ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ఎడమ కాల్వ పనులు నత్తనడక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి.. ఈ కాల్వ పరిధిలో ప్రధానంగా రైల్వే, జాతీయ రహదారి క్రాసింగ్‌లు పూర్తికావాల్సివుంది. ఈ కాలువ ద్వారా నిర్దేశిత ఆయకట్టులో కొంతమేరకు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరివ్వాలనేది లక్ష్యం. సంకల్పబలం బాగానే ఉన్నప్పటికీ ఎక్కడా నిర్దేశిత పనులు లక్ష్యం మేరకు సాగడంలేదు. ఈ కాలువ పొడవు మొత్తం 174 కిలోమీటర్ల మేర పూర్తిచేయాల్సివుంది. మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు గత ఏడాది ఎస్‌ఇ సుగుణాకరరావు పునఃప్రారంభించారు. 2018 నాటికి మొత్తం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఎడమకాలువ 95 నుంచి 111 కిలోమీటర్ల వరకు ఐదవ రీచ్‌లో పనులను తిరిగి ప్రారంభించారు. ఈ పనులను పూర్తిచేయని షబీర్ డ్యామ్ కాంట్రాక్టు సంస్థకిచ్చిన కాంట్రాక్టును రద్దుచేసి స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు అదే రేట్లకు పిఎస్‌కె, హెచ్‌ఇఎస్ సంయుక్త సంస్థల అర్హతలను పరిశీలించి పనులను చేపట్టడానికి జీవో నెంబర్ 113 ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఈ కాలువ పనులు 2004-05లో ప్రారంభమయ్యాయి. మొత్తం ఎనిమిది ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ఇందులో రెండోప్యాకేజీ పనులు పూర్తయ్యాయి. మూడు, ఆరు, ఏడు ప్యాకేజీల్లో పాత కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఒకటి, నాలుగు, ఐదు, ఎనిమిది ప్యాకేజీల్లో పనులు గతంలో ఆగిపోవడంతో ఇందులో ఐదు ప్యాకేజీల్లో పనులు మొదలయ్యాయి. ఏలేరు ప్రాజెక్టుకు పురుషోత్తపట్నం పథకంలో నీరు అందించాలంటే ఈ ఐదవ ప్యాకేజీ విభాగంలో పనులు పూర్తి కావాల్సి వుంది.
పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు 10 టిఎంసిలు, తూర్పు గోదావరి జిల్లాలో 2.50 ఎకరాలు, విశాఖపట్నం జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. 2018 జూన్‌కల్లా విశాఖకు నీరు తరలించాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నట్టు ఎస్‌ఇ సుగుణాకరరావు చెప్పారు. 2018 నాటికి మిగిలిపోయిన 35 శాతం పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయన్నారు. ఐదవ ప్యాకేజీలో పెండింగ్‌లో పడిన రూ.142.88 కోట్ల పనులను చేపట్టారు. ఇందులో భాగంగా 5.768 కిలో మీటర్ల కాలువ తవ్వకం పనులు, దాదాపు ఆరు కిలో మీటర్ల సిమెంట్ లైనింగ్ పనులు, మొత్తం 33 వంతెనలు, బ్రిడ్జిలు, ఆక్విడెక్టులు నిర్మించాల్సివుంది.
లక్ష్యం మేరకు విశాఖ వరకు కాల్వ పనులు పూర్తి కావాలంటే రెండు చోట్ల రైల్వే క్రాసింగ్‌లు, మూడు చోట్ల జాతీయ రహదారి క్రాసింగ్ పనులు పూర్తి కావాల్సివుంది. వీటిని సత్వరం పూర్తిచేయడానికి అవసరమైన సాంకేతిక అనుమతుల కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎంత త్వరలో ఈ పనులు పూర్తిచేస్తే అంత త్వరగా లక్ష్యం మేరకు నీటిని విశాఖకు తీసుకెళ్ళే పరిస్థితివుంది. పోలవరం కుడి ప్రధాన కాల్వ పనులు పూర్తయిన నేపథ్యంలోనే ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా పూర్తయినపుడే లక్ష్యం మేరకు నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. మొత్తం మీద ఎడమ ప్రధాన కాల్వ ద్వారా 23.44 టిఎంసిల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. నేవిగేషన్‌కు అనుగుణంగా ఈ కాలువ పనులు జరుగుతున్నాయి. పట్టా, అటవీ, దేవాదాయ భూముల్లో మిగులు భూమి సుమారు 344 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఐదవ ప్యాకేజీ పరిధిలో దాదాపు 50 ఎకరాల పట్టా భూమి అవసరంగా గుర్తించారు. మొత్తంగా పరిశీలిస్తే ఇంకా దాదాపు 300 ఎకరాల వరకు సేకరించాల్సివుందని తెలుస్తోంది. ప్యాకేజీ ఎనిమిదిలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్యాకేజీ ఎనిమిదిలోనే రెండు రైల్వే క్రాసింగ్‌లు, రెండు ఎన్‌హెచ్ క్రాసింగ్‌లకు అనుమతులు పొందాల్సి వుంది. మొత్తం మీద ఎడమ కాలువలో ప్రతిబంధకాలన్నీ నిశితంగా ఎప్పటికపుడు సమీక్షించుకుంటూ పూర్తి చేయగలిగినపుడే లక్ష్యం మేరకు నీటిని విశాఖ వరకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

పోలవరం ఎడమ కాల్వ నిర్మాణంలో భాగంగా
దేవీపట్నం మండలం నేలకోట వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి