధ్యం కాదని అర్థమైంది. రాయలసీమ దాహార్తిని తీర్చిన సత్యసాయిబాబా దృష్టికి తీసుకెళితే సహాయపడతారని నిర్ణయానికొచ్చారు. విశాఖ మన్యంలోని అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ గాలిపాడు, సంకుపర్తి, బెర్జవలస గ్రామాలకు చెందిన 150మంది గిరిజనులను తీసుకుని పుట్టపర్తి వెళ్లారు. ‘విశాఖ మన్యంలో తాగునీరు లేక అగచాట్లు పడుతున్నారని, డబ్బు సమకూరిస్తే తాము శ్రమించి మంచినీరు అందిస్తామని సత్యసాయికి విన్నవించుకున్నారు. ‘చాలా మంచి సంకల్పం నాయనా... సాధిస్తారు. తప్పకుండా చెయ్యండి’ అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. డబ్బు సంగతేమీ మాట్లాడలేదు. మిత్ర బృందం హతాశులైంది. మీమాంసలో పడిపోయారు. ఇంతలో విశాఖపట్టణానికి చెందిన బాబా భక్తురాలు మూర్తిని చేరుకుని ‘స్వామితో ఏం మాట్లాడారు?’ అని అడిగింది. విషయం తెలుసుకున్న ఆవిడ ‘ఏం చేయదలుచుకున్నారు?’ అని మళ్లీ ప్రశ్నించింది. ‘స్వామి అనుజ్ఞ ఉంది కాబట్టి ఈ పని ప్రారంభిస్తాం’ అన్నారు మిత్రులు. ‘మంచిది... నా తరపున లక్షా యాభైవేలు ఇస్తున్నాను. తీసుకోండి’ అని వెంటనే ధనం సమకూర్చారు. అలా ప్రారంభమైంది మన్యంలో జలయజ్ఞం. ఆ ఊరికి వెళ్లాలంటేనే 18 కి.మీ కొండల్లో కాలినడకన వెళ్లాలి. అలాంటిచోట నీటి సరఫరా చర్యలకు స్వయంగా రంగంలోకి దిగింది మూర్తి బృందం.
కొండల్లో ఊటనీరు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అది కిందకు వచ్చే క్రమంలోనే మురికిగా మారుతోందని గమనించింది మూర్తి బృందం. కొండపైనున్న ఊట నీటిని పైపులద్వారా గ్రామాల్లోకి తీసుకురాగలిగితేనే గిరిజనులకు తాగునీరు అందుతుంది. ఇది ఎంత కష్టమో, ఎంత శ్రమతో కూడుకున్నదో అర్థమవుతూనే వుంది. ఎలాగైనా సాధించాలనే పట్టుదల మరింతగా పెరిగింది. కనీసం రెండు మూడు కిలోమీటర్ల మేర... మూడు అడుగుల లోతు కొండని తవ్వాలి. పైపులు వేయాలి. సిమెంటు దిమ్మెలు నిర్మించాలి. కొండ మీదకు వెళ్లడానికి, పైపులు తీసుకువెళ్లేందుకు కాలినడకే గతి. అయినా ఆ యువకులు కార్యరంగంలోకి దూకారు.
మూర్తి బృందంలోని వారెవరూ పూర్తి సమయం వెచ్చించేవారు కాదు. వారి జీవనం వారు కొనసాగిస్తూ ఖాళీ సమయాల్లో మాత్రమే వారు ఈ పనులకు పూనుకునేవారు. వారాంతంలో పగలూ రాత్రి ఆ కొండల్లోనే జీవించడం, అక్కడే పడుకోవడం. అలా కష్టపడి పైపులు వేశారు. కొండలు గుట్టలు ఎక్కి, పలుగూ పార చేతబట్టి కేవలం ఆరు నెలల వ్యవధిలోనే స్వచ్ఛమైన జలధారను గ్రామం వరకు తీసుకురాగలిగారు. కలా? నిజమా? అని ఆశ్చర్యపోయే రీతిలో అమృతధార ముంగిట చేరడంతో గిరిజనుల ఆనందానికి అవధుల్లేవు. తరతరాలుగా బురద నీరు తాగుతూ అనారోగ్యం పాలవుతున్న బతుకుల్లో స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడం ఓ అద్భుతంలా తోచింది. విశాఖ మన్యంలోని కనీసం మూడువేల గ్రామాలకు నీరు అందించాలని మూర్తి నిర్ణయించుకున్నాడు. మొదటి ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆరు నెలలు పట్టింది. స్వచ్ఛమైన జలధార గ్రామాలకు చేరడంతో మూర్తిపై మన్యం వాసులకు నమ్మకం కలిగింది. ఓ ఆపద్భాంధవుడిలా కనిపించాడు. ఇప్పటివరకు 75 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించింది మూర్తి బృందం.
