ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు సంవత్సరాలలో ఆరు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని దాన్ని సాధించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నట్లు ఐటి, కమ్యూనికేషన్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ గన్నవరం మేధా టవర్స్‌లో బుధవారం ఏడు ఐటి కంపెనీలను ఆయన ప్రారంభించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ తాను మంత్రిగా వచ్చిన 30 రోజుల్లోనే ఐటి రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏడు సంస్థలను ప్రారంభించామన్నారు. పలు ఐటి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, కొన్ని కంపెనీలు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఏడు కంపెనీలు జర్మనీకి చెందిన ఆంటోలిన్ గ్రూపు, అమెరికాకు చెందిన కంపెనీలు ఐఈఎస్, మెస్లోవా, యామహా సొల్యూషన్స్, భారతదేశానికి చెందిన కంపెనీలు రోటోమేకర్, చందూ సాఫ్ట్, ఈపీ సాఫ్ట్‌లను లాంఛనంగా మంత్రి ప్రారంభించారు. వీటి ద్వారా 1600 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. 2014లో బాబు రావాలి... జాబు రావాలి అనే నినాదంతో అధికారంలోకి వచ్చామని, దాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో యువతకు సాఫ్ట్‌వేర్‌లో లక్ష ఉద్యోగాలు, ఉత్పత్తి రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
విజయవాడ నగరంలో కెజి సాఫ్ట్ ఐటి కంపెనీని ప్రారంభించామని, దాని ద్వారా 300మందికి ఉద్యోగాలు లభిస్తాయని, మేధా టవర్స్‌లో ఏడు కంపెనీలు ప్రారంభించటం వల్ల 1600 మందికి ఐటి నిపుణులకు, హెచ్‌సిఎల్ ద్వారా 5వేల మందికి మొత్తం ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని వివరించారు. యువతకు సాఫ్ట్‌వేర్‌లో స్కిల్స్ పెంపొందించడానికి శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐటి నిపుణులకు కొదువలేదని తెలిపారు. తెలివైన వాళ్లు అందరూ అమెరికా వెళుతున్నారని, దాంతో అమెరికా అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. అమరావతికి కూడా అన్ని ప్రాంతాల వారు రావాలని, అప్పుడే అమరావతి కాస్మొపాలిటన్ సిటీగా తయారు అవుతుందన్నారు. ఇదీ మన తెలుగు వారి ప్రతిభ అంటూ అభివర్ణించారు. స్థానికంగానే కార్ ఇంటీరియర్ తయారీ సంస్థ, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేసే కంపెనీలు ఇక్కడకు రావటం సంతోషదాయకమన్నారు. కర్నాటక, మహారాష్టల్రతో పోటీపడి కియా లాంటి ప్రముఖ సంస్థను అనంతపురం జిల్లాకు తెచ్చామని తెలిపారు. మొబైల్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ కంపెనీని శ్రీసిటీలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల మొదటి విడతలో 13 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. విశాఖలో నిర్మిస్తున్న మిలీనియం ఫేజ్-1 టవర్స్‌ను ఆగస్టులోపు పూర్తి చేస్తామని, అది పూర్తి అయితే ఐటికి ఐకాన్‌గా అవుతుందని తెలిపారు. అమరావతి రాజధానికి వేగవంతమైన వాయు రవాణా, రోడ్డు రవాణా, రైలు రవాణా లభించేవిధంగా చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులో ఇంకా సౌకర్యాలు పెంచుతామని చెప్పారు. అనంతరం మంత్రి నారా లోకేష్ ఐటి ఉద్యోగుల సౌకర్యార్థం మేధా టవర్స్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్‌స్టాండ్ వరకు ఏసి బస్సును ప్రారంభించి ఆవరణలో ఒక మొక్కను కూడా నాటారు.

చిత్రం... మేధా టవర్స్ ముందు ఐటి కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్