తెలంగాణ

ముహూర్తానికే మెట్రో ‘కూత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూన్ 2న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం?
మెట్రోతో మహానగర ట్రాఫిక్ సమస్యకు చెక్
ఆరు కి.మీ మినహా ఏడాదిలో మొదటి దశ పూర్తి
వివరాలు వెల్లడించిన ఎండి ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్, మే 6: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగర వాసులు మెట్రోరైలు కూత వినే సమయం ఆసన్నమైంది. మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన మెట్రోరైలు ముందస్తు ముహూర్తానికే పట్టాలెక్కనుంది. జూన్ 2న మెట్రో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినం పురస్కరించుకుని కారిడార్ 1లోని మియాపూర్- సంజీవరెడ్డినగర్, కారిడార్ 3లోని నాగోల్- బేగంపేట వరకు రెండు లైన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శనివారం నగరంలోని మెట్రోరైలు భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ మెట్రోరైలు మూడు కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న పనులను వివరించారు. ఇప్పటికే పనులు కొనసాగుతున్న మూడు కారిడార్లలోని 72 కిలోమీటర్ల మెట్రో రూట్‌లో పాతబస్తీలోని ఆరు కిలోమీటర్లు వినా పనులన్నీ పూర్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని పలు మహానగరాల్లో మెట్రోరైలు అందుబాటులో ఉన్నా, అక్కడున్న స్టేషన్లు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలకు భిన్నంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆధునిక సేవలు అందించేందుకు వీలుగా మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రోరైల్వే స్టేషన్లు ఆధునికంగా, ఆకట్టుకునేలా అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మెట్రోరైలులో ప్రయాణించేవారు మెట్రో స్టేషన్‌కు చేరుకునేందుకు వీలుగా ఎంఎంటిఎస్, ఆర్టీసీ బస్సుల్లో కూడా వినియోగించుకునేందుకు వీలుగా స్మార్ట్‌లను అందజేస్తామన్నారు. అంతేగాక, మెట్రో స్టేషన్లలోని మాల్స్‌లో షాపింగ్ చేసేందుకు వీలుగా కార్డులను రూపకల్పన చేస్తున్నామన్నారు. పంజాగుట్ట, హైటెక్‌సిటీ, ముసారాంబాగ్ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ఒకేచోట అన్ని రకాల సేవలందేలా మాల్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టి కంపెనీ 17 చోట్ల మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సులను, మరో 15 చోట్ల హైదరాబాద్ మెట్రో రైలు ఆధ్వర్యంలో పార్కింగ్ కాంప్లెక్సులను ఏర్పాటు చేస్తుందన్నారు. పార్కింగ్ యార్డుకు వచ్చే వాహనాల సంఖ్యను బట్టి ఇంకా స్థలం అవసరమైతే స్టేషన్లక పక్కనే ఉన్న ప్రైవేటు యజమానుల స్థలాలను పార్కింగ్‌కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ నుంచి ఐదారు కిలోమీటర్ల పరిధిలో ఆర్టీసి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా తామే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఫీడర్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, విమానాశ్రయాల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్లకు ప్రయాణికులను తీసుకువచ్చే వాహనాల్లో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.