తెలంగాణ

భద్రతపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీలను ఉక్కుపాదంతో అణచేద్దాం
దిక్కూలేనోళ్లకు పోలీసే అండకావాలి
టి.పోలీస్‌కు ప్రధాని మోదీ కితాబు
ఆ గౌరవం ఇనుమడించేలా కృషి చేద్దాం
త్వరలో 15 వేల మంది నియామకం
కొత్త వాహనాలకు రూ.500 కోట్లు
ఠాణాల నిర్వహణకు గరిష్ఠంగా 75వేలు
మీవల్లే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో విజయం
పోలీసులకు సిఎం కెసిఆర్ ప్రశంసలు
హెచ్‌ఐసిసిలో రాష్టస్థ్రాయి సదస్సు

హైదరాబాద్, మే 19: శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి వొత్తిళ్లకు తలొగ్గకండి. భద్రతపై రాజీలేని పని తీరు ప్రదర్శించండి’ అని సిఎం కె చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ‘మా ప్రభుత్వంలో పోలీసులపై రాజకీయ వొత్తిళ్లుండవు. శాంతి భద్రతల పరిరక్షణలో మీకు కల్పించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోండి’ అని సూచించారు. ‘ఉప్పులో కల్తీ. పప్పులో కల్తీ. పాలలో కల్తీ. కారం, పసుపులో కల్తీ. గుడ్లు, బియ్యం.. ఇలా అన్నీ కల్తీ. ఇలా ప్రతిదీ కల్తీ, నకిలీమయమైంది. అలాంటి నకిలీలు, కల్తీలకు రాష్ట్రంలో చోటులేకుండా ఉక్కుపాదంతో అణచేసే బాధ్యత మీదే’ అని కెసిఆర్ గుర్తు చేశారు. డబ్బున్నోడు పలుకుబడి ఉపయోగించి పనులు చేసుకుంటాడు. మరి ఏ దిక్కులేనోడి సంగతేంటి? దిక్కులేని వాడికి దేవుడే దిక్కని వదిలేయొద్దు. అలాంటి దిక్కులేనోడికి పోలీస్ దిక్కుకావాలి’ అని సూచించారు. హెచ్‌ఐసిసిలో శుక్రవారం రాష్టస్థ్రాయి పోలీస్ సదస్సు జరిగింది. సదస్సుకు ఎస్‌ఐ నుంచి డిజిపి వరకూ పోలీస్ వ్యవస్థ మొత్తం హాజరైంది. సదస్సులో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘నేనెప్పుడు ఢిల్లీకెళ్లినా ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకూ తెలంగాణ పోలీస్‌ను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. అలాటప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతుంటా’ అని ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర శాంతి భద్రతలకే పరిమితం కాకండి, దేశ భద్రతా వ్యవస్థకు దోహదపడేలా సేవలు అందించండి అని పిలుపునిచ్చారు. ‘యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా.. గ్రేటెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా’గా తెలంగాణకు గుర్తింపు తెచ్చారని సిఎం కొనియాడారు. వ్యవస్థలో మార్పుని ఆహ్వానిస్తూనే, మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించి అందిన గౌరవాన్ని ఇనుమడింపచేద్దామని పిలుపునిచ్చారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పోలీస్ సంక్షేమం, పటిష్టానికి అధిక నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే నాలుగు వేల వాహనాలు సమకూర్చామని, మంచి ఫలితాల సాధనకు ప్రోత్సహకరంగా మరో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఠాణాల స్థాయినిబట్టి నిర్వహణ కోసం నెలనెలా రూ.25, 50, 75 వేల చొప్పున ఇస్తున్నామన్నారు. ఏది అవసరమైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 12 వేల మంది పోలీసులను నియమించడంతో వీరి సంఖ్య 68 వేలకు చేరిందని, మరో 15 వేల మందిని కొత్తగా నియమించనున్నట్టు ప్రకటించారు. శాంతి భద్రతలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలనూ చక్కగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. పోలీసు పదోన్నతుల్లో జాప్యం కూడదని, పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని డిజిపికి సూచించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి గౌరవప్రదమైన వీడ్కోలు పలికి, ఇంటివద్ద ప్రభుత్వ వాహనంలో దింపాలని కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బాగుండటం వల్లే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని, ఈ ఖ్యాతి పోలీసుకే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే నక్సలిజం, తీవ్రవాదం ఎక్కువై శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని విభజనకు ముందు సృష్టించిన అపోహలను పటాపంచలు చేశారంటూ అభినందించారు. హైదరాబాద్‌లో పోలీసుల పని తీరు వల్లే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 99 స్థానాలు సాధించామన్నారు.
హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పౌరసరఫరాల కమిషనర్ సివి ఆనంద్, షీ టీమ్స్ అధిపతి స్వాతిలక్రా, గుడుంబా నియంత్రణలో అకున్ సభర్వాల్ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా కృషి చేశారని అభినందించారు. ఎస్పీ, డిస్పీ, సిఐ, ఎస్‌ఐలు పెట్టుకునే సమావేశాన్ని క్రైమ్ మీటింగ్ అని, క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే పదజాలాన్ని మార్చుకోవాలని సూచించారు. నేరస్తులు పెట్టుకునే సమావేశాన్ని క్రైమ్ మీటింగ్ అనడంలో అర్థముంది.. పోలీసులు క్రైమ్ మీటింగ్ పెట్టుకోవడమేంటి అని చమత్కారంగా ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరగా పోలీసుల పరిభాష మారాలని సూచించారు. హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన పోలీస్ ఎగ్జిబిషన్‌ను సిఎం సందర్శించగా, పోలీసు జాగిలాలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలకడం విశేషం.

చిత్రం... రాష్టస్థ్రాయి పోలీస్ సదస్సులో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్. సదస్సుకు హాజరైన వివిధ స్థాయిల అధికారులు