దీంతో మా గ్రామానికీ మంచినీరు ఇప్పించండి అనే విజ్ఞప్తులు పెరిగాయి. అలాంటి వారికి మూర్తి షరతులు విధించాడు. విప్పకల్లు, నాటుసారాకు బానిసలైన గిరిజనుల్లో మార్పు రావాలంటే ఆధ్యాత్మికవైపు మళ్లించడమే మార్గమనుకున్నాడు. తాగునీరు కావాలంటే గ్రామస్థులే శ్రమదానం చేయాలి. అవసరమైన ప్రణాళిక, నిధులు సమకూర్చడం మూర్తి వంతు. పైపులు, సింటెక్స్ ట్యాంకులు, కుళాయిలు, కాంక్రీటు దిమ్మలు సమకూర్చి, వారితోనే శ్రమదానం చేయించాలనేది మొదటి షరతు.
ఇక రెండోది - ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు ప్రతి ఇంటినుంచి ఒక వ్యక్తి ముఖ్యంగా యువకులు పుట్టపర్తిలో వారం పదిరోజులు సేవ చేయాలి. ఇలా ప్రతి ఏడాది వెయ్యి నుంచి 1500మంది వరకు గిరిజనులను పుట్టపర్తి తీసుకెళుతున్నారు. అలా వెళ్లివచ్చిన వారిలో కలిగిన పరివర్తన మూర్తి బృందానికే కాదు, గ్రామంలోని వారికి ఆశ్చర్యం కలిగించింది. సాత్విక పరివర్తన కొట్టొచ్చినట్లు కనిపించేది. పిల్లలను పాఠశాలకు పంపడం, శ్రమదానంతో వౌలిక వసతులు కల్పించుకోవడం వంటి అనేక మార్పులకు మూర్తి బృందం చేసిన కృషి ఫలితమే. మెట్టువలస, చినమామిడి, చిననందిపట్టు, పెదనందిపట్టు, అంగిలి, అడపరాయి, కొత్తూరు, బురదగుమ్మ, గేతెలపాడు, గవ్వలమామిడి, రంగసుడిపాడు, సుడిపెట్ట, సోడ, చింతలమామిడి, రడి, కంసాలిగొంది, మార్చివీధి... ఇలా వందల గ్రామాల చెంతకు జలధార చేరుకుంది. ఊటజలం కావడంతో ఆగిపోయే ప్రసక్తి లేదు. నగరాల్లోనూ కనిపించని నిరంతర నీటి సరఫరా ఇప్పుడీ గ్రామాల సొంతం. గత సంక్రాంతి నాడు ప్రారంభమైన గుంపాం మంచినీటి ప్రాజెక్టు 270వది అంటే ఎవరికైనా నమ్మశక్యం కానిదే. ఈ ప్రాజెక్టుకు ‘శ్రీ సత్యసాయి గిరిజన ప్రేమామృతధార మంచినీటి పథకం’ అని నామకరణం చేశారు. అభివృద్ధికి ఆమడదూరంలో కొండకోనల్లో నివసించే గిరిజనులకు తాగునీరును అందిస్తున్న మూర్తి ప్రచారానికి దూరంగా ఉంటాడు. ‘ఇంతటి బృహత్కారం వెనుక సత్యసాయిబాబా ఉన్నారు. ఆయనే మాచేత ఈ పనులు చేయిస్తున్నారు. పని మొత్తం నా మిత్రులు, గ్రామస్థులే చేస్తున్నారు. నేను కేవలం ముందుండి నడిపిస్తున్నాననంతే’ అంటాడు. జనవరి 31న తురుమామిడిలో పూర్తయిన మంచినీటి ప్రాజెక్టును ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ ప్రారంభించారు. గిరిజన గ్రామాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్‌నుంచి మూర్తి అభినందన పత్రం అందుకోవడం విశేషం.

చిత్రం... మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తున్న ప్రముఖ సినీ గేయ రచయత సిరివెనె్నల సీతారామశాస్ర్తి

-శ్రీరామశాస్ర్తీ, 9440066633